మహబూబ్ నగర్ జిల్లా జాతీయ రహదారి ఎన్ హెచ్ 44పై రోడ్డు ప్రమాదం జరిగింది. మూసాపేట వద్ద అర్ధరాత్రి 12 గంటల సమయంలో హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ఆర్టీసీ బస్సు లారీని ఓవర్టేక్ చేయబోయి అదుపుతప్పి రోడ్డు కిందకు దూసుకెళ్లింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 17 మంది ప్రయాణికులు ఉన్నారు. అయితే, ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ప్రకాశం జిల్లాలో ఓ స్కూల్ బస్సు దగ్ధమైంది. అర్ధవీడు మండలం పాపినేనిపల్లి గ్రామంలో కంభం పట్టణానికి చెందిన ఆల్ఫా స్కూల్ బస్సు డ్రైవర్, క్లీనర్ మధ్య తలెత్తిన వివాదం చివరకు బస్సు దగ్ధానికి దారితీసింది. బస్సుకు డ్రైవర్ నబి మరమ్మతులు చేస్తుండగా, క్లీనర్ గోపాల్ పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ ఘటనలో డ్రైవర్‌కు తీవ్ర గాయాలు కావడంతో అతడిని అర్ధవీడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కొద్దిగా రోజులుగా విధులు నిర్వహించుకునే క్రమంలో డ్రైవర్, క్లీనర్ మధ్య వివాదం నడుస్తోందని సమాచారం. ఈ ప్రమాదంలో బస్సు పూర్తిగా దగ్ధమైంది.
సీపీఎం నేత పెంచలయ్య దారుణ హత్యపై టీడీపీ, సీపీఎం నేతలు, స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితురాలు అరవ కామాక్షిని పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం నెల్లూరు ఆర్టీడీ కాలనీలో నివాసముంటున్న కామాక్షి, నిందితులకు ఇళ్లను స్థానికులు ధ్వంసం చేశారు. కామాక్షి తీరుతో తాము అనేక ఇబ్బందులు పడ్డామని ఆగ్రహం వ్యక్తం చేశారు. గంజాయికి వ్యతిరేకంగా పోరాటం చేస్తే హత్య చేయడం దుర్మార్గమని వారు ఆరోపించారు.
అనంతపురం వైసీపీ నేత రాసలీలలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఒక మహిళతో సన్నిహితంగా ఉన్న సమయంలో వైసీపీ నేత ఫణీంద్ర వీడియో తీసుకున్నాడు. శింగనమల వైసీపీ బీసీ సెల్ అధ్యక్షుడుగా ఫణీంద్ర పని చేస్తున్నాడు. తాను తీసుకున్న వీడియోను… తానే వాట్సాప్ గ్రూపుల్లోకి షేర్ చేశాడు. ఆ తర్వాత కొద్దిసేపటికి వీడియో డిలీట్ చేశాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫణీంద్ర రాసలీలల వీడియో హల్‌చల్ చేస్తోంది. అయితే… తన ఫోన్ ఎవరో హ్యాక్ చేశారని ఫణీంద్ర అంటున్నాడు. ఈ వ్యవహారంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
అమరావతి ఎసైన్డ్ భూముల కేసులో తమపై సీఐడీ నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ సీఎం చంద్రబాబు, మంత్రి నారాయణ దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టులో వాదనలు జరిగాయి. ఫిర్యాదుదారు మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి హాజరు కావడాన్ని పిటిషనర్ల తరఫు న్యాయవాది అభ్యంతరం చెప్పారు. దీనిపై విచారణలో తేలుస్తామని కోర్టు పేర్కొంది. తదుపరి విచారణను ఈ నెల 10కి వాయిదా వేసింది.
