E-Paper
Advertisement

Top 20 News: బీఆర్ఎస్ పార్టీ తీరుపై మంత్రి తీవ్ర విమర్శలు, టీడీపీ నేతపై కత్తులతో దాడి

Top 20 News: బీఆర్ఎస్ పార్టీ తీరుపై మంత్రి తీవ్ర విమర్శలు, టీడీపీ నేతపై కత్తులతో దాడి

1. మూసీ ప్రాజెక్టుపై విపక్షాల విమర్శలపై సీఎం ఫైర్

మూసీ ప్రాజెక్టుపై విపక్షాల విమర్శలను సీఎం రేవంత్ రెడ్డి కొట్టిపారేశారు. ఇది రియల్ ఎస్టేట్ వ్యాపారం కాదని, నగరాభివృద్ధి కోసం చేస్తున్న బాధ్యతాయుతమైన పని అని స్పష్టం చేశారు. గతంలో హైటెక్ సిటీ నిర్మాణాన్ని వ్యతిరేకించిన వారే ఇప్పుడు మూసీ ప్రక్షాళనను అడ్డుకుంటున్నారని మండిపడ్డారు.

2. ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ కీలక సమావేశం

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, కృష్ణా జలాల వాటాపై సీఎం రేవంత్ రెడ్డి ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ఎమ్మెల్యేలతో కీలక సమావేశం నిర్వహించారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన లోపాలను, కృష్ణా జలాల్లో రాష్ట్ర వాటాను 299 టీఎంసీలకే పరిమితం చేస్తూ కేసీఆర్ తీసుకున్న నిర్ణయం వల్ల జరిగిన నష్టాన్ని ప్రజలకు వివరించాలన్నారు.

3. రాజీపడే ప్రసక్తే లేదు

ఖాజాగూడ భూముల వ్యవహారంలో వంశీరామ్‌ బిల్డర్స్‌తో రాజీపడే ప్రసక్తే లేదని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి స్పష్టం చేశారు. రెవెన్యూ శాఖ నుంచి ఒక లేఖ అందితే కోర్టులో తన వాదనకు మరింత బలం చేకూరుతుందని, ఆ వివాదాస్పద భూమి ఖచ్చితంగా ప్రభుత్వ పరం అవుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

4. బీఆర్ఎస్ పార్టీ తీరుపై మంత్రి తీవ్ర విమర్శలు

బీఆర్ఎస్ పార్టీ తీరుపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తీవ్ర విమర్శలు గుప్పించారు. గత రెండేళ్లుగా సభలో వారి వ్యవహారశైలి కేవలం ఉనికి కోసమేనని, ఉపాధి హామీ నిధుల విషయంలో బీజేపీకి భయపడి వారు మౌనంగా ఉన్నారని ఆరోపించారు.

5. బీఆర్ఎస్‌కు బిగ్ షాక్

మహబూబాబాద్ జిల్లాలో బీఆర్‌ఎస్‌కు భారీ గండి పడింది. మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ ప్రధాన అనుచరుడు, ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నీలం దుర్గేష్ తన అనుచరులతో కలిసి బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేశారు. ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ సమక్షంలో ఆయన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.

6. శ్రేయ గ్రూప్ ఆస్తుల జప్తుకు ఏపీ సర్కార్ అనుమతి

కర్నూలు జిల్లాలో 206 కోట్ల రూపాయల భారీ మోసానికి పాల్పడిన శ్రేయ గ్రూప్ ఆస్తులను జప్తు చేయాలని ఏపీ ప్రభుత్వం ఆదేశించింది. అధిక వడ్డీ ఆశచూపి 8,128 మంది డిపాజిటర్లను వంచించిన ఈ సంస్థకు చెందిన 51.55 ఎకరాల భూమిని సీజ్ చేసేందుకు సీఐడీకి అనుమతినిచ్చింది.

7. సమన్వయంతో పని

మున్సిపల్, స్థానిక ఎన్నికల నేపథ్యంలో గాంధీ భవన్‌లో కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ భేటీ అయ్యింది. క్రమశిక్షణ తప్పితే కఠిన చర్యలు తీసుకుంటామని ఛైర్మన్ మల్లు రవి హెచ్చరించారు. పార్టీ గుర్తుపై జరిగే ఈ ఎన్నికల్లో నాయకులంతా సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

8. లేఖ కలకలం

మావోయిస్ట్ పార్టీ BK-ASR డివిజన్ కమిటీ పేరిట విడుదలైన లేఖ కలకలం రేపుతోంది. కార్పొరేట్లకు అండగా ఉంటూ ఆదివాసీలను బలితీసుకుంటున్నారని ఆరోపిస్తూ.. టీపీసీసీ నేత నల్లపు దుర్గాప్రసాద్‌కు మరణశిక్ష తప్పదని లేఖలో హెచ్చరించారు. ద్రోహులను వదిలిపెట్టబోమని లేఖలో స్పష్టం చేశారు.

