రాజధాని అమరావతి కేవలం ఒక నగరం మాత్రమే కాదని, అది పుణ్యఫలంతో లభించిన దేవతల రాజధాని అని సీఎం చంద్రబాబు అన్నారు. అమరావతిని ముందుకు తీసుకెళ్లే బాధ్యత విజయవాడ ప్రజలపైనే ఉందని ఆయన పిలుపునిచ్చారు. ఎంతమంది ఎన్ని రకాలుగా బాధపెట్టినా.. అమరావతి అత్యుత్తమ నగరంగా, డైనమిక్ సిటీగా ఎదిగి తీరుతుందని మాజీ సీఎం జగన్‌కు చురకలంటించారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ సంకీర్త్ పేరుతో మోసాలకు తెరలేపారు సైబర్ నేరగాళ్లు. ఎస్పీ ఫోటోను ప్రొఫైల్ పిక్చర్‌గా పెట్టుకుని వాట్సాప్ ద్వారా మెసేజ్‌లు పంపిస్తూ డబ్బులు లేదా వ్యక్తిగత వివరాల కోసం వేధిస్తున్నారు. ఈ తప్పుడు మెసేజ్‌లపై స్పందించవద్దని, ఎవరికీ నగదు పంపవద్దని ఎస్పీ ప్రజలను కోరారు. ఐపీ అడ్రస్ ఆధారంగా నిందితులను పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేస్తున్నారు.
ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో సెమిస్టర్ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం కలకలం రేపింది. ఈ కుంభకోణంలో ప్రమేయం ఉన్న 35 మంది ఇన్‌సర్వీస్ విద్యార్థుల ప్రవేశాలను రద్దు చేస్తూ వర్సిటీ ఉత్తర్వులు జారీ చేసింది. సీసీ ఫుటేజ్, వాట్సాప్ గ్రూపుల విచారణ ఆధారంగా పేపర్లు లీక్ అవుతున్నట్లు నిర్ధారించి, ఒక ఉన్నతాధికారితో సహా నలుగురు సిబ్బందిని సస్పెండ్ చేశారు.
హైదరాబాద్‌లోని తార్నాకకు చేరుకుంది నిఖిత మృతదేహం. ఇటీవల అమెరికాలో హత్యకు గురైంది హైదరాబాద్ వాసి నిఖిత. ఆమె మృతదేహం హైదరాబాద్ తార్నాకలోని నివాసానికి చేరుకుంది. డబ్బుల విషయంలో వివాదం తలెత్తడంతో మాజీ రూమ్ మెంట్ అర్జున్ శర్మ నిఖితను హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు.
అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం ఇరుసుమండలోని ONGC బావిలో సంభవించిన బ్లోఔట్ ఐదో రోజుకీ కొనసాగుతోంది. మంటలను అదుపులోకి తెచ్చేందుకు ONGC సిబ్బంది, అగ్నిమాపక దళం తీవ్రంగా శ్రమిస్తున్నప్పటికీ.. పరిస్థితి ఇంకా పూర్తి నియంత్రణలోకి రాలేదు.
ఏపీలో అవినీతికి పాల్పడిన 13 మంది అధికారులకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. విజయవాడ ఏసీబీ సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ నమోదు చేసిన fIRలను రద్దు చేస్తూ గతేడాది హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ కేసులో ప్రతివాదులందరిపై ఏసీబీ దర్యాప్తు కొనసాగించవచ్చని స్పష్టం చేసింది.
ఎన్టీఆర్ జిల్లా కంచికచర్లలో మండల తహసీల్దార్ కార్యాలయంలో అగ్నిప్రమాదం జరిగింది. పలు రికార్డులు అగ్నికి ఆహుతయ్యాయి. తహశీల్దార్ ఆఫీస్ బయట వేసిన చలి మంట నుంచి నిప్పురవ్వలు కార్యాలయం ఉన్న రికార్డు గదిలో పడటంలో మంటలు చెలరేగాయని చెబుతున్నారు. కీలకమైన ఫైళ్లు మంటల్లో కాలిపోవడంపై అనుమానాలు రేగుతున్నాయి. అగ్నిమాపక సిబ్బంది మంటల్ని అదుపు చేశారు.