జోగులాంబ గద్వాల జిల్లా సల్కాపురం గ్రామంలో పంచాయతీ ఎన్నికల వేళ అరాచకం నెలకొంది. సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన ఆంజనేయులు అనే వ్యక్తికి బెదిరింపులు ఎదురయ్యాయి. తన నామినేషన్‌ను ఉపసంహరించుకోకపోతే చంపేస్తామంటూ ప్రత్యర్థులు తీవ్రంగా హెచ్చరించినట్లు ఆంజనేయులు తెలిపారు. అంతేకాకుండా, వారు తనపై దాడికి ప్రయత్నించి.. బూతులు తిట్టారని ఆరోపించారు. తనకు, తన కుటుంబానికి రక్షణ కల్పించాలని కోరుతూ ఆంజనేయులు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
పల్లెపోరులో హామీలు రోజురోజుకు హోరెత్తుతున్నాయి. గెలిపించండి, పథకాలు పొందండి అంటూ హమీల వర్షం కురిపిస్తున్నారు సర్పంచ్ అభ్యర్థులు. రంగారెడ్డి జిల్లా కొత్తపేటలో 15 హామీలతో సర్పంచ్ అభ్యర్థి మేనిఫెస్టో ప్రకటించారు. రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం కొత్తపేట గ్రామానికి చెందిన వనమ్మ నరసింహ యాదవ్.. తనను సర్పంచ్‌గా గెలిపిస్తే ప్రతి ఇంటికి 5 లక్షల చొప్పున జీవిత భీమా చేస్తానని హామీ ఇచ్చారు.
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు. హుస్నాబాద్ పట్టణంలోని సిద్ధేశ్వరాలయం, రేణుకా ఎల్లమ్మ ఆలయాలలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం రేపు హుస్నాబాద్ లో జరగబోయే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించారు. సభ ప్రాంగణంలో స్టేజి పనులు వేగవంతం చేయాలని సూచించారు. పట్టణం మొత్తం పార్టీ జెండాలతో అలకరించాలని పార్టీ నేతలకు సూచించారు.
ఏలూరు జిల్లాలోని చింతలపూడిలో ఎమ్మెల్యే రోషన్ కుమార్ ప్రైవేట్ ట్రావెల్ బస్సులను తనిఖీ చేశారు. ఇటీవల జరుగుతున్న బస్సు ప్రమాదాల నేపథ్యంలో అత్యవసర ద్వారం వాడకంపై ఆయన ప్రయాణికులకు అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు. ఈ సమయంలో ఒక మహిళ తన బ్యాగ్‌లోంచి చిన్న రాడ్ తీసి చూపించింది. ప్రమాదం జరిగితే బస్సు అద్దాలు పగలగొట్టడానికి దీనిని తెచ్చుకున్నానని ఆమె చెప్పడంతో ఎమ్మెల్యే రోషన్ షాక్‌కు గురై ఆశ్చర్యపోయారు.
మెదక్ జిల్లా హవేలీ ఘన్‌పూర్ మండలం కాప్రాయిపల్లి సర్పంచ్ అభ్యర్థి కుక్కల మౌనిక, రూ.100 బాండ్ పేపర్‌పై 15 అంశాలతో కూడిన ఎన్నికల హామీ పత్రాన్ని విడుదల చేశారు. తనను గెలిపిస్తే.. ఆడపిల్ల పుడితే రూ. 2000, వివిధ పండుగలకు నిధులు, అకాల మరణం చెందితే రూ. 5000 ఆర్థిక సహాయం వంటి హామీలు ఉన్నాయి. హామీలు నెరవేర్చకుంటే తనను కలెక్టర్ లేదా న్యాయస్థానం ద్వారా తొలగించవచ్చని బాండ్ పేపర్‌పై పేర్కొనడం స్థానికంగా, సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది.
కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం చేబ్రోలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఒక వ్యక్తి మృతి చెందాడు. శరభవరానికి చెందిన కూలీ రాత్రి 3 గంటలకు నీరసంగా ఆసుపత్రికి వచ్చాడు. ఆసుపత్రిలో సిబ్బంది లేకపోవడంతో చికిత్స అందక బయటే చనిపోయాడు. గత 6 నెలలుగా నైట్ డ్యూటీ సిబ్బంది ఉండడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. వైద్యం అందకే మృతి చెందాడని బంధువులు మృతదేహంతో పీహెచ్సీ వద్ద ఆందోళన చేస్తున్నారు.
ఏపీ మంత్రులు నారా లోకేష్, వంగలపూడి అనిత ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. వారు నేడు పార్లమెంట్‌లో కేంద్ర మంత్రులు అమిత్ షా, శివరాజ్ సింగ్ చౌహాన్‌లను కలవనున్నారు. ఇటీవల సంభవించిన ‘మొంథా’ తుఫాను వలన జరిగిన నష్టానికి సంబంధించిన సమగ్ర నివేదికను కేంద్ర మంత్రులకు అందజేయనున్నారు.
