కల్వకుంట్ల ఫ్యామిలీలో ఆస్తుల పంచాయితీ నడుస్తున్నదని రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చ నడుస్తున్నది.అన్నాచెల్లెలి నడుమ పదవుల పంచాయితీ సైతం నెలకొనగా.. తన తండ్రి నుంచి స్పందన లేకపోవడంతో చివరకు కవిత పార్టీ వ్యతిరేక స్టాండ్ తీసుకున్నట్టు ప్రచారం జరిగింది. పార్టీకి చెడ్డపేరు వస్తుందని నేతల సూచన మేరకు కేసీఆర్ తన సొంత బిడ్డను సస్పెండ్ చేశారు.దీంతో బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన కల్వకుంట్ల కవిత.. ఆత్మగౌరవం కోసమే తనపోరాటమని, ఆస్తుల కోసం కాదని ప్రకటించారు. రాబోయే రోజుల్లో నిజమైన ఉద్యమకారులను తన వెంట కలుపుకుని పోరాటం చేస్తామన్నారు. దీనికితోడు ఆమె గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి, అక్రమాలపై క్రమంగా ప్రశ్నలు సంధిస్తున్నారు.
రెండ్రోజుల కిందట మండలి సమావేశాలకు హాజరైన కవిత.. మాట్లాడుతున్న క్రమంలో తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. సొంత కుటుంబ సభ్యులే తనను మోసం చేశారని.. తన భర్త ఫోన్ ట్యాప్ చేశారని.. పార్టీకి ఎంతో సేవ చేశానని.. తెలంగాణ ఉద్యమంలోనూ పాల్గొన్న తనపై కుట్రలు చేసి పార్టీ నుంచి బయటకు పంపించారని తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఇవన్నీ కేసీఆర్‌కు తెలిసినా ఆయన ఎందుకు ఉపేక్షించారని ఆమె మండలి వేదికగా వాపోయారు. బీఆర్ఎస్ హయాంలో ఉద్యమకారులకు తీవ్ర అన్యాయం జరిగిందని, అవినీతి సైతం జరిగిందని ఆమె అంగీకరించారు. హరీశ్ రావు వల్లే తన కుటుంబం ముక్కలైందని సైతం పరోక్షంగా ఆరోపించారు. చివరగా.. తాను వ్యక్తిగా వెళ్తున్నానని.. శక్తిగా మరల చట్టసభలకు తిరిగొస్తానని చెప్పారు. అనంతరం తన రాజీనామాను ఆమోదించాలని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి విజ్ఞప్తి చేయడంతో నిన్న సాయంకాలం ఆమె ఎమ్మెల్సీ రాజీనామాకు ఆమోదం లభించింది.
బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఎమ్మెల్సీ పదవి తనకెందుకని రాజీనామా చేసిన కవిత.. తన భవిష్యత్ కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నట్టు తెలుస్తున్నది. ఈ మేరకు త్వరలోనే కొత్త పార్టీ పెట్టనున్నట్టు ప్రకటించారు. ఉగాది రోజున పార్టీ ప్రకటన ఉంటుందని టాక్ నడుస్తున్నది. అయితే, ప్రస్తుతం రాష్ట్ర జాగృతి అధ్యక్షురాలిగా ఉన్న ఆమె.. ఆ సంస్థనే పార్టీగా ప్రకటించి రిజస్టర్డ్ చేయిస్తారని కూడా చర్చ జరుగుతున్నది. బీఆర్ఎస్ పార్టీలో అవమానానికి గురై వెళ్లిపోయిన ఉద్యమకారులు, పోరాటాలే పరమాధిగా పనిచేసే కమ్యూనిస్టులు తనతో కలిసి రావాలని ఆమె పిలుపునిచ్చారు. పార్టీ ఏర్పాటు రోజే తన సిద్ధాంతం ఏమిటో కూడా వివరించనున్నట్టు తెలుస్తున్నది. సామాజిక తెలంగాణ ఏర్పాటే తన ధ్యేయమని ఇటీవల కవిత ఓసారి మీడియాతో అన్నారు. అదే లైన్ మీద వెళ్తారా? లేదా? అనేది కూడా తెలియాల్సి ఉన్నది.
BRS News: బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్.. కేటీఆర్ ఖమ్మం టూర్‌కి ముందే, రానున్న రోజుల్లో
శాసన మండలిలో తన చెల్లి కవిత భావోద్వేగంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తాజాగా స్పందించారు. ఏ ఇంట్లో అయినా గొడవలు ఉంటాయని, దాన్ని భూతద్దంలో చూడాల్సిన పనిలేదని అన్నారు. అలుగుడు, గులుగుడు అనేవి సహజం అని..కొన్ని కోరుకున్నప్పుడు దక్కకపోతే సర్దుకుపోవాలి కానీ, పక్కన వారికి సందు ఇవ్వరాదని స్వీట్ మెసేజ్ పంపారు. పరోక్షంగా తన చెల్లి కవితను ఉద్దేశించి కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తున్నది. మరోవైపు బీఆర్ఎస్ పార్టీకి చెందిన కొందరు మహిళా నేతలు సైతం ఇటీవల కవితను టార్గెట్ చేశారు. టీఆర్ఎస్ పార్టీ పేరు బీఆర్ఎస్‌గా మార్చినప్పుడు ఆమె అంగీకరించందని, రాష్ట్ర జాగృతి పేరును భారత జాగృతిగా మార్చింది ఎవరని ప్రశ్నించారు. దీని వెనుక సైతం కేటీఆర్ ప్రోద్భలం ఉందనే చర్చ ప్రస్తుతం నడుస్తున్నది. ఇదిలాఉండగా, ప్రభుత్వం పై ఆరోపణలు చేస్తున్న కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావులు.. ముందుగా కవిత అడిగే ప్రశ్నలపై స్పందించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.