E-Paper
Advertisement

Top 20 News: పవన్ కళ్యాణ్‌పై మంత్రి అంబటి సెటైర్లు, విజయవాడ దుర్గగుడిలో అపచారం

Top 20 News: పవన్ కళ్యాణ్‌పై మంత్రి అంబటి సెటైర్లు, విజయవాడ దుర్గగుడిలో అపచారం

1. మున్సిపల్ ఎలక్షన్స్ తర్వాత..

మున్సిపల్ ఎలక్షన్స్ తర్వాత తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరిగే అవకాశం ఉంది. ఫిబ్రవరి రెండు లేదా మూడో వారంలో మున్సిపల్ ఎలక్షన్స్ జరిగే అవకాశం ఉండటంతో.. ఫిబ్రవరి చివరి వారంలో బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది. కేంద్ర బడ్జెట్ ఆధారంగా పథకాలు, నిధులు అంచనా వేసి.. 2026-27 బడ్జెట్ రూపకల్పన చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

2. పవన్ కళ్యాణ్‌పై మంత్రి అంబటి సెటైర్లు

డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌పై మాజీ మంత్రి అంబటి రాంబాబు సెటైర్లు వేశారు. గతంలో నేను డాన్స్ చేస్తే సంబరాల రాంబాబు అన్నారు.. మరి ఇప్పుడు పవన్ డ్యాన్స్ చేశారు మరి అది ఏంటని ఆయన ప్రశ్నించారు. అయితే నిన్న పిఠాపురంలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న పవన్‌కల్యాణ్ గిరిజన కళాకారులతో కలిసి థింసా ఆడారు. దీనిపై పవన్‌కల్యాణ్‌ను ట్యాగ్ చేస్తూ ఎక్స్ వేదికగా అంబటి రాంబాబు పోస్ట్ చేశారు.

3. విజయవాడ దుర్గగుడిలో అపచారం

విజయవాడ దుర్గగుడిలో అపచారం జరిగింది. అమ్మవారి పూజకు ఉపయోగించే పాలల్లో పురుగు వచ్చింది. అమ్మవారికి శ్రీచక్ర అర్చన నిర్వహిస్తుండగా పాలల్లో పురుగు రావడంతో అరగంట పాటు అర్చనను ఆలయ అధికారులు నిలిపివేశారు. దీంతో భక్తులు అయోమయానికి గురయ్యారు. మరోవైపు అమ్మవారి పూజలకు టెట్రాబిక్ పాలను ఉపయోగించడంపైనా భక్తులు అభ్యంతరం తెలుపుతున్నారు.

4. బిగ్ అకాడమీ ప్రారంభోత్సవంపై సీవీ ఆనంద్ పోస్ట్

బిగ్ అకాడమీ ప్రారంభోత్సవంపై పోస్ట్ చేశారు సీవీ ఆనంద్. యువరాజ్, బ్రహ్మానందంతో కలిసి వేదిక పంచుకోవడం సంతోషంగా ఉందన్నారు సీవీ ఆనంద్. నాణ్యతతో కూడిన చదువు విద్యార్థులకు అవసరమని చెప్పారన్నారు. క్యాన్సర్‌తో పోరాడి తిరిగి క్రికెట్‌లో రాణించిన యువరాజ్ జీవితం విద్యార్థులకు స్ఫూర్తిదాయకం అన్నారు సీవీ ఆనంద్. యువరాజ్‌తో కలిసి క్రికెట్ ఆడడం సరదాగా అనిపించిందన్నారు.

5. సెట్ దర్యాప్తు

టీటీడీ కల్తీ నెయ్యి కేసులో సిట్ విచారణ కొనసాగుతోంది. సిట్ కార్యాలయంలో కేసు విచారణ దస్త్రాలను పరిశీలిస్తున్నారు అధికారులు. ఈ నెలాఖరులోగా నెల్లూరు ఏసీబీ కోర్టులో.. అనుబంధ ఛార్జ్ షీట్ దాఖలు చేయనుంది సిట్.

