E-Paper
Advertisement

Top 20 News: వైసీపీ నాయకుల పై ఎంపీ పుట్టా మహేష్ ఫైర్, కామారెడ్డి జిల్లాలో దొంగల బీభత్సం

Top 20 News: వైసీపీ నాయకుల పై ఎంపీ పుట్టా మహేష్ ఫైర్, కామారెడ్డి జిల్లాలో దొంగల బీభత్సం

1. వైసీపీ నాయకుల పై ఎంపీ పుట్టా మహేష్ ఫైర్

వైసీపీ నాయకులు దేవుడి దగ్గర కూడా రాజకీయాలు చేస్తున్నారని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ మండిపడ్డారు. టీటీడీ పవిత్రతను పాడు చేసే విధంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. ఓ పత్రిక విలేకరులే కొండపైకి ఖాళీ మద్యం సీసాలు తీసుకొచ్చారన్నారు. మద్యం సీసాలు కొనుగోలు చేసిన జియో ట్యాగింగ్‌తో సహా ఆధారాలన్నీ ఉన్నాయని వెల్లడించారు.

2. నాకు సంబంధం లేదు

సినిమా టికెట్ల ధరల పెంపుతో తనకు ఎలాంటి సంబంధం లేదని మంత్రి కోమటిరెడ్డి స్పష్టం చేశారు. అసలు ఆ పెంపు విషయమే తనకు తెలియదని, తన వద్దకు ఎలాంటి ఫైల్ రాలేదని ఆయన తేల్చి చెప్పారు.

3. గాలింపు చర్యలు

మేక, గొర్రెల రక్తాన్ని అక్రమంగా సరఫరా చేస్తున్న CNK ల్యాబ్ యజమాని నికేష్ కుమార్ గత ఏడు రోజులుగా పరారీలో ఉన్నాడు. కీసర పోలీసులు ప్రత్యేక బృందాలతో అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ మేరకు కాచిగూడలోని సదరు ల్యాబ్‌పై డ్రగ్ కంట్రోల్ అధికారులు దాడులు నిర్వహించి, 1000 లీటర్లకు పైగా రక్తపు బ్యాగులను స్వాధీనం చేసుకున్నారు.

4. ఫోకస్ ఆన్ ది రోడ్

పండుగ సీజన్ ప్రారంభమవడంతో రోడ్లన్నీ ప్రయాణికులతో రద్దీగా మారాయి. ఈ నేపథ్యంలో ప్రయాణికులు సురక్షితంగా తమ గమ్య స్థానాలకు చేరుకోవాలనే లక్ష్యంతో.. రాచకొండ ట్రాఫిక్ పోలీసులు వినూత్న రీతిలో అవగాహన కార్యక్రమాలను చేపట్టారు. ప్రధాన జంక్షన్లు, బస్ స్టాండ్‌లు వద్ద వాహనదారులకు అవగాహన కల్పిస్తున్నారు.

5.  ప్లాట్ యజమానులపై దాడి

మేడ్చల్ జిల్లా కొర్రెములలోని ఏకశిలా లేఅవుట్‌లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. లేఅవుట్‌లోని ప్లాట్ యజమానులపై విచక్షణారహితంగా దాడి చేశారు రియల్టర్ అనుచరులు.ఈ లేఅవుట్‌లో సర్వే జరుగుతుందనే సమాచారంతో, ప్లాట్ ఓనర్స్ అందరూ అక్కడికి చేరుకున్నారు. దీంతో అడ్డుకున్న ప్లాట్ యజమానులపై దాడికి దిగి తీవ్రంగా గాయపరిచారు.

6. తిరుమలలో భక్తుల రద్దీ

తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. సంక్రాంతి సెలవులు కావడంతో.. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. ప్రస్తుతం ఉన్న కంపార్ట్‌మెంట్లు భక్తులతో కిక్కిరిసి పోయాయి. స్వామివారి దర్శనానికి 15 నుంచి 20 గంటల సమయం పడుతుందని ఆలయ అధికారులు చెబుతున్నారు.

7. ఎమ్మెల్యే పర్యటన

నాగర్‌కర్నూల్ మున్సిపాలిటీలో ఎమ్మెల్యే కుచ్చుకుల రాజేష్ రెడ్డి పర్యటించారు. 2వ, 13వ వార్డులో నూతనంగా నిర్మించిన రోడ్లు ప్రారంభించారు. అనంతరం డ్రైనేజీ పనులను టెంకాయ కొట్టి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా వార్డులో తిరుగుతూ ప్రజా సమస్యలు తెలుసుకొని సమస్యలు పరిష్కరించాలని మున్సిపల్ కమిషనర్‌ను ఆదేశించారు. పట్టణ అభివృద్ధిలో మౌలిక వసతులకు కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ఎమ్మెల్యే తెలిపారు.

