రాష్ట్రంలోని ఆయిల్ పామ్ కంపెనీల పనితీరుపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. సాగు విస్తరణ, రైతులకు సౌకర్యాలు, ప్రాసెసింగ్ యూనిట్ల పనితీరు, కంపెనీల బాధ్యతలపై ఆయన అధికారులతో చర్చించారు.
నల్గొండ జిల్లా నెల్లికల్లు ప్రాజెక్టును సందర్శించారు జాగృతి అధ్యక్షురాలు కవిత. నాగార్జునసాగర్ డ్యాం తల మీద ఉన్న కొన్ని మండలాలకు ఇప్పటికీ నీరు అందడంలేదని ప్రభుత్వాన్ని ఆమె విమర్శించారు. కేసీఆర్ గత ఉపఎన్నికల ముందు ప్రారంభం చేసినా ఈ ప్రాజెక్ట్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరక పూర్తి చేయకపోవడం దారుణమని అన్నారు. నెల్లికల్లు ప్రాజెక్ట్ పనులు పూర్తి చేసి రైతులకు నీళ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు కవిత.
సిద్దిపేట జిల్లా గొడుగు పల్లి అటవీ ప్రాంతంలో పదేళ్ల చిరుత మృతి చెందింది. ఆ చిరుత ఊపిరితిత్తుల సమస్య, నిమోనియాతో బాధపడుతూ చనిపోయినట్లు పోస్ట్‌మార్టంలో ప్రాథమికంగా తేలింది. కళేబరాన్ని అటవీ నియమాల ప్రకారం దహనం చేయనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
నాగర్‌కర్నూల్ జిల్లా వట్టిమేకులకుంటలో ముక్కిడిగుండం గిరిజన రైతులు.. అటవీ భూమిని చదును చేస్తుండగా.. ఫారెస్ట్ అధికారులు అడ్డుకోవడానికి ప్రయత్నించారు. దీంతో ఆగ్రహించిన గిరిజన రైతులు కర్రలతో అధికారులపై దాడి చేశారు. ఈ ఘటనలో రైతుల దాడి తీవ్రంగా ఉండడంతో అటవీ అధికారులు వెనుదిరిగారు.
సిద్దిపేట జిల్లాలో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. 50 వేలు లంచం తీసుకుంటూ ములుగు ఎస్సై విజయ్ కుమార్ ఏసీబీకి పట్టుబడ్డాడు. ఓ బాధితురాలి డబుల్ బెడ్రూం విషయంలో ఒప్పందం చేసుకుని ఎస్సై డ్రైవర్ నగదు 50 వేలు లంచం తీసుకుంటుండగా.. ఏసీబీకి చిక్కినట్లు డీఎస్పీ సుదర్శన్ తెలిపారు.
వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణంలోని కూరగాయల మార్కెట్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. షార్ట్ సర్కట్‌తో రెడీమెంట్ బట్టల దుకాణంలో మంటలు అంటుకున్నాయి. ఈ మంటల్లో బట్టలు కాలి బుడిదైంది. 3 నుంచి 4 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగిందని అధికారులు అంచాన వేస్తున్నారు.
సూర్యాపేట జిల్లా హుజుర్‌నగర్ పోలీసులు చోరీ కేసును ఛేదించారు. ఈనెల 5న వేపల సింగారంలో గోపిరెడ్డి ఇంట్లో దొంగతనం జరిగిందన్నారు సీఐ చరమందా రాజు. ఖమ్మం జిల్లా భీమవరంకు చెందిన మల్లికార్జునరెడ్డి తాళం వేసిన ఇంట్లో 90వేల నగదు, 5 తులాల బంగారం అపహరించాడని.. సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని పట్టుకున్నారు సీఐ.
గత ప్రభుత్వంలో టీటీడీ బోర్డు వైఫల్యాలు భక్తుల హృదయాలను దెబ్బతీశాయని అన్నారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. తిరుమల పవిత్రతను కలుషితం చేసిన వ్యవహారాలు ప్రస్తుత బోర్డుకు ఒక పాఠం అని, భక్తుల విశ్వాసాన్ని తిరిగి పొందాలని ఆయన సూచించారు. టీటీడీ కార్యకలాపాలన్నీ పూర్తి పారదర్శకంగా నిర్వహించాలని.. ఖర్చులు, ఆదాయ వివరాలు ప్రజలకు అందుబాటులో ఉంచాలని పవన్ అధికారులను ఆదేశించారు.
