ప్రధాని మోదీపై సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు చేసిన వ్యాఖ్యలను బీజేపీ ఎంపీ డీకే అరుణ తీవ్రంగా ఖండించారు. అసెంబ్లీలో అప్రజస్వామిక భాషను వాడటం సరికాదని, స్పీకర్, కాంగ్రెస్ ప్రభుత్వం మిత్రపక్షాన్ని సమర్థించడం సభ గౌరవాన్ని తగ్గించడమేనని విమర్శించారు.
కడప పాత రిమ్స్‌లో నిరుపయోగంగా ఉన్న అంబులెన్స్‌లను ఎమ్మెల్యే మాధవి రెడ్డి పరిశీలించారు. ఇవి గత పదేళ్లుగా, ముఖ్యంగా వైసీపీ హయాంలో నిర్లక్ష్యానికి గురయ్యాయని విమర్శించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక కొత్త అంబులెన్స్‌లు అందుబాటులోకి తెచ్చామని, పాత వాటిని చూపి ప్రతిపక్ష మీడియా బురదజల్లుతోందని ఆమె మండిపడ్డారు.
టీటీడీలో 50 కిలోల బంగారం మాయమైందన్న విమర్శలపై బోర్డు స్పందించాలని కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ డిమాండ్ చేశారు. సీఎం చంద్రబాబు, వైఎస్సార్ పాలనలో రాష్ట్రం అప్పులపాలైందని, వారి కుటుంబాలు మాత్రం బిలియనీర్లు అయ్యాయని విమర్శించారు.
మంచిర్యాల జిల్లా చెన్నూరులో నిర్వహించిన బీజేపీ సన్నాహక సమావేశంలో జిల్లా అధ్యక్షుడు నగునూరి వేంకటేశ్వర్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో అన్ని వార్డుల్లోనూ బీజేపీ అభ్యర్థులు పోటీ చేస్తారని ప్రకటించారు. పార్టీ గెలుపు కోసం బూత్ స్థాయి కార్యకర్తలు కష్టపడి పనిచేయాలని అన్నారు.
హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ లా కాలేజీ హాస్టల్‌లో నాసిరకం భోజనం పెడుతున్నారంటూ విద్యార్థులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, మెరుగైన వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు.
మంచిర్యాల జిల్లా చెన్నూరులో ఉన్నతాధికారుల ఆదేశాలతో సీఐ దేవేందర్ రావ్ నేతృత్వంలో బ్యాంకుల తనిఖీలు చేపట్టారు. భద్రతా పరంగా సైరన్ విభాగాలు, సీసీ కెమెరాల పనితీరును పోలీసులు పరిశీలించారు. ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించాలని, నిరంతరం అప్రమత్తంగా ఉండాలని బ్యాంక్ సిబ్బందికి సీఐ సూచించారు.
నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో నో హెల్మెట్-నో పెట్రోల్ నిబంధన అమలులోకి రానుంది. రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా డీఎస్పీ రాజశేఖర్ రాజు పెట్రోల్ బంక్ యజమానులతో సమావేశమై, హెల్మెట్ లేని ద్విచక్ర వాహనదారులకు పెట్రోల్ పోయవద్దని ఆదేశించారు.
హైదరాబాద్‌లోని మెహిదీపట్నంలో ఏటీఎం మోసాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వృద్ధులు, అమాయకులను లక్ష్యంగా చేసుకునే ఈ హర్యానా ముఠా నుంచి 89 ఏటీఎం కార్డులు, రూ. 52 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఆటో డ్రైవర్ సహకారంతో వీరు ఈ నేరాలు చేస్తున్నట్లు పోలీసులు నిర్ధారించారు.
రంగారెడ్డి జిల్లా వర్ధమాన్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థి ఆకాష్ వర్ధన్ అదృశ్యం కలకలం సృష్టిస్తోంది. డిసెంబర్ 31న అవుట్ పాస్ తీసుకుని వెళ్లిన ఈ మంచిర్యాల యువకుడు నాలుగు రోజులైనా తిరిగి రాకపోవడంతో ఆందోళన నెలకొంది. తల్లిదండ్రుల ఫిర్యాదుతో శంషాబాద్ రూరల్ పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టారు.
నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణ కేంద్రంలోని మహాత్మ జ్యోతిబాపూలే పాఠశాల విద్యార్థులు జాతీయ రోడ్డు భద్రత మాస ఉత్సవాల్లో భాగంగా నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణ కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు. వేగం వద్దు ప్రాణం ముద్దు అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ప్లకార్డులు పట్టుకొని ప్రధాన రహదారి గుండా ర్యాలీ నిర్వహించారు.
