E-Paper
Advertisement

Top 20 News: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్, మాజీ సీఎం పై ఎమ్మెల్యే కన్నా ఫైర్

Top 20 News: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్, మాజీ సీఎం పై ఎమ్మెల్యే కన్నా ఫైర్

1. ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ బిల్లుల కోసం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క 713 కోట్ల రూపాయలు విడుదల చేస్తూ ఆదేశాలిచ్చారు. ఆగస్టు నుంచి ప్రతి నెలా 700 కోట్ల రూపాయలు ఇస్తామన్న హామీని ప్రభుత్వం నిలబెట్టుకుంది. ఆర్థిక శాఖ ఆమోదంతో ఈ నిధులు విడుదలయ్యాయి, ఇది ఉద్యోగ సంఘాలకు పెద్ద ఊరటనిచ్చింది.

2. పేదల జీవితాలకు ఆర్థిక భరోసా..

ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం మునగచర్లలో ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యేలు తంగిరాల సౌమ్య, శ్రీరాం రాజగోపాల్‌తో కలిసి లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. అనంతరం అక్కడ నిర్మించనున్న యానిమల్ హాస్టల్‌ను పరిశీలించారు. పేదల జీవితాలకు ఆర్థిక భరోసా కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.

3. మాజీ సీఎం పై ఎమ్మెల్యే కన్నా ఫైర్

మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్ హయాంలో రౌడీ షీటర్లు, క్రిమినల్స్ రాజ్యమేలారని.. అది కేవలం రాక్షస పాలన అని విమర్శించారు. గంగమ్మ జాతరలో పొట్టేళ్ల తలలు నరికినట్టు ప్రత్యర్థుల తలలు నరుకుతామనే ధోరణి జగన్ అహంకారానికి నిదర్శనమని మండిపడ్డారు.

4. బుచ్చిరెడ్డిపాలెంలో మాస్టర్‌ప్లాన్

నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో మాస్టర్‌ప్లాన్‌పై నుడా అధికారులు ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరించారు. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొని.. ఈ ప్లాన్‌తో పట్టణ రూపురేఖలు మారుతాయన్నారు. వ్యాపారస్తులకు, సామాన్య ప్రజలకు మేలు చేకూరేలా రూపొందించిన ఈ ప్రణాళికకు అందరూ సహకరించాలన్నారు.

5. గోపాలపురం ఎమ్మెల్యేపై మాజీ మంత్రి ఫైర్

గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజుపై మాజీ మంత్రి తానేటి వనిత తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వైసీపీ కార్యకర్తలను భయభ్రాంతులకు గురిచేయడానికే అక్రమంగా నాటు సారా కేసులు పెట్టిస్తున్నారని ఆమె ఆరోపించారు. తాట తీస్తానని రెచ్చగొట్టేలా మాట్లాడింది మీరు.. ఎదుటివారిపై ఆరోపణలు చేయడం ఏంటని మండిపడ్డారు.

6. అసెంబ్లీలో సవాల్

అసెంబ్లీలో తమకు పీపీటీ ప్రదర్శించే అవకాశం ఇవ్వాలని మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి డిమాండ్ చేశారు. గతంలో కాంగ్రెస్‌కు అవకాశం ఇచ్చినట్లే.. ఇప్పుడు బీఆర్‌ఎస్‌కు కూడా ఇవ్వాలని కోరారు. అవకాశం ఇస్తే నీటి వాటాపై సీఎం రేవంత్‌రెడ్డి వాస్తవాలను బయటపెడతామన్నారు.

7. కలెక్టర్ ఆగ్రహం

సిద్దిపేట జిల్లా కలెక్టర్ హైమావతి గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యాలయ ప్రాంగణంలోనే చెత్తాచెదారం ఉండటంపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ కమిషనర్‌ను నిలదీశారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించే సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

8. ఝాన్సీరెడ్డిపై తీవ్ర విమర్శలు

పాలకుర్తి కాంగ్రెస్ నాయకురాలు ఝాన్సీరెడ్డిపై అదే పార్టీ నేత హరిప్రసాద్ తీవ్ర విమర్శలు చేశారు. ఆమె మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో కలిసి కోవర్ట్ రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. పంచాయతీ ఎన్నికల్లో వీరిద్దరూ కుమ్మక్కయ్యారని, ఈ పరిణామాలను ప్రజలు గమనిస్తున్నారని ఆయన హెచ్చరించారు.