ఏలూరు జిల్లా చింతలపూడి ఏఎంసీ ఛైర్మన్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి నాదెండ్ల మనోహర్. కూటమి ప్రభుత్వంలో రైతాంగానికి ప్రాధాన్యత ఇస్తున్నామని ఆయన చెప్పారు. రైతుల కష్టానికి తగిన ఫలితం ప్రభుత్వం ఇస్తుందని.. ధాన్యం కొనుగోలులో పొరపాట్లు లేకుండా నిజాయితీగా చెల్లింపులు చేస్తున్నామని మంత్రి తెలిపారు.
చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం పోలీస్ స్టేషన్ వద్ద వివాహిత ధర్నా చేసింది. ఎద్దులవారిపల్లికి చెందిన రోజా అనే మహిళ.. నలగాంపల్లికి చెందిన ప్రభాకర్‌తో నాలుగేళ్లుగా అక్రమ సంబంధం కొనసాగించింది. ప్రభాకర్ దూరంగా ఉండడంతో.. రోజా పోలీస్ స్టేషన్‌కు వచ్చి తన ప్రియుడితో కలిపి ఉంచాలని ఫిర్యాదు చేసింది. సీఐ కత్తి శ్రీనివాసులు అక్రమ సంబంధాల విషయంలో సహకరించలేమని చెప్పడంతో ఆమె పోలీస్ స్టేషన్ ఎదుట నడిరోడ్డుపై బైఠాయించి ధర్నా చేసింది.
పల్నాడు జిల్లా జూలకల్లు కారంపూడి మధ్యలో బైక్, ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు పిడుగురాళ్లకు చెందిన బాణావత్ శివగా పోలీసులు గుర్తించారు. మృతిని బంధువులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. దీంతో భారీగా ట్రాఫిక్ జ్యామ్ కావడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.
అన్నమయ్య జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. పెద్ద కొడుకు జయప్రకాష్ రెడ్డిని హత్య చేయడానికి సుపారి గ్యాంగ్‌తో ఆరు లక్షలకు ఒప్పందం చేసుకుంది తల్లి శ్యామలమ్మ. ఎంబీఏ చదువు మానేసి, జులాయిగా తిరుగుతున్న జయప్రకాశ్ రెడ్డి ఆస్తి పంచాలని, మద్యం కోసం డబ్బులు ఇవ్వాలంటూ తల్లిని తరచుగా వేధించడంతో భరించలేక సుపారీ గ్యాంగ్‌తో కొడుకును హత్య చేయించింది.
పల్నాడు జిల్లా గణపవరం జాతీయ రహదారి పక్కన ఉన్న విష్ణు స్పన్ పైప్స్ కంపెనీలో చోరీ జరిగింది. దుండగులు గది షట్టర్‌ను పగలగొట్టి అందులో ఉన్న ఐదు క్వింటాళ్ల ఇనుమును దొంగిలించారు. ఇద్దరు దుండగులు ఇనుము చోరీ చేస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. కంపెనీ నిర్వాహకులు పవన్ కుమార్ ఫిర్యాదు మేరకు ఎస్సై పుల్లారావు సిబ్బందితో కలిసి ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
తిరుపతిలో పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న కీచకుడు ఓ చిన్నారితో గత రెండు సంవత్సరాలుగా తన వాంచలు తీర్చుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు అతనిపై కేసు నమోదు చేసి ఫోక్సో కేసు నమోదు చేశారు. టీచర్ వృత్తిలో ఉంటూ తన కూతురు లాగా భావించాల్సిన చిన్నారిని లోబర్చుకొని అఘాయిత్యానికి పాల్పడిన వారిని ఉరితీయాలంటూ స్థానికులు డిమాండ్ చేశారు.