8. సమితి ఆధ్వర్యంలో నిరసన దీక్ష

సదర్మాట్ చివరి ఆయకట్టు రైతులకు సాగునీరు అందించాలని డిమాండ్ చేస్తూ సదర్మాట్ కాలువ సాధన సమితి అధ్యక్షుడు హపావత్ రాజేందర్ ఆధ్వర్యంలో కడెంలో నిరసన దీక్ష చేపట్టారు. గత ప్రభుత్వం బ్యారేజీ నిర్మించి కాలువలను నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి పర్యటన లోపు కాలువ నిర్మాణాలు, మరమ్మతులు చేపట్టి, వారబందీ కాకుండా నిత్యం నీరు విడుదల చేయాలని, లేదంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

9. ఆందోళన

సంగారెడ్డిలోని మంజీర ఆసుపత్రిలో రవీందర్ గౌడ్ అనే వ్యక్తి మృతి చెందడం ఉద్రిక్తతకు దారితీసింది. ఈనెల 8న కిడ్నీ సర్జరీ చేయించుకున్న ఆయన, నేడు డిశ్చార్జ్ కావాల్సి ఉండగా ఒక్కసారిగా మరణించారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే రవీందర్ ప్రాణాలు కోల్పోయారని కుటుంబ సభ్యులు ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు భారీగా మోహరించి పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

10. కామారెడ్డి జిల్లాలో దొంగల బీభత్సం

కామారెడ్డి జిల్లాలో దొంగల బీభత్సం సృష్టిస్తున్నారు. రామారెడ్డిలో వృద్ధురాలిని బంధించి 4 తులాల బంగారం, 45 తులాల వెండి దోచుకెళ్లగా, జిల్లా కేంద్రంలో ఒకే రాత్రి ఐదు షాపుల షట్టర్లు పగులగొట్టి 5 లక్షల నగదు, ఫోన్లు ఎత్తుకెళ్లారు. బైక్ దొంగతనానికి పాల్పడి దొంగతనాలు చేస్తున్నట్లు సిసి టీవీ దృశ్యాల ద్వారా పోలీసులు గుర్తించి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

11. విద్యుత్ తీగలు తాకి ట్రాక్టర్ అగ్నికి ఆహుతి

ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం గండేపల్లి వద్ద పెను ప్రమాదం తప్పింది. జమ్మవరం గ్రామానికి వరిగడ్డి లోడుతో వెళ్తున్న ట్రాక్టర్‌కు విద్యుత్ తీగలు తగలడంతో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో సుమారు 20 వేల విలువైన వరిగడ్డితో పాటు ట్రాక్టర్ ట్రక్కు పూర్తిగా అగ్నికి ఆహుతైంది. విద్యుత్ తీగలు కిందకు వేలాడటమే ప్రమాదానికి కారణమని స్థానికులు చెబుతున్నారు.

12. 2000 మందికి ఉచితంగా హెల్మెట్లు పంపిణీ

రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, ఎస్పీ శరత్ చంద్ర పవార్‌తో కలిసి 2000 మందికి ఉచితంగా హెల్మెట్లు పంపిణీ చేశారు. జిల్లాలో మరణాల నివారణకు ‘నో హెల్మెట్-నో పెట్రోల్’ విధానాన్ని పోలీసులు అమలు చేస్తున్నారు. అవగాహన కోసం ఎమ్మెల్యే స్వయంగా హెల్మెట్ ధరించి బైక్ ర్యాలీ నిర్వహించి, వాహనదారులు విధిగా నిబంధనలు పాటించాలని కోరారు.

13. సేవా కార్యక్రమాలు

శ్రీదేవి ఛానల్ వ్యవస్థాపకులు ఇసుకపల్లి రామకృష్ణంరాజు జయంతి సందర్భంగా విశాఖ సీతమ్మధారలోని ‘పాపా హోం’లో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఛానల్ ఎండీ గణేష్ కుమార్ రాజు, ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ సత్యనారాయణ రాజు బాలికలకు నూతన వస్త్రాలు, పండ్లు, అల్పాహారం పంపిణీ చేశారు. రామకృష్ణంరాజు ఆశయ సాధనలో భాగంగా ఇటువంటి సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని హోం ప్రతినిధులు పేర్కొన్నారు.

14. ఎమ్మెల్యే కామెంట్స్

వైసీపీ హయాంలో ప్రారంభించిన పిడుగురాళ్ల మున్సిపల్ కార్యాలయానికి రంగులు వేసి, మళ్ళీ ప్రారంభించడం సిగ్గు చేటని అన్నారు మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి. చేతనైతే కొత్త ప్రాజెక్టులు తేవాలని ఎమ్మెల్యే యరపతినేనికి సవాల్ విసిరారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చాక, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

15. తన రాజకీయ గురువు చంద్రబాబు. హోం మంత్రి అనిత

తన రాజకీయ గురువు చంద్రబాబు అని అన్నారు హోం మంత్రి అనిత. విద్యార్థులు డ్రగ్స్, గంజాయికి దూరంగా ఉండాలని సూచించారు. కఠిన చట్టాల వల్ల భవిష్యత్తు పాడుచేసుకోవద్దని హెచ్చరించారు. గత 18 నెలల్లో నేరాలు 4 శాతం తగ్గాయని, శాటిలైట్ తయారీలో మహిళా విద్యార్థులు పాల్గొనడం గర్వకారణమని అన్నారు. నెలకోసారి విద్యార్థులకు చట్టాలపై అవగాహన కల్పిస్తామని అనిత వెల్లడించారు.

