సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో నిర్వహించిన కీలక భేటీ ముగిసింది. నీటి వాటాల అంశంపై ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టేందుకు సిద్ధంగా ఉండాలని ఆయన దిశానిర్దేశం చేశారు. అసెంబ్లీ సమావేశాలకు మంత్రులందరూ తప్పనిసరిగా హాజరుకావాలని, బీఆర్ఎస్ వైఫల్యాలను ఎండగట్టాలని సూచించారు.
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఉద్యోగుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు ఆరోపించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ఉద్యోగులకు పీఆర్సీ, ఓపీఎస్, పెండింగ్ డీఏలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. హరీష్‌రావు మాటలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని మంత్రి శ్రీధర్‌బాబు కౌంటర్ ఇచ్చారు.
కామారెడ్డి జిల్లా గర్గుల్ గ్రామ శివారులోని ఓ పొలంలో బాంబు పేలడంతో ఒక కుక్క మృతి చెందింది. ఈ ఘటనతో రైతులు తీవ్ర ఆందోళనకు గురై పోలీసులకు ఫిర్యాదు చేశారు. మహబూబ్ నగర్‌కు చెందిన కొందరు వ్యక్తులపై గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేయగా.. పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. కార్యాలయ తలుపులు మూసివేసి రికార్డులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. తనిఖీల సమయంలో మీడియాను లోపలికి అనుమతించలేదు. అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఈ దాడులు జరిగినట్లు సమాచారం.
వికారాబాద్ జిల్లా నవాబుపేట రైతులు రైతు బజార్‌లో దళారుల ఆధిపత్యంపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. అధికారులకు లంచాలిచ్చి దళారులే విక్రయాలు సాగిస్తున్నారని, అసలైన రైతులను అనుమతించడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
సీపీఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ శ్రీకాకుళంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై విమర్శలు గుప్పించారు. ఉపాధి హామీ పథకాన్ని కేంద్రం నిర్వీర్యం చేస్తోందని, పీపీపీ విధానం పేరుతో ప్రభుత్వ కాలేజీలను ప్రైవేటు వ్యక్తులకు దోచిపెడుతున్నారని ఆరోపించారు. కార్పొరేట్ శక్తులకు ప్రభుత్వం ఊడిగం చేస్తోందని ధ్వజమెత్తారు.
మేడ్చల్ జిల్లా షామీర్‌పేట్‌లో చిరుత పులి సంచారం కలకలం రేపింది. రాజీవ్ రహదారి ఆనుకొని ఉన్న విదర్భ వెంచర్‌లో చిరుత పులి కనిపించడంతో చిరుత ఫోటో తీసిన వెంఛర్ నిర్వాహకులు.. అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు.
ఏపీ కేబినెట్ సమావేశంలో రాయచోటి జిల్లా అంశంపై మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్నారు. రాయచోటిని మదనపల్లి జిల్లాలో కలపవద్దని ఆయన సీఎం చంద్రబాబును కోరారు. స్పందించిన సీఎం, మంత్రిని ఓదార్చి అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్నాకే తుది నిర్ణయం తీసుకుంటామని భరోసా ఇచ్చారు.
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో చైన్ స్నాచర్లు మళ్ళీ రెచ్చిపోయారు. నగరంలోని సుభాష్ నగర్‌లో బాశెట్టి బాగిర్తి అనే మహిళ తన ఇంటి ముందు చెట్లకు నీళ్లు పోస్తుండగా, బైక్ పై వచ్చిన ఇద్దరు దుండగులు ఆమె మెడలోని రెండు తులాల బంగారు గొలుసును లాక్కెళ్లారు.
జగిత్యాల సబ్‌జైల్లో రిమాండ్ ఖైదీ కొత్వల్ కృష్ణ గుండెపోటుతో మృతి చెందారు. సైబర్ క్రైమ్ కేసులో అరెస్టయిన ఆయనకు ఛాతీనొప్పి రావడంతో ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించారు. తన భర్త నిర్దోషని, కేవలం డ్రైవర్‌గా పనిచేసేవాడని మృతుడి భార్య ఆవేదన వ్యక్తం చేశారు.
జనగామ జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. విహారయాత్రకు వెళ్లి వస్తుండగా ఖమ్మం జిల్లా తల్లాడ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు స్నేహితులు మృతి చెందారు. పూరీ జగన్నాథ ఆలయాన్ని సందర్శించి కారులో తిరిగి వస్తుండగా లారీ ఢీకొనడంతో ఈ ఘోరం జరిగింది.
అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాయచోటిని కొనసాగించాలని కోరుతూ రాజకీయాలకు అతీతంగా భారీ నిరసన ర్యాలీ జరిగింది. వైసీపీ, టీడీపీ నేతలతో పాటు విద్యార్థులు తరగతులు బహిష్కరించి రోడ్లెక్కారు. జేఏసీ ఆధ్వర్యంలో శివాలయం చెక్‌పోస్ట్ నుంచి బంగ్లా సర్కిల్ వరకు ప్లకార్డులతో నిరసన తెలిపారు.
తిరుమలలో భక్తుల రద్దీ ఒక్కసారిగా తగ్గింది. ప్రస్తుతం కేవలం 12 కంపార్ట్‌మెంట్లలో మాత్రమే భక్తులు వేచి ఉండటంతో దర్శనం వేగంగా సాగుతోంది. అయితే, వైకుంఠ ఏకాదశి దృష్ట్యా రేపటి నుంచి మూడు రోజుల పాటు లక్కీ డిప్పులో స్లాట్ దర్శనం పొందిన వారికి మాత్రమే అనుమతి ఉంటుందని టీటీడీ స్పష్టం చేసింది.
ములకలచెరువు నకిలీ మద్యం కేసులో ప్రధాన నిందితుడు అద్దెపల్లి జనార్దన్‌రావు సహా ఐదుగురి ఎక్సైజ్ పోలీస్ కస్టడీ ముగిసింది. విచారణలో హైదరాబాద్ నుంచి లేబుళ్లు, గోవా నుంచి ముడిపదార్థాలు తెచ్చినట్లు నిందితులు వెల్లడించారు. వైద్య పరీక్షల అనంతరం వీరిని నెల్లూరు జిల్లా జైలుకు తరలించనున్నారు.
నెల్లూరు జిల్లా సైదాపురం మండలం రాపూరు రోడ్డు వద్ద జరిగిన ప్రమాదంలో ఆరేళ్ల బాలుడు దక్షేష్ మృతి చెందాడు. రోడ్డు దాటుతుండగా టిప్పర్‌ను చూసి భయపడి వెనక్కి రావడంతో బాలుడిని ఢీకొట్టిన టిప్పర్ పక్కనే ఉన్న దుకాణంలోకి దూసుకెళ్లింది. ఆసుపత్రికి తరలించేలోపే బాలుడు ప్రాణాలు కోల్పోగా, పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికే దిశగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో జెలెన్‌స్కీ ఫ్లోరిడాలో భేటీ అయ్యారు. యుద్ధ నివారణకు ఉక్రెయిన్ రూపొందించిన 20 పాయింట్ల శాంతి ప్రణాళికపై ఇరువురు చర్చించారు.
అరావళి పర్వత శ్రేణుల నిర్వచనాన్ని పరిమితం చేస్తూ గతంలో ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే విధించింది. సముద్ర మట్టం నుంచి కనీసం 100 మీటర్ల ఎత్తు ఉన్న వాటినే అరావళిగా పరిగణించాలన్న తీర్పును పునఃసమీక్షించాలని నిర్ణయించింది.
2017 ఉన్నావ్ అత్యాచారం కేసు దోషి కుల్దీప్ సింగ్ సెంగర్ జీవిత ఖైదు నిలిపివేతపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఊరటను సవాలు చేస్తూ.. సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం ఈ నిర్ణయం తీసుకుంది.
విజయ్ హజారే ట్రోఫీ మూడో రౌండ్‌లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ బరిలోకి దిగలేదు. న్యూజిలాండ్ వన్డే సిరీస్‌కు ముందు వీరిద్దరూ ఇప్పటికే రెండేసి మ్యాచ్‌లు ఆడారు. కోహ్లీ తన రెండు ఇన్నింగ్స్‌ల్లో 131, 77 పరుగులు చేయగా, రోహిత్ ఒక సెంచరీ సాధించారు. అయితే జనవరి 6న రైల్వేస్‌తో జరిగే మ్యాచ్‌లో కోహ్లీ ఆడే అవకాశం ఉండగా, రోహిత్ మాత్రం ఈ ట్రోఫీకి దూరమైనట్లే.
నటుడు అల్లు శిరీష్ తన వివాహ తేదీని అధికారికంగా ప్రకటించారు. వచ్చే ఏడాది మార్చి 6న తన ప్రియురాలు నయనికతో వివాహం జరగనున్నట్లు తెలిపారు. అయితే పెళ్లి ఎక్కడ జరగనుంది అనే విషయాన్ని మాత్రం వెళ్లడించలేదు. అల్లు అర్జున్ వివాహం కూడా గతంలో అదే తేదీన జరగడం విశేషం.