9. నిందితుడి అరెస్ట్

హైదరాబాద్‌ హుస్సైనిఆలంలో అక్రమంగా దేశవాళీ పిస్టల్‌ కలిగి ఉన్న అమ్జద్ ఖాన్ అనే యువకుడిని సీసీఎస్, స్థానిక పోలీసులు సంయుక్తంగా అరెస్ట్ చేశారు. చార్మినార్‌లో గాజుల వ్యాపారం చేసే ఇతడు, 10 నెలల క్రితం మధ్యప్రదేశ్‌లో 80 వేల రూపాయలకు ఈ ఆయుధాన్ని కొనుగోలు చేసినట్లు తేలింది.

10. చట్నీలో బల్లి.. 8 మంది అస్వస్థత

జగిత్యాల పట్టణంలోని తాసిల్ చౌరస్తాలో ఉన్న శివసాయి టిఫిన్ సెంటర్‌లో తీవ్ర కలకలం రేగింది. హోటల్‌లో వడ్డించిన చట్నీలో బల్లి రావడంతో.. అది తిన్న ఎనిమిది మంది కస్టమర్లు అస్వస్థతకు గురయ్యారు. వీరిలో ఇద్దరు చిన్నారులు, ఒక గర్భిణీ ఉండటం తీవ్ర ఆందోళన కలిగించింది.

11. పక్కా ఏర్పాట్లు

తెలంగాణలో రబీ సీజన్ సాగు పనుల దృష్ట్యా ప్రభుత్వం యూరియా పంపిణీని వేగవంతం చేసింది. గత ఖరీఫ్ అనుభవాలను దృష్టిలో ఉంచుకుని, ఈసారి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు పక్కా ఏర్పాట్లు చేశారు.

12. వేడుకలలో విషాదం

శ్రీ సత్యసాయి జిల్లా బ్రాహ్మణపల్లిలో నూతన సంవత్సర వేడుకలు విషాదాన్ని నింపాయి. కెనరా బ్యాంక్ శిక్షణ సంస్థలో కేక్ తిన్న 12 మంది మహిళలు ఫుడ్ పాయిజనింగ్‌తో అస్వస్థతకు గురయ్యారు. వీరిలో 8 మంది పరిస్థితి విషమించడంతో వారిని పుట్టపర్తి సత్యసాయి జనరల్ ఆసుపత్రికి తరలించారు.

13. రిమాండ్ పొడిగింపు

ఏపీలో సంచలనం సృష్టించిన మద్యం కుంభకోణం కేసులో నిందితుల రిమాండ్‌ను కోర్టు ఈ నెల 16 వరకు పొడిగించింది. విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో నిందితులను కోర్టు ముందు ప్రవేశపెట్టగా న్యాయస్థానం ఈ నిర్ణయం తీసుకుంది.

14. టీడీపీ నేతపై కత్తులతో దాడి

కృష్ణా జిల్లా గుడివాడ గుడ్‌మేన్‌పేటలో టీడీపీ నేత వేశపోగు ఇమ్మానుయేలుపై ప్రత్యర్థి వర్గీయులు కత్తులు, రాళ్లతో మూకుమ్మడి దాడికి తెగబడ్డారు. అడ్డుకోవడానికి ప్రయత్నించిన మరో ఇద్దరిపై కూడా దాడి చేయడంతో మొత్తం ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.

15. విషాదం.. విద్యార్థి సూసైడ్

విజయనగరంలోని జేఎన్‌టీయూ-గురజాడ విశ్వవిద్యాలయంలో విషాదం చోటుచేసుకుంది. ట్రిపుల్-ఈ రెండో సంవత్సరం చదువుతున్న వెంకట ఉదయ్ తేజ అనే విద్యార్థి హాస్టల్ గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ప్రాణాలు విడిచారు.