16. ఉపాధి కల్పిస్తాం

ఏ.కొండూరు ప్రాంత కిడ్నీ బాధితుల సమస్యలను శాశ్వతంగా పరిష్కరిస్తామన్నారు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ హామీ. 350 కోట్లతో కృష్ణా జలాల సరఫరాకు చర్యలు చేపట్టామని, వచ్చే నెలలో వాటర్ ట్యాంకులు ప్రారంభిస్తామని తెలిపారు. బాధితులకు సొంత ఖర్చుతో 11 రకాల పౌష్టికాహారం అందిస్తూ, లంబాడీ సంప్రదాయ దుస్తుల తయారీ ద్వారా ఉపాధి కల్పిస్తామని అన్నారు ఎంపీ శివనాథ్.

17. కుప్ప కూలింది

ఒడిశాలోని రూర్కెలాలో చార్టర్డ్‌ విమానం కుప్పకూలింది. ప్రమాద సమయంలో చార్టర్డ్ విమానంలో తొమ్మిది మంది ప్ర యాణికులు ఉన్నారు. టేకాఫ్ అయిన 10కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. చార్టర్డ్ విమానం భువనేశ్వర్‌కు వెళ్తుండగా ఘటన చోటుచేసుకుంది. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

18. అయోధ్య రామాలయంలో కాశ్మీర్ వ్యక్తి హల్‌చల్

అయోధ్య రామాలయంలో కాశ్మీర్ వ్యక్తి హల్‌చల్ చేశాడు. ఆలయంలోకి చొరబడ్డ అహ్మద్‌షేక్.. అక్కడ నమాజ్ చదవడానికి యత్నించాడు. దీంతో అహ్మద్‌షేక్‌ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

19. ఫస్ట్ లుక్ రిలీజ్

నటి ఐశ్వర్య రాజేష్, తిరువీర్ ప్రధాన పాత్రల్లో ఓ సుకుమారి మూవీ తెరకెక్కుతోంది. ఇవాళ ఐశ్వర్య బర్త్ డే సందర్భంగా మేకర్స్.. ఆమెకు విషెస్ చెబుతూ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను షేర్ చేశారు. ఇక గ్రామీణ నేపథ్యంలో రాబోతున్న ఈ మూవీకి భరత్ దర్శన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో త్వరలోనే విడుదల కానుంది.

20. గిల్ స్పందన

పొట్టి ఫార్మాట్‌లో వరుసగా విఫలమవుతున్న శుభ్‌మన్ గిల్.. వైస్ కెప్టెన్సీతోపాటు జట్టులో స్థానాన్ని సైతం కోల్పోయాడు. ఈ అంశంపై తాజాగా గిల్ స్పందించాడు. సెలక్టర్ల నిర్ణయాన్ని తాను గౌరవిస్తానని, అలాగే టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు విజయం సాధించాలని ఆకాంక్షించాడు గిల్. వచ్చే నెలలో టీ20 ప్రపంచకప్ ప్రారంభం కానుంది.

Related News

ఉదయం లేవగానే అలసట, కాళ్ల నొప్పులు ఎందుకు వస్తాయో తెలుసా ?

Intinti Ramayanam TRP Rating : ‘ఇంటింటి రామాయణం’ టీఆర్పీ రేటింగ్.. మే హైలెట్ ఎపిసోడ్స్..

Brahmamudi Serial Today Episode May 26th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  రాజుకు షాక్ ఇచ్చిన ఇందు

తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరడం ఖాయం.. ఎంపీ ఈటల రాజేందర్ ధీమా

ఎంత స‌తాయిస్తే.. అంత విజ‌య్‌కే మేలు.. ! దేశం మొత్తం త‌ల‌ప‌తి స్థితిపై సానుభూతి!!

మంత్రి హోదాలో తుమ్మల 40 వసంతాల వేడుక!

Podarillu Today Episode : నారాయణకు దిమ్మతిరిగే షాక్.. డ్యాన్స్ లతో సందడి.. కన్నీళ్లు పెట్టుకున్న ప్రతాప్..

జేమ్స్ కామెరాన్‌కు గట్టి ఎదురుదెబ్బ.. అవతార్ లాభాల్లో వాటా డిమాండ్ చేస్తున్న నటి

Big Stories

×