6. కోడిపందాలకు రంగం సిద్ధం

పశ్చిమ గోదావరి జిల్లాలో కోడిపందాలకు రంగం సిద్ధం అవుతుంది. పందెం రాయుళ్లు సై అంటూ చకచకా ఏర్పాట్లు చేస్తున్నారు. పందాలు చూడటానికే వచ్చే వారి కోసం ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తున్నారు బరి నిర్వాహకులు. సందర్శకులు కోడిపుంజులను చూసేందుకు వీలుగా ప్లాట్ ఫామ్ ఎత్తుగా ఏర్పాటు చేస్తున్నారు. VIP, వివి ఐపి, కోడిపుంజుల యజమానులకు ప్రత్యేక గ్యాలరీలు కూడా ఏర్పాటు చేస్తున్నారు.

7. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలంలో పల్లె పండుగ

కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం గుర్రంపాలెం సగరపేట మోడల్ పాఠశాలలో ‘పల్లె పండుగ’ సంబరాలు అంబరాన్నంటాయి. ఈ వేడుకల్లో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ముఖ్య అతిథిగా పాల్గొని పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. పాఠశాల ఆవరణలో భోగి మంటలు, ముగ్గులు, గొబ్బెమ్మలు, హరిదాసు కీర్తనలతో పల్లెటూరి వాతావరణం ఉట్టిపడింది. తెలుగు సంస్కృతిని ప్రతిబింబించేలా ఏర్పాటు చేసిన ఈ వేడుకలు అందరినీ అలరించాయి.

8. 3 కిలోమీటర్లు జామ్

సంక్రాంతికి సొంత ఊర్ల బాట పట్టిన ప్రజలతో..చిట్యాల మండలం పెద్దకాపర్తి వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై మూడు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ నెలకొంది. పెదకాపర్తి వద్ద నూతనంగా నిర్మిస్తున్న బ్రిడ్జ్‌ పనులతో ఇరుకుగా మారింది సర్వీసు రోడ్డు. దీంతో వాహనాలు మెల్లగా కదులుతున్నాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

9. దొంగల బీభత్సం

శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం పట్టణంలో దొంగలు బీభత్సం సృష్టించారు. సంక్రాంతి పండుగకు ఊరెళ్లిన వారి ఇళ్లే లక్ష్యంగా గొల్ల వీధి, అప్పన్నపేట ప్రాంతాల్లోని నాలుగు ఇళ్లలో అర్ధరాత్రి చోరీలకు పాల్పడ్డారు. బాధితులు ఇళ్లలో లేకపోవడంతో ఎంత మేర నగదు, బంగారం పోయిందనేది ఇంకా తెలియరాలేదు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.

10. కబ్జాపై విచారణ

హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని రోడ్ నెంబర్ 32, 33లో ఉన్న.. GHMC పార్క్ కబ్జాకి గురైనట్లు వస్తున్న ఆరోపణలపై విచారణ చేపట్టింది GHMC. 98 గజాలు మాత్రమే తీసుకుంటామని చెప్పి.. దాదాపుగా 500 గజాల పార్క్ స్థలం కబ్జా చేసినట్లు ఆరోపణలు రావడంపై హైడ్రా కూడా విచారణ చేపట్టింది. ప్రభుత్వ స్థలంలో టెంపరరీ షెడ్ కూడా ఏర్పాటు చేశారు. దీనిపై GHMC, హైడ్రా అధికారులు విచారణ చేస్తున్నారు.

11. మామను కత్తితో పొడిచి చంపిన అల్లుడు

బాపట్ల జిల్లా మార్టూరులో మామ, అల్లుడు మధ్య డబ్బుల విషయంలో జరిగిన ఘర్షణ హత్యకు దారితీసింది. మార్టూరుకు చెందిన హుస్సేన్ సాహెబ్, తన అల్లుడు అన్సర్ భాషకు కొంత సొమ్ము ఇవ్వాల్సి ఉంది. ఈ విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరగగా.. మద్యం మత్తులో ఉన్న అల్లుడు తీవ్ర ఆగ్రహానికి లోనై మామను కత్తితో పొడిచాడు. తీవ్ర రక్తస్రావంతో ఉన్న హుస్సేన్‌ను వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ.. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు.

