హరీష్ రావు విమర్శలను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తిప్పికొట్టారు. సాగునీటి అంశంపై హరీష్ రావు అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన రిట్ పిటిషన్‌పై జనవరి 5న సుప్రీంకోర్టులో విచారణ జరగనుందని, సీజేఐ ధర్మాసనం ముందు ఈ కేసు లిస్ట్ అయిందని ఆయన స్పష్టం చేశారు.
అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాయచోటిని తొలగించడంపై వైసీపీ నేత గడికోట శ్రీకాంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందు నోటిఫికేషన్ ఇవ్వకుండా జిల్లా కేంద్రంగా తొలగించడమేంటని ఆయన ప్రశ్నించారు. రాయచోటిపై కక్షతోనే జిల్లా కేంద్రంగా తొలగించారని శ్రీకాంత్‌రెడ్డి మండిపడ్డారు. వెంటనే ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
హిందూ దేవీ దేవతలను, భారతీయ మహిళల సంస్కృతిని కించపరిచేలా అన్వేష్ చేసిన వ్యాఖ్యలపై సినీ నటి కరాటే కళ్యాణి పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. అన్వేష్ హిందూ దేవతలను కించపరుస్తూ, అసభ్యకర పదజాలంతో వీడియోలు చేస్తున్నారని కళ్యాణి తన ఫిర్యాదులో తెలిపారు.
సినీ నటి పూనమ్ కౌర్ మరోసారి డైరెక్టర్ త్రివిక్రమ్‌ను టార్గెట్ చేశారు. ఎక్స్ వేదికగా త్రివిక్రమ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. స్త్రీలను హింసించి, మానసిక క్షోభను మిగిల్చి ఏమీ తెలియనట్లు తిరిగే వ్యక్తులే నిజంగా దుర్మార్గులని అన్నారు.
జనగామ జిల్లా చిన్నరాంచర్ల గ్రామంలో విషాదం నెలకొంది. లక్ష్మి, రామ్ రెడ్డి అనే దంపతులు ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
గచ్చిబౌలిలోని తార్ హోటల్‌పై సుమారు 50 మంది దుండగులు మూకుమ్మడిగా దాడికి పాల్పడ్డారు. హోటల్ లోపలికి చొరబడి ఫర్నీచర్‌ను ధ్వంసం చేయడమే కాకుండా.. గదుల్లో బస చేసిన అతిథులను బలవంతంగా బయటకు గెంటేశారు. అసలేం జరుగుతుందో అర్థం కాక పర్యాటకులు ప్రాణభయంతో పరుగులు తీశారు.
నంద్యాల జిల్లా మద్దూరులోని ప్రసిద్ధ శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో దొంగలు వెండి ఆభరణాలను అపహరించారు. స్వామివారికి భక్తులు సమర్పించిన అసలైన వెండి ఆభరణాలు మాయం చేశారు. వాటి స్థానంలో నకిలీ ఆభరణాలు పెట్టడం కలకలం రేపుతోంది.
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో రెండు డీసీఎం వ్యాన్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆగి ఉన్న ఆటో కూడా దెబ్బతింది. ముగ్గురికి స్వల్ప గాయాలవ్వగా.. వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. లోడుతో ఉన్న రెండు వ్యాన్ల మధ్య మలుపు వద్ద ఈ ప్రమాదం జరిగింది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అటవీశాఖ ఉద్యోగి ఇంట్లో కలప పట్టివేతపై విచారణ చేస్తున్నామని ఫారెస్ట్ డివిజనల్ ఆఫీసర్ కోటేశ్వరరావు అన్నారు. జూలూరుపాడు అటవీరేంజ్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న FBO నరసింహారావు ఇంట్లో కలప దొరికింది. దీంతో ఆఫీస్‌ను పరిశీలించి.. స్వాధీనం చేసుకున్న కలప కొలతలను ఆయన పరిశీలించారు. ఈ ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి అతనిపై చర్యలు తీసుకుంటామన్నారు.
నూతన సంవత్సర వేడుకల్లో డ్రగ్స్ నివారణకు పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. 12 ప్రత్యేక బృందాలు పబ్‌లు, ఫామ్‌హౌస్‌లపై నిఘా ఉంచాయి. ముఖ్యంగా డీజే ఆపరేటర్లకు డ్రగ్ టెస్టులు నిర్వహించాలని నిర్ణయించడం ఈసారి ప్రత్యేకత.
తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి.. తన మాస్ డ్యాన్స్‌తో సందడి చేశారు. ముందస్తు నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా జేసీ పార్కులో ఏర్పాటు చేసిన ఈ వేడుకల్లో ఆయన ఉత్సాహంగా స్టెప్పులేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
సురవరం ప్రతాపరెడ్డి విశ్వవిద్యాలయం వీసీ, రిజిస్ట్రార్లను వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు ఆందోళన చేశారు. నేడు నిర్వహించే డీన్స్, హెడ్స్ సమావేశంలో సానుకూల నిర్ణయం రాకపోతే, పెట్రోల్ పోసుకుని సామూహిక ఆత్మహత్యలు చేసుకుంటామని విద్యార్థులు హెచ్చరించడంతో క్యాంపస్ వద్ద ఉద్రిక్తత నెలకొంది.
ఖమ్మం జిల్లా కొనిజర్ల మండలంలోని గ్రోమోర్ రైతు సేవా కేంద్రం వద్ద యూరియా కోసం రైతులు భారీగా బారులు తీరారు. తెల్లవారుజామున మూడు గంటల నుంచే క్యూ లైన్‌లో వేచి ఉన్నారు. జిల్లాలో యూరియా కొరత లేదని అధికారులు చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది.
సింహాచలం లక్ష్మీనరసింహస్వామి పులిహోర ప్రసాదంపై తప్పుడు ప్రచారం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు మొదలయ్యాయి. ప్రసాదంలో నత్త వచ్చిందంటూ సోషల్ మీడియాలో వీడియో వైరల్ చేసిన దంపతులపై దేవస్థానం అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పశ్చిమ గోదావరి జిల్లా కుప్పనపూడి గ్రామంలో ఎట్టి పరిస్థితుల్లోనూ కోడి పందాలు, పేకాట నిర్వహించకూడదని గ్రామస్తులు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. పంచాయతీ సర్పంచ్ అనురాధ నాయకత్వంలో జరిగిన సమావేశంలో కుప్పనపూడితో పాటు దాని పరిధిలోని గ్రామాల్లో కూడా అసాంఘిక కార్యకలాపాలను అడ్డుకోవాలని నిర్ణయించారు.
అమెరికాలో ఉంటున్న భారతీయులకు యూఎస్ హెచ్చరికలు జారీ చేసింది. అమెరికాలోని చట్టాలను ఉల్లంఘిస్తే క్రిమినల్ కేసులు, జరిమానాలు తప్పవని యూఎస్ రాయబార కార్యాలయం ఎక్స్‌లో పోస్టు చేసింది. అక్రమ వలసలను అడ్డుకోవడానికి, తమ సరిహద్దులను, పౌరులను రక్షించుకోవడానికి ట్రంప్ యంత్రాంగం కట్టుబడి ఉన్నట్లు తెలిపింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను ఇజ్రాయెల్ తమ దేశ అత్యున్నత పౌర పురస్కారంతో సత్కరించనుంది. ఆయనకు ఇజ్రాయెల్ ప్రైజ్ ఫర్ పీస్‌ను అందజేయనున్నట్లు ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ప్రకటించారు. ఇజ్రాయెల్ తనకు అవార్డును ప్రకటించడం ఊహించని గౌరవమని ట్రంప్ అన్నారు.
వృత్తి నిపుణులకు ఇచ్చే హెచ్-1బీ వీసాల జారీ ప్రక్రియలో కీలక మార్పులు చేపట్టాలని అమెరికా ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు సంబంధించిన నిబంధనలను, వీసా కేటాయింపుల విధి విధానాలను యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీస్.. ఫెడరల్ రిజిస్టర్‌లో ప్రచురించింది. ఈ కొత్త పద్ధతి వచ్చే ఏడాది ఫిబ్రవరి 27 నుంచి అమల్లోకి రానుంది.
ఫిడే వరల్డ్ బ్లిట్జ్ చెస్ ఛాంపియన్ షిప్‌లో తెలంగాణ కుర్రాడు అర్జున్ ఇరిగేశిని కాంస్య పతకం గెలుచుకున్నాడు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ అర్జున్‌ను అభినందించారు. అతడి విజయం దేశ యువతకు స్ఫూర్తినిస్తోందన్నారు.
కొత్త సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ ఏడాది అనుభవాలను వర్ణిస్తూ నిర్మాత బండ్ల గణేష్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు. 2025 సంవత్సరం ముగుస్తోంది అనగానే నా హృదయం భారంగా మారుతోందన్నారు. ఎందుకంటే ఇది కేవలం ఒక సంవత్సరం కాదు.. నా జీవితాన్ని తిరిగి రచించిన కాలం అని ఎక్స్‌లో ట్వీట్ చేశాడు.