జూబ్లీహిల్స్ పరిధి కృష్ణా నగర్‌లోని అమరావతి స్కూల్ పోలింగ్ బూత్ నెం. 238 వద్ద దొంగ ఓట్లు వేస్తున్నారని బీఆర్‌ఎస్ నాయకులు ఆందోళన చేశారు. బీఆర్‌ఎస్ అభ్యర్థి మాగంటి సునీత రోడ్డుపై బైఠాయించారు. షేక్‌పేట్ డివిజన్‌లో ఉద్రిక్తత పెరగడంతో, లోపలికి వెళ్లటానికి ప్రయత్నించిన కార్యకర్తలపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారు.
మోంథా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ఇంటర్ మినిస్టీరియల్ కేంద్ర బృందం, ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నాయుడుతో సమావేశమైంది. రాష్ట్రంలో 6,384 కోట్ల నష్టం జరిగిందని అంచనా వేసిన ఏపీ ప్రభుత్వం, తక్షణ సాయంగా 901 కోట్లు విడుదల చేయాలని కేంద్రాన్ని కోరింది.
విజయవాడ భవానీపురం ఆర్టీసీ వర్క్‌షాప్ రోడ్డులో మారుతీ కారు ఢీకొట్టడంతో ద్విచక్ర వాహనదారుడు కల్వలో పడిపోయి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు అతడిని రక్షించి ఆసుపత్రికి తరలించారు. కారు నడుపుతున్న వ్యక్తి ప్రమాదం తరువాత పరారయ్యాడు.
అనంతపురం జిల్లా ఓబులాపురంలోని ఆరు మైనింగ్ లీజుల బౌండరీలను గుర్తించే సర్వే ప్రాథమిక దశలో కొనసాగుతోంది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు సర్వే ఆఫ్ ఇండియా, రెవెన్యూ, అటవీ శాఖల అధికారులు డ్రోన్లు, రాడార్లతో బౌండరీలను పరిశీలించారు. అక్రమ చొరబాట్ల కోణంలో దర్యాప్తు జరుగుతోంది.
వికారాబాద్‌లో మైనార్టీ బాలికల గురుకుల కళాశాలకు 5 ఎకరాల స్థలం కేటాయించి, నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తానని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన, కలెక్టర్ ప్రతీక్ జైన్‌తో కలిసి నీట్, ఐఐటీ ఆన్‌లైన్ శిక్షణా ల్యాబ్‌లను ప్రారంభించారు.
సిద్దిపేట జిల్లా గొడుగు పల్లి అటవీ ప్రాంతంలో పదేళ్ల చిరుత మృతి చెందింది. ఆ చిరుత ఊపిరితిత్తుల సమస్య, నిమోనియాతో బాధపడుతూ చనిపోయినట్లు పోస్ట్‌మార్టంలో ప్రాథమికంగా తేలింది. కళేబరాన్ని అటవీ నియమాల ప్రకారం దహనం చేయనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
టీటీడీపై జగన్ కక్షపూరితంగా వ్యవహరించారని ఆరోపించారు శాసనమండలి చీఫ్ విప్ పంచుమర్తి అనురాధ. రసాయనాలతో 63 లక్షల కిలోల లడ్డూలు తయారు చేయించారని ఆరోపించారు. 250 కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారని అనురాధ విమర్శించారు.
సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం ఓయో రూంలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. క్రికెట్ బెట్టింగ్‌లో మోసపోయి అప్పుల పాలవ్వడంతో సూసైడ్ చేసుకున్నాడు. సాయినగర్‌లో ఉన్న తండ్రి సంగీత్‌రావుకు సమాచారమిచ్చిన తర్వాత ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు.
గద్వాలలోని శేరెల్లి వీధిలో ఈనెల 3న జరిగిన మహిళ బలిజ లక్ష్మి హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. డబ్బులు ఇవ్వలేదనే కోపంతో గార్లపాడుకు చెందిన రాంరెడ్డి ఈ హత్యకు పాల్పడినట్లు ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. ఆమె మెడలోని 4 తులాల నగలు మిస్సయ్యాయి.
రాష్ట్రంలోని ఆయిల్ పామ్ కంపెనీల పనితీరుపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. సాగు విస్తరణ, రైతులకు సౌకర్యాలు, ప్రాసెసింగ్ యూనిట్ల పనితీరు, కంపెనీల బాధ్యతలపై ఆయన అధికారులతో చర్చించారు. ఈ సమావేశానికి ఉద్యానవన శాఖ కమిషనర్ యాస్మిన్ పాషా హాజరయ్యారు.
తిరుమల పరకామణి చోరీ కేసులో అక్రమాలపై సీఐడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. తిరుపతి పద్మావతి అతిథి గృహంలో అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. సీసీ కెమెరా ఆపరేటర్ సహా ఈ సంఘటన జరిగిన రోజు విధుల్లో ఉన్న ముగ్గురు అధికారులను, ఒక కానిస్టేబుల్‌ను సీఐడీ విచారించింది.