12. సంక్రాంతి సంబరాలు

వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం అన్నారం గ్రామంలోని పల్లవి మోడల్ స్కూల్‌లో ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా జరిగాయి. విద్యార్థులు కులవృత్తులను ప్రతిబింబించే వేషధారణలు, రంగోలి పోటీలు, సాంస్కృతిక ప్రదర్శనలతో సందడి చేశారు. ముఖ్య అతిథులుగా హాజరైన ఎస్సై ప్రవీణ్, సర్పంచ్ విద్యార్థులతో కలిసి భోగి మంటలు, గాలిపటాల పోటీలలో పాల్గొన్నారు. ఎడ్ల బండి ప్రదర్శన, తాడు గుంజుడు ఆటలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

13. పండుగ వాతావరణం

నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్‌లో ముందస్తు సంక్రాంతి పండుగ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా చిన్నారులు సంప్రదాయ వస్త్రాలు ధరించి, రంగులతో రకరకాల ముగ్గులు వేసి అందులో గొబ్బెమ్మలను ఉంచారు. దీంత్ పాఠశాలలో పండుగ వాతావరణం నెలకొంది.

14. ఇంటిపై గాలిపటం ఎగరేస్తుండగా కరెంట్ షాక్.. బాలుడు మృతి

అన్నమయ్య జిల్లా గాలివీడు మండలంలో విషాదం చోటుచేసుకుంది. ఇంటిపై గాలిపటం ఎగరేస్తుండగా.. కరెంట్ తీగలు తగిలి బాలుడు మృతి చెందాడు. బాలుడు శ్రీనివాస్‌గా గుర్తించారు. సంక్రాంతి పండగ సెలవులకు అమ్మమ్మ ఇంటికి వచ్చాడు. శ్రీనివాస్‌ స్వస్థలం గోరాంచెరువులోని బుచ్చేవాండ్ల పల్లి అని పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి న పోలీసులు విచారణ చేపట్టారు.

15. భారీ బైక్ ర్యాలీ

హైదరాబాద్‌లోని కొండాపూర్‌లో రవాణా శాఖ ఆధ్వర్యంలో రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం ఘనంగా జరిగింది. వాహనదారులు విధిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని అవగాహన కల్పిస్తూ భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. వాహనాలకు సంబంధించిన అన్ని పత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలని ఆర్టీఏ అధికారులు సూచించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని వాహనదారులతో రహదారి భద్రతపై ప్రతిజ్ఞ చేయించారు.

16. కీసర టోల్ ప్లాజా వద్ద భారీ ట్రాఫిక్

ఎన్టీఆర్ జిల్లా కీసర టోల్ ప్లాజా వద్ద ట్రాఫిక్‌ను విజయవాడ రూరల్ డీసీపీ లక్ష్మీనారాయణ పరిశీలించారు. సంక్రాంతి పండుగ వేళ విజయవాడ మార్గంలో వాహనాల రద్దీ పెరుగుతోంది. రద్దీని తగ్గించేందుకు అధికారులు 8 టోల్ బూత్‌లను అందుబాటులోకి తెచ్చారు. గంటకు సుమారు 500 వాహనాలు టోల్ దాటుతున్నట్లు అంచనా. ట్రాఫిక్ జామ్‌లను నివారించడానికి కంచికచర్ల పోలీసులు అదనపు సిబ్బందిని నియమించారు.

