మావోయిస్టుల లొంగుబాటుపై TPCC చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను కూడా మావోయిస్టుల బాధితుడినేనన్నారు. మావోయిస్టుల మూలంగా సర్వం కోల్పోయానని అన్నారు. హింస పోలీసులు చేసినా… మావోయిస్టులు చేసినా తాము వ్యతిరేకిస్తామన్నారు మహేష్ కుమార్.
దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గోదావరి పుష్కరాలు ఏర్పాట్లు, సదుపాయాలపై సమీక్షించారు. కోట్లాది మంది భక్తులకు ఇబ్బందులు లేకుండా సమగ్ర ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఘాట్ల నిర్మాణం, నిధుల కేటాయింపు, శానిటేషన్, మహిళలకు సౌకర్యాలు, వైద్యసేవలు, రద్దీ నియంత్రణ వంటి అంశాలపై దృష్టి సారించాలని సూచించారు.
కామారెడ్డిలో రైలు పట్టాలపై బైఠాయించి ఆందోళన చేశారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత. దీంతో కవితను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అనంతరం రైల్ రోకో చేసి ఢిల్లీ వరకు మెసేజ్ పంపిస్తున్నామని తెలిపారు కవిత. కచ్చితంగా బీజేపీ దిగిరావాలని.. బీజేపీ ఎంపీలు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు కవిత.
కొత్తగూడెంలోని రుద్రంపూర్ ప్రొఫెసర్ జయశంకర్ గ్రౌండ్స్‌లో కోల్ ఇండియా జాతీయ స్థాయి కబడ్డీ పోటీలు ప్రారంభమయ్యాయి. దేశంలోని 8 బొగ్గు కంపెనీల నుండి 8 జట్లు పాల్గొంటున్న ఈ పోటీలు 3 రోజుల పాటు లీగ్ కం నాక్ ఔట్ పద్ధతిలో జరగనున్నాయి. క్రీడాకారులు క్రీడా స్ఫూర్తిని చాటుకోవాలని సింగరేణి కాలరీస్ డైరెక్టర్ ఆపరేషన్స్ ఎల్.వి. సూర్యనారాయణ కోరారు. ఈ పోటీలు నవంబర్ 30వ తేదీ సాయంత్రం ఫైనల్స్‌తో ముగుస్తాయి.
హైదరాబాద్ కూకట్‌పల్లిలోని జేఎన్‌టీయూ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. యూనివర్సిటీలో ట్రిపుల్ ఈ చదువుతున్న దివ్య అనే బీటెక్ విద్యార్థిని వనస్థలిపురంలోని తన ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకోవడంతో విద్యార్థి సంఘాలు బంద్‌కు పిలుపునిచ్చి ధర్నాకు దిగాయి. అధికారుల నిర్లక్ష్యం వల్లే దివ్య మృతి చెందిందని ఆరోపించారు.
HMDA ఆధ్వర్యంలో కోకాపేట్, నియోపోలీస్ భూముల వేలం కొనసాగుతోంది. ఈ రోజు 15, 16 ప్లాట్లకు వేలం నిర్వహిస్తున్నారు. మూడో బిట్ అయిన 18కు రూ.137.25 కోట్లు ధర రాగా, ప్లాట్ నెం.15కు 150 కోట్ల రూపాయలు అంచనా వేస్తున్నారు. మొన్నటి వేలంలో HMDAకు 1356 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది.
పెద్దపల్లి జిల్లా గుంపుల మానేరు వాగు వద్ద కూలిన చెక్‌డ్యామ్‌పై రాజకీయ వివాదం కొనసాగుతోంది. ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు గత పాలకుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు. కాగా, హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి ఇది బాంబు బ్లాస్టింగ్ వల్ల కూలిపోయిందని తెలిపారు. ఈ నేపథ్యంలో ఓదెల మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రేమ్‌సాగర్ రెడ్డి చెక్‌డ్యామ్‌ను సందర్శించి, కౌశిక్‌రెడ్డి వ్యాఖ్యలను ఖండించారు. నాణ్యతా లోపం వల్లే చెక్‌డ్యామ్ కూలిందని తెలిపారు.
కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ పట్టణంలో దొంగతనాలు ఆగడం లేదు. మంగళవారం, వార్డ్ నెం. 14, కౌసర్ నగర్‌లో ఇంటి ముందు కూర్చున్న వృద్ధురాలి మెడలోని రెండు తులాల బంగారు గొలుసును బైకుపై వచ్చిన ఇద్దరు దుండగులు లాక్కొని పరారయ్యారు. పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా దుండగుల కోసం గాలిస్తున్నారు.
సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని పెద్దూరు శివారు డబుల్ బెడ్ రూమ్ కాలనీవాసులు, నీటి సమస్యను పరిష్కరించాలని కోరుతూ రహదారిపై ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. ఈ ఆందోళనకు బీజేపీ సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు దుమాల శ్రీకాంత్ మద్దతు పలికారు. నీటి ఎద్దడిని వెంటనే పరిష్కరించాలని, లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఆయన హెచ్చరించారు.
పంచాయతీ ఎన్నికల కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన జీఓ 46ను సవాల్ చేస్తూ తెలంగాణ హైకోర్టులో అత్యంత వెనుకబడిన కుల సంఘాలు పిటీషన్లు దాఖలు చేశాయి. అత్యవసర పిటీషన్ కింద విచారణ నిర్వహించాలని న్యాయవాది సుదర్శన్ అన్నారు. బీసీలలో ఏబీసీడీ వర్గాల ఆధారంగా రిజర్వేషన్లు కేటాయించాలన్న న్యాయవాది. ఈ పిటీషన్లపై రేపు విచారిస్తామన్న సీజే ధర్మాసనం.
