నెల్లూరులో కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. కౌలు రైతులకు కూడా అన్నదాత సుఖీభవ పథకం వర్తింపజేయాలని.. కౌలు రైతులను చంద్రబాబు మోసం చేస్తుంటే.. పవన్ ఎందుకు నోరు మెదపడం లేదని ఆయన ప్రశ్నించారు. ప్రతి రైతును ఆదుకోని.. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి అన్నదాత సుఖీభవ ఇవ్వాలని డిమాండ్ చేశారు కాకాణి.
శ్రీకాళహస్తీశ్వర దేవస్థానంలో విదేశీ భక్తులు సందడి చేశారు. జర్మనీ, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాకు చెందిన 40 మంది రాహు కేతు పూజలు చేశారు. కార్తీకమాసం సందర్భంగా ఆలయంలో దీపాలు వెలిగించి శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకున్నారు.
సిద్దిపేట జిల్లా ఆకునూరు గ్రామంలో గ్యాస్ సిలిండర్ పేలింది. గ్రామానికి చెందిన శెట్టె భాస్కర్ గ్యాస్ ముట్టించగా.. లీకై పెద్ద శబ్దంతో గ్యాస్ పేలింది. ఈ ఘటనలో భాస్కర్‌తో సహా తండ్రి అయ్యల్లం, భార్య కావ్య, ముగ్గురు పిల్లలకు తీవ్ర గాయాలయ్యాయి. మంటలు చెలరేగి ఇల్లు దగ్ధమైంది. క్షతగాత్రులను చేర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
తిరుమల రెండవ ఘాట్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. హరిణి ప్రాంతంలో బైక్ పై ప్రయాణిస్తున్న లోకేష్ ఒక్కసారిగా కిందపడ్డాడు. తలకు, శరీర భాగాలకు తీవ్ర గాయాలు కావడంలో తిరుపతి స్విమ్స్ ఆసుపత్రికి తరలింంచారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
నిర్మల్ జిల్లా కల్లూర్ వద్ద సోయా కొనుగోలుపై మార్క్‌ఫెడ్ సిబ్బంది విధించిన నిబంధనలకు వ్యతిరేకంగా రైతులు రాస్తారోకో నిర్వహించారు. అకాల వర్షాల కారణంగా పంటలో తేమ, డ్యామేజ్ పేరుతో అధికారులు ఇబ్బంది పెడుతున్నారన్నారు. ఆంక్షలు లేకుండా పంట కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు రైతులు.
జగిత్యాల జిల్లా చందుర్తి గ్రామంలో ఒక ఇంట్లో వెల్డింగ్ పనులు చేస్తుండగా.. కరెంట్ షాక్ తగిలి ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. రాజలింగం ఇంటి గేటుకు వెల్డింగ్ చేస్తున్న సమయంలో వెల్డర్ లక్ష్మణ్‌కు, రాజలింగానికి షాక్ తగలడంతో గాయపడ్డారు. వీరిద్దరినీ జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలంలో పిచ్చి కుక్కల స్వైరవిహారం చేశాయి. పన్నెండు మందిని పిచ్చి కుక్కల గుంపు కరిచాయి. పొలం పనులకు వెళ్తున్న వ్యవసాయ కూలీలపై కుక్కలు దాడికి పాల్పడ్డాయి. కుక్కలు కరవడంతో కుక్కల బెడద నుంచి కాపాడాలని డిమాండ్ చేశారు స్థానికులు.
మంచిర్యాల జిల్లా చిన్నమున్షి ప్రైవేట్ పాఠశాలలో పోలీసులు డ్రగ్స్‌పై అవగాహన నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో డ్రగ్స్ రహిత జీవనశైలిని అనుసరిస్తామని ప్రతిజ్ఞ చేయించారు. విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండి, చదువుపై దృష్టి సారించి ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని సూచించారు ఎస్సై సుబ్బారావు.
వైకుంఠ ద్వార దర్శనాల వివరాలను టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ప్రకటించారు. డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు దర్శనాలు ఉంటాయి. డిసెంబర్ 30, 31, జనవరి 1వ తేదీల్లో ఈ-డిప్ ద్వారా సర్వదర్శనం టోకెన్లు పొందినవారికి మాత్రమే దర్శనం కల్పిస్తున్నట్లు తెలిపారు బీఆర్ నాయుడు.
ప్రముఖ పారిశ్రామికవేత్త మెగా కృష్ణారెడ్డి తాడిపత్రిలో పర్యటించారు. బుగ్గ రామలింగేశ్వర స్వామి దేవాలయాన్ని జేసీ ఫ్యామిలీతో కలిసి ఆయన స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు.
ఆన్‌లైన్ ట్రోలింగ్‌లు, వేధింపులపై ఇండిపెండెంట్ జర్నలిస్ట్ తులసి చందుతో సహా మహిళా జర్నలిస్టులు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్‌కు ఫిర్యాదు చేశారు. ట్రోల్ వీడియోలు, హేట్ కామెంట్స్‌ను కమిషనర్‌కు తెలియజేశారు. చర్యలు తీసుకుంటామని జర్నలిస్టులకు హామీ ఇచ్చారు సజ్జనార్.