వైసీపీ మాజీ ఎమ్మెల్యే రాచమల్లు వ్యాఖ్యలపై ఫైరయ్యారు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి. దేశంలో మొదటి స్థానంలో ఉండాల్సిన ఏపీని జగన్ భ్రష్టు పట్టించారంటూ మండిపడ్డారు. వాళ్లేంది నాకు భిక్ష పెట్టేది.. 1996లో ఓడిపోయే పరిస్థితి ఉందనే.. వైఎస్ ఫ్యామిలీ తన మద్దతు కోసం ఆరాటపడ్డారన్నారు. ఆర్ కాంగ్రెస్ పోయింది.. ఐ కాంగ్రెస్ పోయింది.. త్వరలో వై కాంగ్రెస్ కూడా పోవడం ఖాయమన్నారు ఆదినారాయణరెడ్డి.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ సరళిపై స్పందించారు మాజీ మంత్రి కేటీఆర్. గత నెలరోజులుగా బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గెలుపు కోసం శక్తి వంచన లేకుండా పనిచేసిన పార్టీ నేతలు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు కేటీఆర్. అధికార పార్టీ ఎన్ని దౌర్జన్యాలకు పాల్పడినా, భయబ్రాంతులకు గురిచేసినా.. బయటకు వచ్చి ఓటేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ ట్వీట్ చేశారు కేటీఆర్.
నాగర్ కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లిలో పాఠ్యపుస్తకాలు తరలించేందుకు ఉపాధ్యాయులు విద్యార్థులను హమాలీలుగా వాడారు. 9వ తరగతి చదివే నలుగురు విద్యార్థులు ఆటోలో పుస్తకాలు తరలిస్తుండగా, ప్రమాదవశాత్తు బోల్తా పడి గాయపడ్డారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
ఢిల్లీ ఎర్రకోట దగ్గర జరిగిన పేలుడు కేసులో మరొకరిని అరెస్ట్ చేశారు జమ్మూకశ్మీర్ పోలీసులు. నిన్న సాయంత్రం సూసైడ్ దాడికి పాల్పడిన డాక్టర్ ఉమర్ స్నేహితుడైన మరో డాక్టర్ సాజద్ అహ్మద్‌ను పుల్వామాలో అరెస్ట్ చేసినట్లు నిఘా వర్గాలు పేర్కొన్నాయి. సాజద్ కూడా ఫరీదాబాద్ అల్ ఫలాహ్ ఆస్పత్రిలో పనిచేసినట్లు తెలుస్తుంది. ఇప్పటి వరకు మొత్తం ఏడుగురిని అరెస్టు చేశారు.
ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో చోటుచేసుకున్న భారీ పేలుడు ఘటనపై దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ క్రమంలోనే కేంద్ర హోంశాఖ ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థకు అప్పగించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. దీనిపై తొలుత దిల్లీ పోలీసులు ఉపా చట్టం, ఎక్స్‌ప్లోజివ్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు.
గౌతమ్ అదానీ గ్రూప్ దేశంలోనే అతిపెద్ద బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ సిస్టమ్స్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది. 3530 మెగావాట్ అవర్ సామర్థ్యంతో.. ఇది 2026 మార్చి నాటికి అందుబాటులోకి రానుంది. కంపెనీ పునరుత్పాదక ఇంధన లక్ష్యాలను చేరుకోవడంలో భాగంగా ఈ ముందడుగు వేసింది.
తనదైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను నవ్వించే అల్లరి నరేశ్.. ఈసారి థ్రిల్ చేసేందుకు సిద్ధమయ్యారు. ఆయన హీరోగా నాని కాసరగడ్డ తెరకెక్కించిన చిత్రం 12ఏ రైల్వే కాలనీ ట్రైలర్ విడుదలైంది. కామాక్షి భాస్కర్ల హీరోయిన్. ఈ నెల 21న సినిమా బాక్సాఫీస్ ముందుకు రానుంది.
ఆస్ట్రేలియా సిరీస్‌లో గాయపడిన శ్రేయాస్ అయ్యర్ స్ప్లీన్ భాగంలో తీవ్ర రక్తస్రావం జరిగింది. ఆ సమయంలో అతని ఆక్సిజన్ స్థాయి 50కి పడిపోవడం, బ్లాకౌట్ అవడం వల్ల దక్షిణాఫ్రికా సిరీస్‌కు దూరమయ్యే అవకాశం ఉంది.
విదేశీ విద్యార్థులు అమెరికాలో చదువుకునేందుకు ఎలాంటి అడ్డంకులు లేవని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. వారు రావడం అమెరికాలోని వ్యాపారాలకు మంచిదేనని వ్యాఖ్యానించారు. దేశ ఉన్నత విద్యావ్యవస్థకు మద్దతు లభిస్తుందని అభిప్రాయపడ్డారు.