9. దారుణం.. బస్సు ఢీకొని వృద్ధురాలి మృతి

హనుమకొండ జిల్లా పరకాల బస్టాండ్ వద్ద ఘోర ప్రమాదం జరిగింది. బస్టాండ్‌లోకి నడుచుకుంటూ వెళ్తున్న వృద్ధురాలిని ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆమె బస్సు టైర్ కింద పడి అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలిని వెంకటాపురం గ్రామానికి చెందిన సాంబలక్ష్మిగా పోలీసులు గుర్తించారు.

10. కడపలో సీసీ కెమెరాల నిఘా

కడపలో సీసీ కెమెరాల నిఘా పెంచేందుకు ధనికుల నుంచి చందాలు వసూలు చేస్తామంటూ టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు రెడ్డప్పగారి శ్రీనివాసుల రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. ఒక్క రూపాయి విరాళంగా ఇచ్చినా తీసుకుంటామని తెలిపారు. పనిగట్టుకొని తనపై ఎన్ని దుష్ప్రచారాలు చేసిన వెనక్కి తగ్గేది లేదన్నారు.

11. భారీ ర్యాలీ

రాయచోటిని జిల్లా కేంద్రంగా తొలగించడంపై నిరసనలు చెలరేగుతున్నాయి. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా రాయచోటిలో వైసీపీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. నియోజకవర్గంలో నిర్వహించిన భారీ ర్యాలీలో పెద్దఎత్తున వైసీపీ శ్రేణులు, ప్రజలు పాల్గొన్నారు.

12. హిందూపురం ప్రజలకు పోలీసులు వార్నింగ్

శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణ ప్రజలకు పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. నూతన సంవత్సర వేడుకలను తమ ఇంటి పరిసరాల్లో చేసుకోవాలని.. రోడ్లపై కేక్ కటింగ్, ర్యాలీలు, టపాసులు, డీజేలకు అనుమతి లేదని తెలిపారు. మద్యం సేవించి వాహనం నడిపితే రూ.10వేలు జరిమానాతో ఆరు నెలలు జైలు శిక్షవిధిస్తామని హెచ్చరించారు.

13. సంచలన నిర్ణయం

అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి రేపు ఒకరోజు దీక్ష చేపట్టనున్నట్లు ప్రకటించారు. స్థానిక గాంధీ విగ్రహం వద్ద ఈ దీక్ష చేస్తానని, తనపై ప్రజల అభిప్రాయాలను తెలుసుకోవడంతో పాటు తన ఆలోచనలను పంచుకుంటానని వెల్లడించారు.

14. పోలీసుల ఆంక్షలు

పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం సబ్ డివిజన్ పరిధిలో నూతన సంవత్సర వేడుకలపై పోలీసులు ఆంక్షలు విధించారు. రాత్రి 11 గంటల వరకు మాత్రమే వాహనాలకు అనుమతి ఇస్తామని, ఆ తర్వాత ప్రధాన కూడలిలో చెక్ పోస్టులు ఏర్పాటు చేశామని డీఎస్పీ విశ్వనాథ్ తెలిపారు.

15. కార్యాలయం ప్రారంభం

అనకాపల్లి జిల్లా ఎస్.రాయవరం మండలం అడ్డురోడ్డు జంక్షన్ నూతన రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటైంది. జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్ ఈ కార్యాలయాన్ని ప్రారంభించగా, ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ పాల్గొన్నారు. రాష్ట్రంలోనే ఇది అత్యంత కీలకమైన డివిజన్‌గా అభివృద్ధి చెందుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.