జనగామ జిల్లా చిన్నమడూరు శివాలయంలో విగ్రహాల ధ్వంసం ఘటన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. నిందితుడిని స్థానికులే పట్టుకుని పోలీసులకు అప్పగించారు. మతసామరస్యానికి విఘాతం కలిగించే ఇలాంటి చర్యలపై పోలీసులు కఠినంగా వ్యవహరించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.
నంద్యాల జిల్లా నందికొట్కూరు రూరల్ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఎంపీ బైరెడ్డి శబరి ఎంపీ నిధులతో అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. 39 లక్షల రూపాయల వ్యయంతో పోలీస్ సిబ్బంది కుటుంబాల కోసం చిల్డ్రన్ పార్క్, ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయనున్నారు. సిబ్బంది ఆరోగ్యం, వినోదమే లక్ష్యంగా పనులను చేపట్టినట్లు తెలిపారు.
శ్రీకాకుళం జిల్లా మందస మండలం భేతాళపురంలో పాత మట్టిగోడ కూలి బత్తుల కాంతమ్మ అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. ఇంటి నిర్మాణ పనుల్లో ఇటుకలు మోస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన మరో మహిళ కనకదుర్గను పలాస ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అనంతపురం వన్ టౌన్ పోలీసులు గంజాయి విక్రేతలపై ఉక్కుపాదం మోపారు. గంజాయి విక్రయిస్తూ పట్టుబడిన నలుగురు నిందితులను నడిరోడ్డుపై నడిపించుకుంటూ జిల్లా కోర్టు వరకు తీసుకెళ్లారు. వారి వద్ద నుంచి 1.2 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు.
జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మూలరాంపూర్ వద్ద రైతులు ఆందోళనకు దిగారు. సధర్మాట్ ప్రాజెక్టు నుంచి గంగనాల ప్రాజెక్టుకు సాగునీరు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. పంటలు ఎండిపోకముందే ప్రభుత్వం స్పందించి నీటిని విడుదల చేయాలని కోరారు.
అమెరికా-వెనిజువెలా మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఈరోజు తెల్లవారుజామున వెనిజువెలా రాజధాని కరాకస్‌పై యూఎస్ సైన్యం భీకర వైమానిక దాడులు జరిపింది. ఈ ఆపరేషన్‌లో వెనిజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన భార్య సిలియా ఫ్లోరస్‌ను తమ సైన్యం అదుపులోకి తీసుకుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ధ్రువీకరించారు.
దేశ వ్యతిరేక శక్తుల్లో విద్యావంతులు పెరగడం, వైట్ కాలర్ ఉగ్రవాదం విస్తరించడంపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం జ్ఞానం మాత్రమే సరిపోదని, విలువలతో కూడిన విద్య అవసరమని ఉద్ఘాటించారు. వచ్చే 15 ఏళ్లలో భారత్ ఆయుధాల తయారీలో స్వయం సమృద్ధి సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
రోడ్డు విస్తరణ కోసం తన మామగారి ఇంటిని కూడా కూల్చివేయించానని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. రూల్ ఈజ్ రూల్ అంటూ అభివృద్ధి కోసం కఠిన నిర్ణయాలు తప్పవని స్పష్టం చేశారు. ఈ ఆసక్తికర విషయాన్ని ఆయన భార్య కాంచన్ ధ్రువీకరించగా, గడ్కరీ నిబద్ధతపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
భారత్, బంగ్లాదేశ్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు ఇప్పుడు ఆ దేశ ఆటగాళ్లపై పడింది. ఐపీఎల్ నుంచి బంగ్లాదేశ్ ప్లేయర్ ముస్తాఫిజుర్ ఔట్ అయ్యాడు. ముస్తాఫిజుర్‌ను రిలీజ్ చేయాలని KKRను బీసీసీఐ ఆదేశించింది. ఐపీఎల్‌లో 9.2 కోట్లకు కేకేఆర్ అతడిని దక్కించుకుంది.
2026 నూతన సంవత్సరంలో అక్కినేని నాగచైతన్య కొత్త ప్రాజెక్ట్‌పై క్రేజీ అప్‌డేట్ వచ్చింది. ప్రస్తుతం వృషకర్మ పూర్తి చేసే పనిలో ఉన్న ఆయన, తర్వాతి చిత్రాన్ని బెదురులంక ఫేమ్ క్లాక్స్ దర్శకత్వంలో చేసేందుకు సిద్ధమవుతున్నారు. బన్నీ వాస్ నిర్మాణంలో రానున్న ఈ సినిమాకు సంబంధించి చర్చలు తుది దశకు చేరుకున్నాయి.