17. స్వగ్రామానికి

అమెరికాలోని కాలిఫోర్నియాలో గతనెల డిసెంబర్ 29న జరిగిన కారు ప్రమాదంలో ఇద్దరు తెలుగు విద్యార్థినిలు మృతి చెందారు. మహబూబాబాద్ జిల్లా గార్ల మండలానికి చెందిన పుల్ల ఖండు మేఘన రాణి, ముల్కనూరు గ్రామానికి చెందిన కడియాల భావన మృతదేహాలు 14 రోజుల తర్వాత నేడు స్వగ్రామాలకు చేరుకున్నాయి.

18. డొనాల్డ్ ట్రంప్ మరో షాకింగ్ నిర్ణయం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. ఈసారి ట్రంప్‌ ఫోకస్‌ గ్రీన్‌లాండ్‌పైనో.. ఇరాన్‌పైనో కాదు.. అమెరికన్ క్రెడిట్‌ కార్డ్ కంపెనీలపై పడింది. అమెరికన్లపై అడ్డగోలుగా వడ్డీ రేట్లు వేస్తున్న క్రెడిట్ కార్డ్‌ కంపెనీలపై ఆయన ఆంక్షలు విధించారు. ఇకపై వడ్డీ రేట్లను 10 శాతానికి పరిమితం చేయాలంటూ ఆంక్షలు విధించారు. ప్రస్తుతం క్రెడిట్ కార్డ్ కంపెనీలు 20 నుంచి 30 శాతం వసూలు చేస్తున్నాయి. దీంతో ఈ నిర్ణయం ఇప్పుడు కంపెనీలపై గట్టిగానే ప్రభావం చూపించనుంది.

19. అడుగు దూరంలో..

జాతీయ సీనియర్ బాక్సింగ్ టోర్నీలో స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ టైటిల్‌కు మరో అడుగు దూరంలో నిలిచింది. 51 కిలోల విభాగంలో జరిగిన సెమీఫైనల్లో నిఖత్ 4-1 తో కుసుమ్ బాగెల్‌పై ఘన విజయం సాధించి, ఫైనల్‌కు అర్హత సాధించింది. తుది పోరులో మాజీ ప్రపంచ ఛాంపియన్‌ నీతుతో తలపడనుంది.

20. టికెట్ రేట్ల పెంపు

మన శంకర వరప్రసాద్‌ గారు సినిమా.. టికెట్ల ధరలను పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రీమియర్‌ షోలకు కూడా అనుమతి ఇచ్చింది. ప్రీమియర్‌ షో టికెట్‌ ధరను రూ.600గా నిర్ణయించింది. ఇక ఈనెల 12 నుంచి 7 రోజులపాటు సింగిల్‌ స్క్రీన్లలో రూ. 50, మల్టీప్లెక్సులలో రూ.100 పెంచుకునే అవకాశం కల్పించింది.

Related News

ఉదయం లేవగానే అలసట, కాళ్ల నొప్పులు ఎందుకు వస్తాయో తెలుసా ?

Intinti Ramayanam TRP Rating : ‘ఇంటింటి రామాయణం’ టీఆర్పీ రేటింగ్.. మే హైలెట్ ఎపిసోడ్స్..

Brahmamudi Serial Today Episode May 26th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  రాజుకు షాక్ ఇచ్చిన ఇందు

తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరడం ఖాయం.. ఎంపీ ఈటల రాజేందర్ ధీమా

ఎంత స‌తాయిస్తే.. అంత విజ‌య్‌కే మేలు.. ! దేశం మొత్తం త‌ల‌ప‌తి స్థితిపై సానుభూతి!!

మంత్రి హోదాలో తుమ్మల 40 వసంతాల వేడుక!

Podarillu Today Episode : నారాయణకు దిమ్మతిరిగే షాక్.. డ్యాన్స్ లతో సందడి.. కన్నీళ్లు పెట్టుకున్న ప్రతాప్..

జేమ్స్ కామెరాన్‌కు గట్టి ఎదురుదెబ్బ.. అవతార్ లాభాల్లో వాటా డిమాండ్ చేస్తున్న నటి

Big Stories

×