16. ట్రంప్ హెచ్చరిక

ఇరాన్‌లో నిరసనకారులపై కాల్పులు జరిపితే జోక్యం చేసుకుంటామని, తాము పూర్తి సంసిద్ధతతో ఉన్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. దీనిపై ఇరాన్ స్పందిస్తూ.. అమెరికా జోక్యం చేసుకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని, తమ జాతీయ భద్రత రెడ్ లైన్ అని.. దానిని పరీక్షించడం సాహసమేనని ఘాటుగా సమాధానమిచ్చింది.

17. ఇతరులు నిర్ణయించలేరు

ఉగ్రవాదంపై భారత్ దృఢ వైఖరిని విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ స్పష్టం చేశారు. పాకిస్థాన్‌ను కయ్యాలమారి పొరుగు దేశంగా అభివర్ణిస్తూ.. ఉగ్రవాదం నుంచి ప్రజలను రక్షించుకునే హక్కు భారత్‌కు ఉందని తేల్చి చెప్పారు. ఆపరేషన్ సిందూర్ గురించి ప్రస్తావిస్తూ.. దేశ రక్షణ కోసం మనం ఏం చేయాలో ఇతరులు నిర్ణయించలేరన్నారు.

18. మంత్రి క్షమాపణలు

ఇందౌర్‌లో కలుషిత నీరు తాగి 9 మంది మృతి చెందిన ఘటనపై ప్రశ్నించిన ఎన్డీటీవీ జర్నలిస్టు అనురాగ్ ద్వారీ పట్ల మధ్యప్రదేశ్ మంత్రి కైలాశ్‌ విజయ్‌వర్గీయ్‌ అభ్యంతరకరంగా ప్రవర్తించారు. బాధితుల ఆసుపత్రి ఖర్చుల రీయింబర్స్‌మెంట్‌పై అడిగిన ప్రశ్నలకు.. పనికిరాని ప్రశ్నలు వేయొద్దు అంటూ మంత్రి చిరాకు పడ్డారు. దీనిపై తీవ్ర నిరసన వ్యక్తమవ్వడంతో..మాట తప్పు దొర్లిందని ఆయన క్షమాపణలు చెప్పారు.

19. విలియమ్స్ పునరాగమనం

అమెరికా టెన్నిస్ స్టార్ వీనస్ విలియమ్స్ 46 ఏళ్ల వయసులో ఆస్ట్రేలియా ఓపెన్‌లోకి పునరాగమనం చేస్తున్నారు. వైల్డ్‌కార్డ్‌తో బరిలోకి దిగుతున్న ఆమె, ఈ టోర్నీ మెయిన్ డ్రాలో ఆడుతున్న అత్యంత పెద్ద వయస్కురాలిగా రికార్డు సృష్టించనున్నారు.

20. భారీ అంచనాలు

దళపతి విజయ్ నటిస్తున్న చివరి చిత్రం కావడంతో జన నాయగన్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా బాలకృష్ణ హిట్ చిత్రం భగవంత్ కేసరికి రీమేక్ అనే ప్రచారంపై దర్శకుడు హెచ్. వినోద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నేను ఈ విషయాన్ని ధ్రువీకరించను, అలాగని కొట్టిపారేయను అంటూ సస్పెన్స్‌ను కొనసాగించారు.

Related News

ఉదయం లేవగానే అలసట, కాళ్ల నొప్పులు ఎందుకు వస్తాయో తెలుసా ?

Intinti Ramayanam TRP Rating : ‘ఇంటింటి రామాయణం’ టీఆర్పీ రేటింగ్.. మే హైలెట్ ఎపిసోడ్స్..

Brahmamudi Serial Today Episode May 26th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  రాజుకు షాక్ ఇచ్చిన ఇందు

తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరడం ఖాయం.. ఎంపీ ఈటల రాజేందర్ ధీమా

ఎంత స‌తాయిస్తే.. అంత విజ‌య్‌కే మేలు.. ! దేశం మొత్తం త‌ల‌ప‌తి స్థితిపై సానుభూతి!!

మంత్రి హోదాలో తుమ్మల 40 వసంతాల వేడుక!

Podarillu Today Episode : నారాయణకు దిమ్మతిరిగే షాక్.. డ్యాన్స్ లతో సందడి.. కన్నీళ్లు పెట్టుకున్న ప్రతాప్..

జేమ్స్ కామెరాన్‌కు గట్టి ఎదురుదెబ్బ.. అవతార్ లాభాల్లో వాటా డిమాండ్ చేస్తున్న నటి

Big Stories

×