తిరుపతిలోని శ్రీవారిమెట్టు నడకమార్గంలో చిరుత పులి కలకలం రేపింది. నిన్న సాయంత్రం 450వ మెట్టు వద్ద చిరుతను గుర్తించిన భక్తులు వెంటనే టీటీడీ సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో అప్రమత్తమైన అధికారులు ఇవాళ ఉదయం భక్తుల రక్షణార్థం నడకమార్గంలోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. అటవీశాఖ అధికారులు వచ్చి క్లియరెన్స్ ఇచ్చే వరకు వేచి ఉండాలని భక్తులకు సూచించారు. ప్రస్తుతం మెట్ల మార్గం వద్ద భక్తులు భారీగా వేచి ఉన్నారు.
నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని ఈదులగూడ చౌరస్తా వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న ట్యాంకర్ ను వెనుక నుండి ఒక డీసీఎం వాహనం వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతులు బీహార్ రాష్ట్రానికి చెందిన వలస కూలీలుగా పోలీసులు గుర్తించారు. ప్రమాదంలో గాయపడిన ఇతర బాధితులను చికిత్స నిమిత్తం సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.
హైదరాబాద్ బాలానగర్‌లోని విమల్ థియేటర్ దగ్గర గొడవ జరిగింది. ప్రభాస్ నటించిన ‘ది రాజాసాబ్’ సినిమాను ప్రెస్ కోసం ప్రీమియర్ షో వేశారు. విషయం తెలుసుకున్న ప్రభాస్ ఫ్యాన్స్ భారీగా థియేటర్ వద్దకు చేరుకొని తమను అనుమతించాలని కోరారు. థియేటర్ యాజమాన్యం నిరాకరించింది. దీంతో ఫ్యాన్స్ రెచ్చిపోయి థియేటర్‌లోకి దూసుకెళ్లారు. అద్దాలను పగులగొట్టారు. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు ప్రభాస్ ఫ్యాన్స్‌పై లాఠీఛార్జ్ చేశారు.
రాయలసీమపై జగన్ మోహన్ రెడ్డి మొసలి కన్నీరు కారుస్తున్నారని మంత్రి పయ్యావుల కేశవ్ ఫైర్. సీమ ప్రాజెక్టుల రద్దుతో ద్రోహం చేసిన జగన్, ఇప్పుడు అసత్యాలతో ప్రజలను భ్రమల్లో ముంచుతున్నారని విమర్శించారు. అభివృద్ధిపై దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి చర్చించాలని, పారదర్శకతతో సీమను సస్యశ్యామలం చేసే బాధ్యత కూటమి ప్రభుత్వానిదేనని ఆయన స్పష్టం చేశారు.
బాపట్ల జిల్లా వెదుళ్లపల్లి బైపాస్ రోడ్డులో ప్రమాదం చోటు చేసుకుంది. వెదుళ్లపల్లి నుండి ఆనంద్ అనే వ్యక్తి.. మరో వ్యక్తితో కలిసి చీరాల వస్తుండగా ప్రమాదం జరిగింది.ఎదురుగా వస్తున్న ఆటో, బైక్ ఢీకొనడంతో టూవీలర్‌పై ప్రయాణిస్తున్న ఆనంద్‌కు తీవ్ర గాయాలయ్యాయి, మరో వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి. మెరుగైన చికిత్స నిమిత్తం క్షతగాత్రుడు అనంద్‌ను ఒంగోలు రిమ్స్‌కు తరలించారు.
చిత్తూరు జిల్లా కోర్టుకు ఆగంతకుల నుండి బాంబు బెదిరింపు రావడం కలకలం రేపింది. ఈ నేపథ్యంలో తిరుపతి జిల్లాలో కూడా అన్ని కోర్టు భవనాలను బాబు స్పాట్ బృందం తనిఖీలు చేశారు. ఇందులో భాగంగా సత్యవేడు జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టును న్యాయమూర్తి వెంకటనాగరాజు అనుమతితో…స్థానిక ఎస్సై సాయినాథ్ చౌదరి ఆధ్వర్యంలో బాంబు స్క్వాడ్ బృందం తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో ఎలాంటి పేలుడు పదార్థాలు లభ్యం కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.
శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గంలోని రొళ్ళ మండలంలో చిరుత సంచారం పశువుల కాపరులు, రైతుల్లో భయాందోళన రేకెత్తిస్తోంది. మండలంలోని హోట్టేబెట్టా సమీపంలోని కొండ ప్రాంతంలో చిరుత సంచరిస్తోందని స్థానికులు భయాందోళన చెందుతున్నారు. పశువుల కాపరి కొండ ప్రాంతంలోకి మేతకు పశువులను తోలుకువెళ్లిన సమయంలో…చిరుత ఒక్కసారిగా పాడి ఆవుపై దాడి చేసింది.దాడిలో పాడి ఆవు అక్కడికక్కడే మృతి చెందింది.
పోలీసుల దాడిలో గాయపడి గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న యువతిని పరామర్శించారు ఉమెన్ కమిషన్ ఛైర్ పర్సన్ రాయపాటి శైలజ, జనసేన జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు.బాపట్లకు చెందిన మానస బ్యూటీషియన్‌గా పని చేస్తోంది.ఒక ఫంక్షన్‌కు మేకప్ చేయడానికి వెళ్లగా అక్కడ యజమాని బంగారు ఆభరణం పోయిందని…దానిపై యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
రష్యా నుంచి చమురు కొనే దేశాలపై మరింత కక్ష సాధించేందుకు అమెరికా సిద్ధమైంది. ఆ దేశాలపై 500 శాతం సుంకాలు విధించే బిల్లును తేవడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ బిల్లు చట్టసభల్లో ఆమోదం పొందితే భారత్, చైనా, బ్రెజిల్ వంటి దేశాలపై తీవ్ర ప్రభావం పడనుంది.
తమ దేశంలో చమురు నిల్వలకు సంబంధించి అమెరికా నిర్ణయాలపై వెనెజుయెలా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్స్ విరుచుకుపడ్డారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణా, ప్రజాస్వామ్యం, మానవ హక్కులకు సంబంధించి అగ్రరాజ్యం చేస్తున్న ఆరోపణలు సాకులు మాత్రమేనన్నారామె. తమ దేశంపై ఒత్తిడి వెనుక ఇంధన వనరులపై అత్యాశే అసలు కారణమని ఫైరయ్యారు. పార్లమెంటు సభ్యుల సమావేశంలో ఆమె ఈమేరకు మాట్లాడారు.
రోడ్డు ప్రమాదాల నివారణకు వెహికిల్ టు వెహికిల్ సాంకేతిక పరిజ్ఞానాన్ని అమలు చేయనున్నట్టు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. డ్రైవర్‌కు రియల్‌టైంలో సమీపంలోని ఇతర వాహనాలు, స్పీడు, ప్రమాదకర ప్రాంతాలు తదితర వివరాలు పంపించి, తగిన హెచ్చరికలు చేయడానికి ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తామని తెలిపారు.
టీ20 ప్రపంచ కప్ 2026కు ముందు శ్రీలంక క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మెగా టోర్నీ కోసం తమ జట్టు బ్యాటింగ్ కోచ్‌గా భారత మాజీ క్రికెటర్ విక్రమ్ రాథోర్‌ను ఎస్‌ఎల్‌సీ నియమించింది. టీ20 వరల్డ్‌కప్ టోర్నీకి శ్రీలంక జట్టును సన్నద్దం చేసేందుకు విక్రమ్ రాథోర్‌ను కన్సల్టెన్సీ ప్రాతిపదికన బ్యాటింగ్ కోచ్‌గా నియమించాము అని లంక క్రికెట్ బోర్డు ఒక ప్రకటనలో పేర్కొంది.
ది రాజాసాబ్ సినిమా టికెట్ ధరలు పెంచుకునేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. నేటి నుంచి ఈ నెల 11 వరకు సింగిల్ స్క్రీన్‌లలో 105, మల్టీప్లెక్స్‌ల్లో 132 రూపాయిలు పెంపునకు అనుమతి ఇచ్చింది. 12 నుంచి 18వ తేదీ వరకు సింగిల్ స్క్రీన్‌లలో రూ.62, మల్టీప్లెక్స్‌ల్లో రూ.89 పెంపునకు అనుమతి ఇచ్చింది. టికెట్ లాభాల్లో 20 శాతం ఫిలిం ఫెడరేషన్‌కు ఇవ్వాలని ఆదేశాలిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.