ఖమ్మం జిల్లా సత్తుపల్లి అటవీ ప్రాంతంలో వన్యప్రాణుల అక్రమ వేట కొనసాగిస్తున్న వేటగాళ్లపై DFO సిద్ధార్థ్ విక్రమ్ సింగ్ నేతృత్వంలో అటవీ శాఖ అధికారులు దాడి చేసి విచారణ చేపట్టారు. వేటకు సంబంధించిన ఆధారాలు సేకరించి నిందితులను అరెస్ట్ చేశారు. సంబంధిత అటవీ చట్టాల కింద కేసులు నమోదు చేసి, కోర్టు ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించారు. మరికొంతమంది వేటగాళ్ల పాత్ర ఉన్నట్లు దర్యాప్తులో తేలడంతో, అధికారులపై కూడా స్థానికంగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
అల్లూరి సీతారామరాజు జిల్లాలో డిసెంబర్ 2 నుండి 8 వరకు మావోయిస్టు వారోత్సవాల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎస్పీ అమిత్ బర్ధర్ ఆదేశాల మేరకు మారేడుమిల్లి మండలంలో ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టారు. ముమ్మర వాహన తనిఖీలు, విస్తృత కూంబింగ్ ఆపరేషన్‌లు నిర్వహిస్తున్నారు. నాయకులు, ప్రజాప్రతినిధులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ వివరాలను మారేడుమిల్లి సీఐ టి. గోపి నరేంద్ర ప్రసాద్ తెలిపారు.
చెన్నై మెట్రో రైలు సబ్‌వేలో చిక్కుకుపోయింది. విమ్కో నగర్ డిపో నుంచి చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం వైపు వెళ్లే మెట్రో ట్రైన్ సెంట్రల్ మెట్రో – హైకోర్టు స్టేషన్ మధ్యలో ఒక్కసారిగా ఆగిపోవడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. దీంతో వారు మధ్యలోనే దిగి రైల్వే ట్రాక్‌పై నడవాల్సి వచ్చింది. సెంట్రల్ మెట్రో – హైకోర్టు స్టేషన్ మధ్యఉన్న మెట్రో రైలు బ్లూ లైన్‌లో సాంకేతిక లోపం, విద్యుత్తు సరఫరాలో సమస్య వల్ల ఈ అసౌకర్యం తలెత్తినట్లు మెట్రో అధికారులు వెల్లడించారు.
వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురో, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ఫోన్‌లో చర్చలు జరిపారు. తాను, తన కుటుంబం దేశాన్ని వీడటానికి సిద్ధమేనని, అయితే అందుకు ఆయన కొన్ని షరతులు విధించినట్లు సమాచారం. అమెరికా ఆంక్షల నుంచి పూర్తి ఉపశమనం కల్పించాలని, తనపై ఉన్న అంతర్జాతీయ క్రిమినల్ కేసు మూసివేయాలని మదురో షరతులు విధించినట్లు రాయిటర్స్ పేర్కొంది. అయితే, ట్రంప్ చాలా షరతులను తిరస్కరించి, దేశం వీడటానికి ఒక వారం గడువు విధించినట్లు సమాచారం.
ఐపీఎల్ 2026 సీజన్ కోసం డిసెంబరు 16న అబుదాబిలో మినీ వేలం జరగనుంది. అయితే, ఈసారి చాలామంది స్టార్ ఆటగాళ్లు వివిధ కారణాలతో ఈ సీజన్‌కు దూరమవుతున్నారు. ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఈ వేలానికి తన పేరును రిజిస్ట్రేషన్ చేసుకోలేదని సమాచారం.
హిందీ, మలయాళ చిత్ర పరిశ్రమల మధ్య ఎంతో వ్యత్యాసం ఉందని నటుడు దుల్కర్ సల్మాన్ అన్నారు. భాషతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో అలరిస్తున్న దుల్కర్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో బాలీవుడ్‌లో పనిచేసిన అనుభవాన్ని పంచుకున్నరు. హిందీ సినిమాలో నటించేటప్పుడు పెద్ద స్టార్ అని అనిపించుకోకపోతే వాళ్లు ఎంతో నిర్లక్ష్యం చేస్తారని అన్నారు