సోనియాగాంధీ ఆరోగ్యంగా ఉండాలని కాంగ్రెస్ సీనియర్ నేత హనుమంతరావు మృత్యుంజయ యాగం జరిపిస్తున్నారు. హైదరాబాద్ అంబర్ పేటలోని శ్రీ మహంకాళి దేవస్థానంలో యాగం చేయిస్తున్నారు. సోనియా గాంధీ కొంతకాలంగా దీర్ఘకాలిక దగ్గు సమస్యతో బాధపడుతున్నట్లు సమాచారం.
పంచాయతీ ఎన్నికల్లో ఇంటివారే నష్టానికి కారణమయ్యారన్నారు ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి. ప్రతిపక్ష పార్టీతో సంబంధం పెట్టుకుని పంచాయతీ ఎన్నికల్లో.. అభ్యర్థుల ఓటమి కోసం పనిచేశారని ఆరోపించారు. పార్టీకి మోసం చేసిన వారితో నేరుగా మాట్లాడిన కూడా స్పందన రాలేదన్నారు. ఎవరైతే పార్టీకి మోసం చేశారో వారిపై PCC అధ్యక్షులకు, రాష్ట్ర ACC అధ్యక్షులు మీనాక్షి నటరాజన్‌కు ఫిర్యాదు చేశామన్నారు.
తిరుమల పరకామణి చోరీ కేసుకు సంబంధించి CID, ఏసీబీ వేగంగా చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా అప్పట్లో తిరుమలలో పనిచేసిన పోలీస్ అధికారుల పైన కేసు నమోదు చేయాలని హైకోర్టు ఆదేశించండతో తిరుమల వన్ టౌన్ లో మరోసారి కేసులు నమోదయ్య అవకాశం ఉంది. తర్వాత సీఐడీ, ఏసీబీ ఈ కేసును స్వాధీనం చేసుకోనున్నాయి. ఇందులో భాగంగానే న్యాయ నిపుణులతో ఉన్నతాధికారులు చర్చిస్తున్నట్లు సమాచారం.
మేకలు, గొర్రెల రక్తంతో ఇల్లీగల్ దందా చేస్తున్న CNK ల్యాబ్‌ని సీజ్ చేశారు డ్రగ్ కంట్రోల్ అధికారులు. కీసరలో మూగ జీవాల నుంచి రక్తం సేకరిస్తున్న ఇద్దరిని అరెస్టు చేశారు. వీరి నుంచిరక్తం కొంటోన్నది CNK ల్యాబేనని గుర్తించారు. ల్యాబ్‌లో భారీగా రక్తం నిల్వలు ఉన్నట్టు గుర్తించారు. మటన్ షాప్ యజమాని సోను, నకిలీ వెటర్నరీ డాక్టర్ సంజీవ్ ను అరెస్ట్ చేశారు పోలీసులు.
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని నేడు వీఐపీ విరామ సమయంలో సినీ నటుడు శ్రీరామ్ దంపతులు దర్శించుకున్నారు. వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్న అనంతరం రంగనాయకుల మండపంలో వీరికి వేదపండితులు ఆశీర్వచనం అందించగా, అధికారులు ప్రసాదాలు అందజేశారు. ప్రతి ఏటా కుటుంబంతో కలిసి రావడం ఆనవాయితీ అని, స్వామివారు తమ కులదైవమని తెలిపారు శ్రీరామ్.
శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో గత కొన్ని రోజులుగా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు పడిపోయాయి. తీవ్రమైన పొగమంచు కారణంగా వాహనాలు కనిపించని పరిస్థితి నెలకొంది. చలిగాలుల ధాటికి ప్రజలు వణికిపోతూ చలిమంటలను ఆశ్రయిస్తున్నారు. మంచు ప్రభావంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతుండగా, జనజీవనం స్తంభించి పోయింది.
సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని అంబేడ్కర్ యూనివర్సిటీ కేంద్రంలో ప్రమాదవశాత్తూ మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే స్పందించి మంటలను అదుపు చేశారు. దీనితో పెను ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
నిజామాబాద్ జిల్లా బోధన్ బాలికల గురుకుల విద్యాలయ విద్యార్థినులు ఇంగ్లీష్ టీచర్ వేధింపులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళన చేపట్టారు. పీజీటీ టీచర్ తమను “కుక్క జాతి, బర్రె జాతి” అంటూ జుగుప్సాకరంగా దూషిస్తున్నారని, మానసిక వేధింపులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిరసనగా రోడ్డెక్కేందుకు ప్రయత్నించిన విద్యార్థినులను యాజమాన్యం అడ్డుకుంది. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
సచివాలయంలో మంత్రి సీతక్క, ములుగు డీసీసీ అధ్యక్షులు పైడాకుల అశోక్ కలిసి మంత్రి తుమ్మల నాగేశ్వరరావును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు మేడారం మహా జాతర ఆహ్వాన పత్రికను అందజేసి, జాతరకు రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానించారు.
నంద్యాల జిల్లా మల్యాల గ్రామంలో పైపులైన్ లీకేజీతో నీరు వృథా కావడంతో 50 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. రెండేళ్లుగా కాంట్రాక్టర్, అధికారుల నిర్లక్ష్యంతో సాగునీరు అందక అప్పుల ఊబిలో కూరుకుపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు తక్షణమే నష్టపరిహారం అందించి ఆదుకోకపోతే ఆత్మహత్యలే శరణ్యమని వారు హెచ్చరిస్తున్నారు.
నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం తూంపల్లి గ్రామ పరిధిలో చిరుత సంచారం కలకలం రేపుతోంది. అడవిలో ఓ లేగ దూడపై దాడి చేసి చంపేసింది. దూడ యజమాని మాలవత్ రఘు పిర్యాదు చేయడంతో.. ఘటన స్థలాన్ని పరిశీలించారు FRO రవీందర్. మరణించిన లేగ దూడకు.. అక్కడే పంచనామా చేయించారు. చిరుత సంచారంతో తూంపల్లి ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో కలకలం రేపిన పోలీస్ స్టేషన్ గేట్ ఎదుట హత్య కేసులో పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. తనకల్లు పోలీస్ స్టేషన్ గేటు ఎదుట ఈశ్వరప్ప హత్య కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు. ప్రధాన నిందితులు.. హరి, చిన్నప్ప, గంగులప్ప, శంకర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని కదిరి ఆర్ అండ్ బి బంగ్లా నుంచి సబ్ జైలు వరకు నడిరోడ్డుపై నడిపించుకుంటూ తీసుకెళ్లారు. అనంతరం వారిని రిమాండ్‌కు తరలించారు.
నిర్మల్ జిల్లా కడెం మండలంలోని లింగాపూర్ గ్రామంలో జట్టక్కను తరిమికొట్టే కార్యక్రమాన్ని గ్రామస్తులు చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామంలోని ప్రతి ఇంటి నుంచి పాత బట్టలు చీపురు, చాట తీసుకొని ఒకరినొకరు చీపురులతో కొట్టుకుంటూ జట్టక్కపో అంటూ ఊరేగింపు నిర్వహించారు.
తూర్పుగోదావరి జిల్లాలో పూరీ-తిరుపతి ఎక్స్‌ప్రెస్‌కు తృటిలో పెను ప్రమాదం తప్పింది. తుని – అన్నవరం మధ్య రైలులోని ఏసీ B5 బోగీ వాష్‌రూమ్ వద్ద ఉన్న దుప్పట్ల సెక్షన్‌లో స్వల్పంగా మంటలు చెలరేగాయి. సిబ్బంది సకాలంలో గుర్తించి ఆర్పేయడంతో ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ఎవరో సిగరెట్ కాల్చి వేయడం వల్లే ప్రమాదం జరిగినట్లు అనుమానిస్తున్నారు. రాజమండ్రిలో తనిఖీల అనంతరం రైలు తిరిగి ప్రయాణమైంది.
