ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత సీఎస్ విజయానంద్ పదవీ కాలాన్ని మూడు నెలలు పొడిగిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. నిజానికి విజయానంద్ ఈ నెలాఖరుకు రిటైర్ కావాల్సి ఉంది. ప్రభుత్వం ఉత్తర్వులతో చీఫ్ సెక్రటరీ కుర్చీపై ఉత్కంఠకు తెరపడింది. 2026 ఫిబ్రవరి వరకు ఆయన సీఎస్‌గా కొనసాగనున్నారు.
కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్‌కు మాజీ మంత్రి వేణుగోపాలకృష్ణ బహిరంగ సవాల్ విసిరారు. వన భోజనాల్లో సుభాష్ చేసిన వ్యాఖ్యలపై చర్చకు రావాలని, రాని పక్షంలో కులానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వైసీపీ, టీడీపీ పాలనలో జరిగిన అభివృద్ధి, జీవోలు, రైతులకు జరిగిన మేలు కీడుపై చర్చిద్దాం అని వేణుగోపాలకృష్ణ సవాల్ చేశారు.
తిరుమల పరాకామణి కేసు దర్యాప్తులో సీఐడీ అధికారులు స్పీడ్ పెంచారు. ఈ క్రమంలో నిన్న పరాకామణి మాజీ డిప్యూటీ ఈవో, ఎస్టేట్ అఫీసర్‌గా పని చేసిన మల్లికార్జున, సీసీ కెమెరా యూనిట్ అపరేటర్ చంద్ర, గార్డు రామచంద్ర, వీవో సుబ్బరాజులను విచారించారు. ఒక్కొక్కరిని నాలుగు గంటల పాటు విచారించిన సీఐడీ.. వారి నుంచి కీలక సమాచారం రాబట్టినట్లు తెలుస్తోంది.
మహబూబాబాద్ జిల్లా అనంతారంలో ప్రభుత్వ భూమి కబ్జాకు గురైందని లోకయుక్తాలో ఫిర్యాదు చేశారు ఓ రైతు. 2016లో జిల్లాకు చెందిన బంజారాలతో కలిసి సేవాలాల్ గుడి నిర్మాణం చేపట్టారు అప్పటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే శంకర్ నాయక్. ఇప్పుడు ఆ గుడి నిర్మించిన స్థలం తనదేనని శంకర్ నాయక్ లోకాయుక్తాలో ఫిర్యాదు చేశారు. అయితే.. గుడి నిర్మించిన స్థలానికి శంకర్ నాయక్‌కు ఏం సంబందం లేదని.. ఆ స్థలం సేవాలాల్ గుడికి కేటాయించారని చెబుతున్నారు బంజారాలు .
పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో అర్ధరాత్రి యువకులు హల్‌చల్ చేశారు. పుట్టినరోజు వేడుకల పేరుతో ప్రజలకు ఇబ్బందులు కలిగించారు. నడిరోడ్డుపై కేక్ కట్ చేసి తల్వార్ తిప్పుతూ విన్యాసాలు చేశారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో బర్త్‌డే బాయ్ కల్యాణ్‌తో పాటు అతని స్నేహితులకు కౌన్సిలింగ్ ఇచ్చారు
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు మరోసారి బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఈ బెదిరింపు మెయిల్ రావడంతో, విమానాశ్రయం భద్రతా బాధ్యతలు చూసే సీఐఎస్‌ఎఫ్ సిబ్బంది తక్షణమే అప్రమత్తమయ్యారు. విమానాశ్రయం టెర్మినల్స్, పార్కింగ్ ప్రాంతాలు, కార్గో సెక్షన్లు.. పరిసర ప్రాంతాలన్నింటిలో విస్తృత తనిఖీలు చేపట్టారు. విమానాశ్రయం లోపలికి వచ్చే, బయటికి వెళ్లే వాహనాలను, ప్రయాణికుల కదలికలను కూడా నిశితంగా పరిశీలిస్తున్నారు.