రౌడీ షీటర్ వికాస్.. తన అనుచరుడు సాయితో కలిసి గుంటూరు జిల్లా తాడేపల్లి బైపాస్ రోడ్డులోని వైన్‌షాప్ వద్ద ప్రకాష్ అనే యువకుడిపై దాడికి తెగబడ్డాడు. వికాస్ బీర్ బాటిల్‌తో దాడి చేస్తుండగా.. విధుల్లో ఉన్న ట్రాఫిక్ పోలీసులు వారిని అడ్డుకున్నారు. గత కొంతకాలంగా వికాస్ గ్యాంగ్‌లుగా ఏర్పడి అమాయకులపై దాడులకు పాల్పడుతున్నాడని, అతని ఆగడాలకు అడ్డుకట్ట వేసి కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
మహారాష్ట్రలోని కొల్హాపూర్ మహావితరణ్ ఎంఎస్‌ఈబీ ప్రధాన కార్యాలయం సమీపంలో చిరుతపులి హల్‌చల్ చేసింది. స్థానికుల సమాచారంతో అధికారులు చిరుతను బంధించడానికి బోనులను ఏర్పాటు చేశారు. అయితే, ఆపరేషన్ జరుగుతున్న సమయంలో చిరుతపులి ఆకస్మాత్తుగా పోలీసులపై దాడికి యత్నించడంతో వారు పరుగులు తీశారు. చాలాసేపు శ్రమించి చివరకు చిరుతను బంధించారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణ్‌పూర్‌లో అబుజ్‌మాడ్, టోకే ప్రాంతంలో పోలీసులు, బీఎస్ఎఫ్ 135వ బెటాలియన్ సంయుక్తంగా కొత్త భద్రతా, ప్రజాసేవా శిబిరాన్ని ప్రారంభించారు. మావోయిస్టులను అరికట్టే మాడ్ రక్షణ చర్యల్లో భాగంగా దీనిని ఏర్పాటు చేశారు. ఈ శిబిరాన్ని గ్రామస్తులు స్వాగతిస్తూ, నక్సలిజాన్ని తుడిచిపెట్టి, మావోయిస్టులకు సహకరించబోమని సంకల్పం తీసుకున్నారు.
బిహార్‌లో మరోసారి ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడుతుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. సీఎం నితీశ్ కుమార్ నేతృత్వంలోని కూటమి మరోసారి అధికారం చేపట్టనుంది. ప్రజాపోల్ అనలిటిక్స్ అంచనా ప్రకారం.. ఎన్డీయే 186 సీట్లు గెలుచుకోగా, మహాఘట్‌బంధన్ 50 సీట్లకే పరిమితమవుతుంది. జనసూరజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిశోర్.. పార్టీ ఖాతా తెరిచే అవకాశం లేదని సర్వే పేర్కొంది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ రిటెన్షన్ గడువు సమీపిస్తున్న నేపథ్యంలో ఐపీఎల్ 19వ సీజన్ ఆక్షన్ నిర్వహణపై ఉత్కంఠ కొనసాగుతోంది. డిసెంబర్ 1న లేదా డిసెంబర్ 16న దుబాయిలో వేలం ఉండే అవకాశం ఉంది. రిటెన్షన్ జాబితా తర్వాత పది ఫ్రాంచైజీలు వేలంలో కొనాల్సిన ఆటగాళ్లపై కసరత్తు చేయనున్నాయి.
అవకాశాల కోసం ఆరాటపడే తత్వం తనది కాదన్నారు సినీ నటి అను ఇమ్మాన్యుయేల్. కెరీర్ ఆరంభంలో చేసినట్లుగా.. ఇకపై రొటీన్ కమర్షియల్ చిత్రాలు చేయకూడదని నిర్ణయించుకున్నట్లు ఆమె తెలిపింది. రాహుల్ రవీంద్రన్ తెరకెక్కించిన లవ్ స్టోరీ ‘ది గర్ల్‌ఫ్రెండ్’ సినిమాలో దీక్షిత్ శెట్టి హీరోగా, రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించారు. ఈ మూవీలో అను క్యామియో రోల్ కనిపించి ఆడియన్స్‌ను ఆకట్టుకుంది.