ఆపరేషన్ కగార్ పేరుతో ఎన్‌కౌంటర్లు జరుగుతున్నాయని చెప్పారు సీపీఐ జాతీయ నాయకులు చాడ వెంకట్ రెడ్డి. చర్చలకు రావాలని మావోయిస్టులు సిద్ధంగా ఉన్నా కేంద్రం ముందుకు రావడం లేదని ఆయన విమర్శించారు. పేద ప్రజల ప్రయోజనాల కోసం ఎర్ర జెండాలు అన్నీ ఏకమై పోరాడాలని పిలుపునిచ్చారు చాడ.
వనపర్తి జిల్లా గోపాల్‌పేట అసిస్టెంట్ ఇంజనీర్ ఆఫీస్‌లో ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు ఏసీబీ అధికారులు. ఓ రైతు నుంచి లంచం తీసుకుంటూ విద్యుత్ శాఖ ఏఈ హర్షవర్ధన్ రెడ్డి ఏసీబీకి చిక్కాడు. వ్యవసాయ ట్రాన్స్‌ఫార్మర్ కోసం 40వేల రూపాయలు డిమాండ్ చేసి.. 20వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్నామని చెప్పారు ఏసీబీ డీఎస్పీ సిహెచ్ బాలకృష్ణ. ఎవరైనా ప్రభుత్వ అధికారులు లంచం డిమాండ్ చేస్తే ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు.
గత వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు మంత్రి ఆనం రామనారాయణరెడ్డి. పవిత్రమైన తిరుమలలో కల్తీ నెయ్యి, పరకామణి దోపిడీలకు పాల్పడ్డారని విమర్శించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు CBI విచారణ చేస్తే.. నాటి ప్రభుత్వ పెద్దలందరూ ఇందులో భాగస్వాములని తేలిందని.. ఇప్పుడేమని సమాధానం చెబుతారని ప్రశ్నించారు. ప్రపంచవ్యాప్తంగా హిందూ ధర్మాన్ని పాటించే వారంతా.. కలియుగ ప్రత్యక్ష దైవం వద్ద ఇంత పెద్ద తప్పులు జరిగాయా అని బాధపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
జగిత్యాల జిల్లా కొత్త దామ్రాజ్‌పల్లిలో దారుణం జరిగింది. భర్త భూమేష్‌ను భార్య విజయ, అత్త లక్ష్మి కలిసి హత్య చేశారు. డబ్బుల కోసం భూమేష్ తరచూ వేధించడంతో అత్తగారింటికి వచ్చినప్పుడు గొడవ జరిగిందని, దీంతో పథకం ప్రకారం అత్త, భార్య చున్నీతో మెడకు చుట్టి భూమేష్‌ను చంపినట్లు సీఐ అనిల్ కుమార్ తెలిపారు.
మహబూబ్ నగర్ జిల్లా గొల్లపల్లి వద్ద బాలాజీ జిన్నింగ్ మిల్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు స్పాట్‌లోనే చనిపోయారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
భారత్‌లో మహిళలపై అఘాయిత్యాలు పెరుగుతున్నాయి. రాత్రి వేళ ముంబై లోకల్ రైలులో ఒంటరిగా ప్రయాణిస్తున్న యువతికి ఓ పోలీసు అధికారి రక్షణగా నిలిచారు. రైలు కోచ్‌లో యువతి తప్ప ఎవరూ లేకపోవడాన్ని గమనించిన ఆ పోలీసు, ఆమె సీటుకు సమీపంలో కూర్చొని ఎస్కార్ట్‌గా వ్యవహరించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
దేశంలో ప్రతి 8 నిమిషాలకు ఒక చిన్నారి తప్పిపోతుండటంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. దత్తత ప్రక్రియ సంక్లిష్టంగా ఉండడం వల్ల అక్రమ దత్తత పెరుగుతోందని పేర్కొంది. దత్తత విధానాన్ని క్రమబద్ధీకరించి, అక్రమ రవాణాను అరికట్టాలని కేంద్రాన్ని ఆదేశించింది.
టాలీవుడ్ హీరో బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను సింహాద్రి అప్పన్న స్వామిని దర్శించుకున్నారు. ‘అఖండ 2’ సినిమా విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ ప్రత్యేక పూజలు చేశారు. బాలకృష్ణ ముందుగా కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకొని, బేడా మండపం చుట్టూ ప్రదక్షిణ చేశారు. అనంతరం అంతరాలయంలో స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
బాలయ్య పూజలు
పాకిస్తాన్ వేదికగా జరుగుతున్న టీ20 ట్రై సిరీస్ నుంచి కెప్టెన్ చరిత్ అసలంక, ఫాస్ట్ బౌలర్ అసిత్ ఫెర్నాండోలు ఆరోగ్య సమస్యల కారణంగా స్వదేశానికి తిరిగి రానున్నారు. బిజీ సీజన్‌కు ముందు వారికి సరైన వైద్య సహాయం అందించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు శ్రీలంక క్రికెట్ బోర్డు తెలిపింది. అసలంక స్థానంలో దాసున్ షనకా కెప్టెన్‌గా వ్యవహరిస్తాడని, ఫెర్నాండో స్థానంలో పవన్ రత్నాయకేకు జట్టులో చోటు కల్పించినట్లు బోర్డు ప్రకటించింది.
స్వదేశానికి ఆటగాళ్లు