గ్రేటర్ పరిధిలో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని ఫుట్ పాత్ ఆక్రమణలను కూల్చివేస్తున్నారు. రాజేంద్రనగర్ డీసీ సురేందర్ రెడ్డి ఆదేశాలతో కూల్చివేశారు. కూల్చివేతలను కొందరు వ్యాపారులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. పోలీసులు వారిని అక్కడి నుంచి చెదరగొట్టారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీలో పాల్గొన్నారు ఎమ్మెల్యే బొజ్జు పటేల్. ఖానాపూర్‌లోని ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో మహిళలకు ఇందిరా శక్తి చీరలను పంపిణీ చేశారు. మహిళల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. మహిళలకు లబ్ది చేకూరేలా సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆయన తెలిపారు.
అల్లూరి జిల్లా రంపచోడవరం ఏజెన్సీ ఏరియాలో హై అలర్ట్ ప్రకటించారు పోలీసులు. మావోయిస్టుల ఎన్‌కౌంటర్‌కు వ్యతిరేకంగా రేపు నిరసన దినం పాటించాలని.. మావోయిస్టులు బహిరంగ లేఖ విడుదల చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు పలు ఆంక్షలు విధించారు. ప్రజా ప్రతినిధులు, ముఖ్య నేతలు ఏజేన్సీ విడిచి వెళ్లాలని పోలీసులు కోరారు. ఈ నెల 18, 19న భద్రతా బలగాలు మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరిపిన ఎన్‌కౌంటర్ మావోయిస్టు అగ్రనేతలు మృతి చెందారు.
నిర్మల్ జిల్లా సింగన్ గావ్ గ్రామ రహదారిపై నాగుపాము, ముంగిసా కొట్లాట వీడియో సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. అటు వైపుగా వెళ్తున్న ప్రయాణికులు ముంగిసా .. నాగుపాము, కొట్లాట దృశ్యంన్నీ తమ మొబైల్ ఫోన్లలో వీడియో తీశారు. బైకుపై వెళ్తున్న ప్రయాణికులు ఒక్కసారిగా ఈ దృశ్యాన్ని చూసి భయానికి గురయ్యారు.
మైనర్ల డ్రైవింగ్‌పై నిఘా పెట్టామన్నారు హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే. మైనర్లు వాహనం నడుపుతూ పట్టుబడితే కేసులు నమోదు చేస్తామన్నారు. గడిచిన 10 నెలల్లో 6 వేలకు పైగా కేసులు నమోదయ్యాయని తెలిపారు. పిల్లలు మారం చేస్తున్నారని తల్లిదండ్రులు వాహనాలు ఇవ్వొద్దని సూచించారు. మైనర్లు వాహనం నడుపుతూ దొరికితే జైలు పాలు అవుతారంటున్న ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే తెలిపారు.
జగిత్యాల జిల్లా సారంగపూర్ వాసులకు దుబాయ్ ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం చేసిన వ్యక్తి పోలీసులు పట్టుకున్నారు. ఏపీకి చెందిన కెవిన్ ఎడ్విన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి బ్యాంకు ఖాతాలు ఫ్రీజ్ చేసి, క్రెడిట్/డెబిట్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు.
సిద్ధిపేట జిల్లా ధర్మారంలో మహిళలు బెల్ట్ షాపుల ముందు ధర్నా చేశారు. గ్రామంలో బెల్ట్ షాపుల వల్ల మగవారు తాగుబోతులుగా మారి, ఇంటికి వచ్చి తమను కొడుతున్నారని ఆరోపిస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే బెల్ట్ షాపులను తొలగించకపోతే గ్రామమంతా కదిలి, హుస్నాబాద్ ఎక్సైజ్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు.
కామారెడ్డి జిల్లాలో ఆర్టీసీ బస్సు ఆపలేదని ఓ మహిళ హల్‌చల్ చేసింది. డ్రైవర్‌ను దూషించిన మహిళ గంటపాటు వాగ్వాదానికి దిగింది. డ్రైవర్ ఫిర్యాదు చేయగా, పోలీసులు జోక్యం చేసుకుని ఇద్దరినీ మందలించారు. డ్రైవర్లపై దాడులు సహించబోమని డ్రైవర్ పేర్కొన్నారు.
