సంక్రాంతి సందర్భంగా స్వీట్ అండ్ కైట్ ఫెస్టివల్, హాట్ ఎయిర్ బెలూన్స్, డ్రోన్ షో నిర్వహిస్తుంది తెలంగాణ ప్రభుత్వం. ఈనెల 13 నుంచి 18 వరకు హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో పర్యాటక, భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తుంది. ఈనెల 13 నుంచి 15 వరకు పరేడ్ గ్రౌండ్స్, బతుకమ్మ కుంట, తమ్మిడికుంట, బుమ్రుక్ ద్వాలా, నల్ల చెరువు ప్రాంతాల్లో కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ నిర్వహించనున్నారు.
కూకట్‌పల్లి కెపిహెచ్‌బి పోలీస్ స్టేషన్ పరిధిలోని సర్దార్ పటేల్ నగర్ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో దుండగులు భారీ చోరీకి పాల్పడ్డారు. అర్ధరాత్రి 12 గంటల తర్వాత గర్భగుడి తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించిన దొంగలు.. మూలవిరాట్‌కు సంబంధించిన సుమారు 30 లక్షల రూపాయల విలువైన 15 కిలోల వెండి ఆభరణాలు, 3 తులాల బంగారు నగలను ఎత్తుకెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించి ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు
నాంపల్లి కోర్టులో ఐబొమ్మ రవికి చుక్కెదురైంది. రవి బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసింది కోర్టు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పీఎస్‌లో నమోదైన 5 కేసుల్లో .. బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఐబొమ్మ రవి పిటిషన్ వేశారు. అయితే కేసు దర్యాప్తులో ఉందని.. రవికి విదేశీ పౌరసత్వం ఉన్నట్లు కోర్టుకు తెలిపారు పోలీసులు. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయస్థానం.. రవి బెయిల్ పిటిషన్లు కొట్టివేసింది.
కామారెడ్డి జిల్లా బీర్కూర్‌లో కీచక డాక్టర్ బాగోతం బయటపడింది. ఓ ఫార్మాసిస్టుపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు డాక్టర్ గిరీష్. బీర్కూర్ ప్రభుత్వాస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న నర్స్.. కొద్దిరోజులుగా డాక్టర్ అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. డాక్టర్ గిరీష్‌ను అదుపులోకి తీసుకున్నారు
సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన ఉన్న ఒక స్క్రాప్ దుకాణం ముందు ఆగి ఉన్న డీసీఎం వాహనాన్ని అతివేగంగా వచ్చిన బైక్ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. గమనించిన స్థానికులు వెంటనే క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఖమ్మం జిల్లాలో కేటీఆర్ పర్యనకు ముందే.. బీఆర్ఎస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. గులాబీ పార్టీకి చెందిన మరో ముగ్గురు కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే ఐదుగురు మహిళా కార్పొరేటర్లు హస్తం గూటికి చేరుకోగా.. నేడు మరో ముగ్గురు అదే బాటలో పయనిస్తున్నారు. కేటీఆర్ పర్యటన వేళ జరుగుతున్న ఈ వరుస వలసలు.. జిల్లా రాజకీయాల్లో పెను సంచలనంగా మారాయి
పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం గంగరేగువలస గ్రామంలో ఏనుగుల గుంపు బీభత్సం సృష్టించింది. సుమారు 70 ధాన్యం బస్తాలను ఏనుగులు ధ్వంసం చేశాయి. ఏడాదంతా కష్టపడి పండించిన పంట కళ్లముందే నాశనం కావడంతో రైతులు లబోదిబోమంటున్నారు. ఏనుగుల గుంపును తరలించి.. పంట నష్ట పరిహారం చెల్లించేలా చర్యలు తీసుకోవాలని రైతులు, గ్రామస్తులు ఆందోళన చేస్తున్నారు
మావోయిస్టు పార్టీకి మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో 26 మంది మావోయిస్టులు లొంగిపోయారు. ప్రభుత్వం చేపట్టిన ‘పునా మార్గెమ్’ పునరావాస కార్యక్రమానికి ఆకర్షితులై.. పోలీసుల ఎదుట ఆయుధాలు వదిలేశారు. లొంగిపోయిన వారిలో ఏడుగురు మహిళా మావోయిస్టులు ఉన్నారు. వీరందరిపై ప్రభుత్వం 64 లక్షల రివార్డును ప్రకటించింది.