16. తక్షణమే నిలిపివేయాలి

అధిక డోసు కలిగిన నిమెసులైడ్ పెయిన్ కిల్లర్ తయారీ, విక్రయాలపై కేంద్రప్రభుత్వం ఆంక్షలు విధించింది. 100mg కంటే ఎక్కువ పవర్ ఉన్న ఈ మందు వాడితే లివర్ దెబ్బతినే ప్రమాదం ఉందని హెల్త్ మినిస్ట్రీ హెచ్చరించింది. డ్రగ్స్ టెక్నికల్ అడ్వైజరీ బోర్డు సిఫార్సుల మేరకు వీటి తయారీని తక్షణమే నిలిపివేయాలని ఆదేశించింది.

17. కీలక నిర్ణయం

అప్పుల్లో ఉన్న వొడాఫోన్-ఐడియాకు కేంద్ర కేబినెట్ భారీ ఊరటనిచ్చింది. 87 వేల 695 కోట్ల రూపాయల ఏజీఆర్ బకాయిలను ఐదేళ్ల పాటు ఫ్రీజ్ చేసేందుకు ఆమోదం తెలిపింది. ఈ మొత్తాన్ని 2032-41 మధ్య చెల్లించే వెసులుబాటు కల్పించింది.

18. లాభాలతో వీడ్కోలు

దేశీయ స్టాక్‌మార్కెట్‌ సూచీలు లాభాల్లో ముగిశాయి. నాలుగు రోజులుగా వరుస నష్టాలు చవిచూస్తున్న సూచీలు.. 2025 చివరి ట్రేడింగ్‌ సెషన్‌ను మాత్రం లాభాలతో ముగించాయి. ఓ వైపు విదేశీ మదుపర్ల విక్రయాలు కొనసాగుతున్నా.. మన మార్కెట్‌లో కొనుగోళ్ల ఉత్సాహం కనిపించింది.

19. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా ఆధిపత్యం కొనసాగుతోంది. వన్డేల్లో రోహిత్ శర్మ అగ్రస్థానంలో, విరాట్ కోహ్లీ రెండు స్థానాలు మెరుగుపరుచుకుని రెండో స్థానానికి చేరాడు. టీ20ల్లో అభిషేక్ శర్మ నెం.1గా, తిలక్ వర్మ మూడో స్థానంలో ఉన్నారు. బౌలింగ్‌లో జస్‌ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి అగ్రస్థానాల్లో నిలిచి సత్తా చాటారు.

20. పవర్‌ఫుల్ లుక్స్‌తో..

యశ్‌ హీరోగా మలయాళ దర్శకురాలు గీతూమోహన్‌ దాస్‌ టాక్సిక్‌ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ సినిమాలో నయనతార లుక్‌ను టీమ్‌ రిలీజ్‌ చేసింది. ఇందులో ఆమె గంగ అనే పాత్రలో కనిపించనున్నారు. ఈ విషయాన్ని తెలుపుతూ ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను పంచుకున్నారు. మోడ్రన్‌ డ్రెస్‌లో గన్‌ పట్టుకొని పవర్‌ఫుల్‌ లుక్స్‌తో నయన్‌ కనిపించారు.

Related News

ఉదయం లేవగానే అలసట, కాళ్ల నొప్పులు ఎందుకు వస్తాయో తెలుసా ?

Intinti Ramayanam TRP Rating : ‘ఇంటింటి రామాయణం’ టీఆర్పీ రేటింగ్.. మే హైలెట్ ఎపిసోడ్స్..

Brahmamudi Serial Today Episode May 26th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  రాజుకు షాక్ ఇచ్చిన ఇందు

తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరడం ఖాయం.. ఎంపీ ఈటల రాజేందర్ ధీమా

ఎంత స‌తాయిస్తే.. అంత విజ‌య్‌కే మేలు.. ! దేశం మొత్తం త‌ల‌ప‌తి స్థితిపై సానుభూతి!!

మంత్రి హోదాలో తుమ్మల 40 వసంతాల వేడుక!

Podarillu Today Episode : నారాయణకు దిమ్మతిరిగే షాక్.. డ్యాన్స్ లతో సందడి.. కన్నీళ్లు పెట్టుకున్న ప్రతాప్..

జేమ్స్ కామెరాన్‌కు గట్టి ఎదురుదెబ్బ.. అవతార్ లాభాల్లో వాటా డిమాండ్ చేస్తున్న నటి

Big Stories

×