నెల్లూరు జిల్లా యాతలూరులో ఓ వ్యక్తిపై పిడుగు పడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మహేష్ అనే వ్యక్తి కూలీ పంట పొలాల్లో పనిచేస్తున్న సమయంలో పిడుగుపడి మరణించాడు. సురేష్ అనే మరో వ్యక్తి గాయపడ్డాడు. మొత్తం 12 మంది కూలీలు ఆ సమయంలో పొలంలో ఉన్నారు.
ఢిల్లీలో శీతాకాలంలో వాయు కాలుష్యం తీవ్రం కావడంతో కాలుష్య కారక సూక్ష్మ ధూళికణాల స్థాయిలు పెరిగాయని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి తెలిపింది. దిల్లీ అంతటా కాలుష్య నియంత్రణ చర్యలను మరింత కఠినతరం చేస్తున్నట్లు వాయు నాణ్యత నిర్వహణ కమిషన్ ప్రకటించింది. గాలి నాణ్యత సూచీ ప్రమాదకర స్థాయుల్లో క్షీణిస్తుండడంతో గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్-3ని అమల్లోకి తెస్తున్నట్లు వెల్లడించింది.
బెంగళూరులో పట్ట పగలే జరిగిన ఏటీఎం వాహనంలో చోరీ కేసును చేధించారు పోలీసులు. కేసులో ముగ్గురు నిందితులను కర్ణాటక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చోరీకి గురైన 7.11 కోట్ల అమౌంట్‌లో మొత్తం 5.76 కోట్లను పోలీసులు రికవరీ చేశారు. మిగిలిన నగదును రికవరీ చేసేందుకు దర్యాప్తు కొనసాగుతుందన్నారు. అయితే నగదు తరలించే ప్రాంతంలో సీసీ కెమెరాలు లేవని నిర్ధారణకు వచ్చిన తర్వాత చోరీ చేశారని పోలీసులు వెల్లడించారు.
వెనెజువెలా విపక్ష నేత మరియా కొరీనా మచాడోకు 2025 నోబెల్ శాంతి బహుమతి వరించింది. డిసెంబర్ 10న నార్వే రాజధాని ఓస్లోలో నోబెల్ పురస్కారాల ప్రదానోత్సవం జరగనుంది. అయితే దేశం దాటితే పరారీ నేరస్థురాలిగా ప్రకటిస్తామని అటార్నీ జెనరల్ హెచ్చరించారు. కుట్రలు, ఉగ్రవాదం వంటి ఆరోపణలతో ఆమెపై కేసులు, దర్యాప్తు ఉన్నందున ఓస్లోలో జరగబోయే పురస్కార ప్రదానోత్సవానికి ఆమె హాజరు కాకపోవచ్చని తెలుస్తోంది.
నటుడు మంచు మనోజ్ తాజాగా పెట్టిన ఒక పోస్ట్ అందరినీ ఆకర్షించింది. తాను కొత్తగా ఒక సంగీత సంస్థను ప్రారంభించినట్లు ప్రకటించారు. మోహన రాగ మ్యూజిక్ పేరుతో దీన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ‘లోకల్ హార్ట్స్, గ్లోబల్ బీట్స్’ అనే క్యాప్షన్‌తో ఈ విషయాన్ని వెల్లడించారు మంచు మనోజ్.
దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా భారత్‌తో జరగబోయే టెస్టు సిరీస్‌ను కేవలం రెండు మ్యాచ్‌లకు పరిమితం చేయడంపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న ఐదు టెస్టుల యాషెస్ సిరీస్‌ను చూసి తనకు అసూయ కలిగిందని చెప్పాడు. భవిష్యత్తులో భారత్‌తో కనీసం నాలుగు టెస్టుల సిరీస్ ఆడాలని ఆశిస్తున్నట్లు బవుమా పేర్కొన్నాడు.