యూట్యూబర్ అన్వేష్‌పై ఇండియాలోనే కాకుండా దేశ వ్యాప్తంగా ఉన్న హిందువులు మండిపడుతున్నారు. తనకు అనుమతిస్తే అన్వేష్‌ను.. భరతమాత కాళ్ల దగ్గర తీసుకొచ్చి పడేస్తానంటోంది ఉక్రెయిన్ మహిళ లిడియా లక్ష్మీ. లేకపోతే మరో దేశానికి అతడు పారిపోయే అవకాశాలున్నాయని చెప్తుంది.
నియోజకవర్గంలో తనకు సలహా, సూచనలు ఇచ్చేవారిని ఝాన్సీరెడ్డి దూరం పెడుతున్నారని పాలకుర్తి కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. ఎన్నికలకు ముందు ఒక్క హామీని నెరవేర్చలేదన్నారు. కనీసం సొంత గ్రామంలో సర్పంచ్‌ను కూడా ఆమె గెలిపించుకోలేకపోయిందని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఝాన్సీ రెడ్డి ప్రవర్తన వల్ల పాలకుర్తిలో కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిచే అవకాశం లేదని చెబుతున్నారు.
నేషనల్ షూటింగ్ కోచ్ అంకుశ్ భరద్వాజ్‌పై సస్పెన్షన్ వేటు పడింది. ఫరీదాబాద్‌లోని ఓ హోటల్‌లో 17 ఏళ్ల జాతీయస్థాయి మహిళా షూటర్‌పై లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో అంకుశ్‌పై హరియాణా పోలీసులు కేసు నమోదు చేశారు. బాధిత మహిళా షూటర్ కుటుంబీకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ చర్యలు తీసుకున్నారు.
తమ స్వరాన్ని, సాహిత్యాన్ని అయ్యప్ప స్వామికి అర్పించాలనుకునే భక్తులకు ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు(టీడీబీ) సువర్ణ అవకాశాన్ని అందిస్తోంది. తాము సొంతంగా రాసిన, రూపొందించిన పాటలను శబరిమల సన్నిధానంలోని లౌడ్‌స్పీకర్లలో ప్లే చేసే అవకాశాన్ని కల్పిస్తోంది. భక్తుల సృజనాత్మకతను ప్రోత్సహించడానికి, ప్రఖ్యాత గాయకులు పాడిన పాత పాటలతో పాటు, కొత్తగా స్వరపరిచి, రికార్డ్ చేసిన పాటలు ప్లే లిస్ట్‌లో చేర్చాలని నిర్ణయించింది.
సంక్రాంతికి సొంత ఊళ్లకు వెళ్లేవారికి దక్షిణమధ్య రైల్వే శుభవార్త చెప్పింది. పండుగ వేళ ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, భారీగా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపింది. సుమారు 150 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు సీపీఆర్‌ఓ శ్రీధర్ తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్యే కాకుండా దేశంలోని ఉత్తర, తూర్పు, దక్షిణ భారత ప్రాంతాలకు కూడా రైళ్లను నడపనున్నట్లు వివరించారు.
తమిళ హీరో శివకార్తికేయన్, శ్రీలీల జంటగా నటించిన ‘పరాశక్తి’ తెలుగు వెర్షన్ మూవీ సంక్రాంతి బరి నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. జనవరి 10న విడుదల కావాల్సిన ఈ చిత్రానికి, తెలుగులో ప్రభాస్ ‘రాజాసాబ్’, చిరంజీవి ‘మన శంకరవరప్రసాద్ గారు’ వంటి భారీ సినిమాలు ఉండటంతో థియేటర్ల కొరత ఏర్పడింది. ప్రమోషన్స్ కూడా ప్రారంభం కాకపోవడంతో, తెలుగు వెర్షన్‌ను జనవరి 23కి వాయిదా వేసినట్లు సమాచారం.