ఏపీలో మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించింది వైసీపీ. 17 ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించవద్దని కోరుతూ.. వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి పిల్ దాఖలు చేశారు. ప్రజలకు ఉచిత వైద్యం అందించడమే లక్ష్యంగా ఈ కళాశాలలు ఏర్పాటు చేశామన్నారు అప్పిరెడ్డి. పీపీపీ విధానం తీసుకురావడం వల్ల పేదలకు విద్య, వైద్యం దూరమవుతాయని పిటిషన్‌లో పేర్కొన్నారు.
నిర్మల్ జిల్లా పెంబి మండలం కోసగుట్ట – యాపల్ గూడా గ్రామాల మధ్య దొత్తివాగుపై వంతెన లేక గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏళ్లుగా అధికారులు స్పందించకపోవడంతో, విధిలేక గ్రామస్తులే ఏటా బండరాలను పేర్చి ట్రాక్టర్ల సహాయంతో తాత్కాలిక వంతెనను నిర్మించుకుంటున్నారు. తాము పండించిన పంటను మార్కెట్‌కు తరలించేందుకు ఈ కష్టాలు తప్పడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి శాశ్వత వంతెన నిర్మించాలని గిరిజన ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరులోని జైన్ ఫామ్ ఫ్రెష్ కర్మాగారం ఎదుట మామిడి రైతులు నిరసన చేశారు. మామిడి సరఫరా చేసి ఆరు మాసాల అవుతున్నప్పటికీ ఇప్పటివరకు బకాయిలు మంజూరు చేయలేదని ఆరోపిస్తున్నారు. సీజన్ మరోసారి ప్రారంభం కావడంతో పంటకు పెట్టుబడి పెట్టలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, ప్రభుత్వం నిర్దేశిత ప్రకారం కేజీ మామిడికి 8 రూపాయలు వంతున బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
అన్నమయ్య జిల్లా రామాపురానికి చెందిన వైసీపీ కార్యకర్త రామచంద్రారెడ్డిపై జరిగిన దాడిని వైసీపీ నేతలు తీవ్రంగా ఖండించారు. కడపలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన్ను వైసీపీ జిల్లా అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి, ఎమ్మెల్యేలు అమర్నాథ్ రెడ్డి, సుధ, ఎమ్మెల్సీ రామ సుబ్బారెడ్డిలు పరామర్శించారు. సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారనే నెపంతో మంత్రి అనుచరులు హాకీ స్టిక్కులతో విచక్షణారహితంగా దాడి చేశారని, పోలీసుల విచారణ సరిగా లేదని వారు ఆరోపించారు.
నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలంలోని హోటల్ బలిజ పాలెం, పంటపాలెం, పోర్ట్ రోడ్డు ప్రాంతాల్లో పోలీసులు ముమ్మరంగా కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ముగ్గురు ఎస్సైలు, 50 మంది సిబ్బందితో కూడిన బృందాలు ప్రతి ఇంటిని క్షుణ్ణంగా తనిఖీ చేశాయి. ఈ తనిఖీల్లో సరైన పత్రాలు లేని 25 బైక్ లు, 3 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. గంజాయి, నాటుసారా వంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై ప్రసాద్ రెడ్డి హెచ్చరించారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.. జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు సర్వం సిద్ధమైంది. ఇవాళ్టి నుంచి ఏడూళ్ల బయ్యారంలో అండర్ 17 నేషనల్ కబడ్డీ పోటీలు జరగనున్నాయి. ఇప్పటికే ఈ పోటీల్లో పాల్గొననున్న టీమ్స్ ఏడూళ్ల బయ్యారం చేరుకున్నాయి.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. హెలిపాడ్ వద్ద మంత్రులు నిమ్మల రామానాయుడు, కొలుసు పార్థసారథి, అధికారులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. అంతకుముందు ఏరియల్ సర్వే ద్వారా పనుల పురోగతిని పర్యవేక్షించారు. అనంతరం వ్యూ పాయింట్ నుంచి స్పిల్ వే, డయాఫ్రమ్ వాల్, ఇతర నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని ఉదయం వీఐపీ విరామ సమయంలో మారిషస్ ప్రెసిడెంట్ దరం గోఖుల్ కుటుంబ సభ్యులతో కలసి దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా..ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.
గ్రీన్‌లాండ్ అమెరికాలో భాగంగా మారాల్సిందేనని, అది తమ జాతీయ భద్రతకు అవసరమని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగం పునరుద్ఘాటించింది. దానిపై నియంత్రణ సాధించేందుకు తమ వద్ద చాలా ఆప్షన్లు ఉన్నాయని, వాటిల్లో సైన్యాన్ని వాడే అంశం కూడా పరిశీలనలో ఉందని వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ పేర్కొన్నారు.
పాకిస్థాన్ ఉగ్ర దాడులకు ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టిన సమయంలో పశ్చిమ దేశాలు కపటత్వం ప్రదర్శించడంపై విదేశాంగ మంత్రి జై శంకర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తమకు వేల మైళ్ల దూరంలో ఉన్న ఆ దేశాలు ఉద్రిక్తతల సమయంలో ఆందోళన చెందినట్లు చెప్పాయని.. కానీ అవేవీ తమ సొంత ప్రాంతంలో జరుగుతున్న వాటిని పట్టించుకోవడం లేదని విమర్శించారు. లక్సెంబర్గ్‌లోని భారత కమ్యూనిటీ సభ్యులతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
విజయ్ హజారే ట్రోఫీలో ఉత్తరప్రదేశ్ కెప్టెన్ గా రింకూ సింగ్ అద్భుత ప్రదర్శన చేస్తున్నారు. వరుసగా 6 విజయాలతో తన జట్టును గ్రూప్-బిలో అగ్రస్థానంలో నిలిపారు. కేవలం కెప్టెన్సీలోనే కాకుండా..మిడిల్ ఆర్డర్ బ్యాటర్ గా మెరుపు హాఫ్ సెంచరీలు, సెంచరీతో పరుగుల వరద పారిస్తున్నారు. ప్రతి మ్యాచ్ లోనూ ఫినిషర్ గా తన మార్క్ చూసిస్తున్న రింకూ..రాబోయే టీ20 ప్రపంచకప్ లోనూ ఇదే ఫామ్ ను కొనసాగించాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
కథానాయకుడు మహేశ్‌బాబు.. దర్శకుడు రాజమౌళి కలయికలో రూపొందుతున్న వారణాసి సినిమా అరుదైన ఘనతని సొంతం చేసుకుంది. ఈ చిత్ర టైటిల్ గ్లింప్స్‌ను పారిస్‌లోని ప్రఖ్యాత లే గ్రాండ్ రెక్స్ థియేటర్లో ప్రదర్శించారు. ఇలా అక్కడ ప్రదర్శించిన తొలి భారతీయ సినిమా గ్లింప్స్‌గా వారణాసి రికార్డు నెలకొల్పింది. ఈ విషయాన్ని లే గ్రాండ్ రెక్స్ సామాజిక మాధ్యమాల వేదికగా ప్రకటించగా.. దాన్ని వారణాసి టీమ్ రీట్వీట్ చేస్తూ సంతోషం వ్యక్తం చేసింది.