ప్రకాశం జిల్లా దోర్నాల మండలం బోడేనాయక్ తాండా దగ్గర గంజాయి రవాణా చేస్తున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల దగ్గర నుంచి 1500 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులను కోర్టులో హాజరు పరుస్తామని SI మహేష్ అన్నారు.
ఎన్టీఆర్ జిల్లా నున్న గ్రామంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ లక్ష్మీ షా, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పాల్గొన్నారు. ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి తమ సమస్యలను అర్జీ రూపంలో అధికారులకు అందించారు. ప్రజల సమస్యలను తక్షణ పరిష్కరించాలని ఆదేశించారు ఎమ్మెల్యే.
బాపట్ల జిల్లా చావలి గ్రామంలోని ఒక వేపచెట్టు నుంచి పాలు వంటి తెల్లని ద్రవం కారుతుండటం స్థానికులను ఆశ్చర్యపరిచింది. ఈ వింతను తిలకించేందుకు గ్రామస్తులు అక్కడికి చేరుకొని బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజమైందని భావించి ఆ చెట్టుకు పూజలు చేస్తున్నారు. కాగా, ఆర్టికల్చరర్ అధికారులు దీనికి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కారణమని గతంలో వెల్లడించారు.
ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులతో కలిసి తెలంగాణ ఈగల్ టీం సంయుక్త ఆపరేషన్ నిర్వహించింది. 18 ప్రాంతాల్లో సోదాలు చేసి, 12 కోట్ల విలువైన డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో మొత్తం 10 మందిని వారిలో ఏడుగురిని తెలంగాణ పోలీసులు, ముగ్గురిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. గ్రేటర్ నోయిడాలో డ్రగ్స్ ఆర్థిక వ్యవహారాలు చూసే బద్రుదీన్ అనే కీలక వ్యక్తిని అరెస్టు చేశారు.
నాగర్‌కర్నూల్ జిల్లాలోని తెలకపల్లి, తాడూరు మండలాలలో మొదటి విడత సర్పంచ్ నామినేషన్ల ప్రక్రియ రెండో రోజు కూడా ఉత్సాహంగా కొనసాగుతోంది. మొదటి రోజు తెలకపల్లిలో 25, తాడూరులో 23 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇవాళ సర్పంచ్, వార్డు మెంబర్ పదవులకు అర్హులైన అభ్యర్థులు నామినేషన్లు వేస్తున్నారు.
శబరిమల అయ్యప్ప స్వామి భక్తుల యాత్ర సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని పౌర విమానయాన శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కీలక ప్రకటన చేశారు. శబరిమల దర్శనానికి వెళ్లే అయ్యప్ప భక్తులు విమాన ప్రయాణం సమయంలో తమ పవిత్ర ఇరుముడిని కొబ్బరికాయతో సహా.. చేతి సామానుగా తమతో పాటు తీసుకెళ్లుకునే విధంగా ప్రత్యేక వెసులుబాటు కల్పించారు
అమరావతి రీస్టార్ట్‌పై సంతోషం వ్యక్తం చేశారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. దేశంలో కొత్త రాజధాని నిర్మాణం సామాన్య విషయం కాదన్నారు. ఈ నిర్మాణ పనుల ప్రారంభానికి ప్రధాని మోదీ సహకరిస్తున్నారని, ఇది ఒక యజ్ఞం లాంటిదని తెలిపారు మంత్రి.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనకు షెడ్యూల్ ఖరారైంది. డిసెంబరు 4-5 తేదీల్లో ఆయన భారత్‌లో పర్యటించనున్నారు. ఈ మేరకు రష్యా అధ్యక్ష కార్యాలయం క్రెమ్లిన్ శుక్రవారం ప్రకటన విడుదల చేసింది. రష్యా చమురు కొనుగోలు చేస్తోందన్న కారణంతో భారత్‌పై అమెరికా అదనపు సుంకాలు అమలు చేస్తోన్న వేళ పుతిన్ రాక ప్రాధాన్యం సంతరించుకుంది.
కమల్‌హాసన్ నిర్మాణంలో, రజనీకాంత్ హీరోగా Thalaivar 173 రూపొందనున్న చిత్రం నుంచి దర్శకుడు సుందర్ సి వైదొలిగారు. సుదీర్ఘ విరామం తర్వాత ఈ దిగ్గజాలు కలిసి పనిచేయడం విశేషం. తాజాగా, ఈ చిత్రానికి జాతీయ ఉత్తమ దర్శకుడు అవార్డు పొందిన రామ్‌కుమార్ బాలకృష్ణన్ దర్శకత్వం వహించనున్నారని, సాయిపల్లవి కీలక పాత్ర పోషించనున్నారని ప్రచారం జరుగుతోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
యూఏఈ వేదికగా డిసెంబరు 12 నుంచి 21 వరకు జరగనున్న అండర్-19 ఆసియాకప్ టోర్నమెంట్‌కు బీసీసీఐ 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును ప్రకటించింది. ఈ జట్టుకు ఆయుశ్ మాత్రే కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. యువ సెన్సేషన్ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీకి ఈ జట్టులో చోటు దక్కింది. టీమిండియా ఆసియాకప్‌లో టైటిల్ సాధించేందుకు సిద్ధమవుతోంది.