తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లు, అందుకు సంబంధించి పని విభజనపై మంత్రులు, అధికారులతో భేటీ కానున్నారు సీఎం రేవంత్ రెడ్డి. సచివాలయంలో జరుగుతున్న ఈ సమావేశంలో ప్రజాపాలన వారోత్సవాలపై చర్చించనున్నారు. రేపటి నుంచి డిసెంబర్ 9 వరకు ప్రజాపాలన వారోత్సవాలు జరగనుండగా.. డిసెంబర్ 8, 9 తేదీల్లో ఫ్యూచర్ సిటీలో తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ నిర్వహించనున్నారు.
పిఠాపురం ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ అభివృద్ధి చేస్తున్నట్టుగా గతంలో మరే ఎమ్మెల్యే కూడా చేయలేదని హాట్ కామెంట్ చేశారు మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు. ఈ సెగ్మెంట్లో మరే మాజీ ఎమ్మెల్యేలకు కూడా ఇక ఫ్యూచరే ఉండదన్న అర్ధమొచ్చేలా మాట్లాడారు ఆయన. పవన్ నియోజకవర్గంలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నట్టు చెప్పారు పెండెం.
సాలూరు లైంగిక వేధింపుల కేసులో బాధితురాలు సంచలన ఆరోపణలు చేశారు. మంత్రికి అనుకూలంగా పోలీసులు విచారణ చేస్తున్నారన్న అనుమానం కలుగుతోందన్నారు. శుక్రవారం మధ్యాహ్నం మెడికల్ టెస్టులకని పిలిచినా.. శనివారం వరకు పోలీసుల ఆధీనంలోనే తనను ఉంచారని ఆరోపించారు. కనీసం తన పిల్లలతో కూడా మాట్లాడే అవకాశం ఇవ్వలేదన్నారు బాధితురాలు.
నెల్లూరు జిల్లా కల్లూరు పల్లిలో జరిగిన సీపీఎం నేత పెంచలయ్య హత్య కేసులో ప్రధాన నిందితురాలు అరవ కామాక్షిని అరెస్టు చేశారు పోలీసులు. హత్య జరిగిన తర్వాత ఆమె ఇంట్లో సోదాలు నిర్వహించిన పోలీసులు అక్కడిక్కడే అరెస్టు చేశారు. కామాక్షి ఇంట్లో 25 కిలోల గంజాయితో పాటు కొన్ని పత్రాలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.
రాజకీయంగా తన ఎదుగుదల ఓర్వలేకే తన కుమారుడిపై బురద జల్లుతున్నారని ఆరోపించారు మంత్రి గుమ్మిడి సంధ్యారాణి. నా బిడ్డ తప్పు ఉంటే ఎలాంటి శిక్షకైనా సిద్ధమేనని చెప్పారు. మెంటాడలో జరిగిన రైతన్న మీ కోసం వారోత్సవాల్లో పాల్గొన్న మంత్రి.. ఇప్పటికే తాను ఈ విషయంపై పోలీసులను పూర్తిస్థాయిలో ఎంక్వైరీ చేయమన్నానని వెల్లడించారు
తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలోని రైల్వేగేట్ సమీపంలో ఉన్న కృష్ణా లాడ్జ్‌లో ఆదివారం అనుమానాస్పద స్థితిలో ఓ మహిళ మృతిచెందింది. సుమారు 40 నుంచి 45 సంవత్సరాల వయసున్న గుర్తుతెలియని మహిళ మృతదేహం లాడ్జిలో కనిపించింది. లాడ్జి సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
ఓటర్ల జాబితా సవరణకు కేంద్ర ఎన్నికల సంఘం మరో 7 రోజుల గడువును పొడిగించింది. డిసెంబర్ 4 వరకు జరగాల్సిన ఓటర్ల సవరణ డిసెంబర్ 11 వరకు జరగనున్నట్లు ప్రకటించింది ఈసీ. ఉత్తరప్రదేశ్, అండమాన్, నికోబార్, ఛత్తీస్ ఘడ్, గోవా, గుజరాత్, కేరళ, లక్షదీప్, మధ్యప్రదేశ్, పుదుచ్చేరి, రాజస్థాన్, తమిళనాడు, వెస్ట్ బెంగాల్ రాష్ట్రాలలో ఓటర్ల జాబితా సవరణ జరుగునున్నట్లు తెలిపింది.
రాష్ట్ర సమాచార పౌర సంబంధాల, గృహ నిర్మాణశాఖల మంత్రి కొలుసు పార్థసారథి బాపట్ల జిల్లాకు చేరుకున్నారు. దిత్వా తుపాను నష్టాల నివారణపై జిల్లాలోని అధికారులతో సమీక్షించారు. గత తుపాను అనుభవాలను పరిగణనలోకి తీసుకుని మరింత స్పూర్తితో పనిచేయాలని అధికారులకు సూచించారు. జిల్లాలోని అద్దంకి, చిన్నగంజాం మండలాలకు ఇప్పటికే హై అలెర్ట్ ఇచ్చినందున ప్రజలు అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం అనంతసాగర్ గ్రామంలో మల్లన్న స్వామి జాతర కళ్యాణ మహోత్సవాలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి హరీష్ రావు, నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి పాల్గొన్నారు.
హైదరాబాద్‌లోని పాతబస్తీ తలాబ్ కట్టా ప్రాంతంలో గాజుల వ్యాపారి ఎండీ సుల్తాన్ ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తి 40 లక్షల రూపాయల నగదు, బంగారు ఆభరణాలు దొంగిలించాడు. ఇంటిని అమ్మేసి హైదరాబాద్‌కు మకాం మార్చిన కొద్దిరోజులకే ఈ ఘటన జరిగింది. భవానీ నగర్ పోలీసులు ఫిర్యాదు స్వీకరించి, సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు.
కుత్బుల్లాపూర్ నియోజక వర్గం సూరారం విలేజ్ సీఎంఆర్ హాస్పిటల్ BKR ఫౌండేషన్ బిగ్ టీవీ ఆధ్వర్యంలో మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించారు. పేదల ఆరోగ్యం బాగుండాలనే ఉద్దేశంతో మెగా హెల్త్ క్యాంపును నిర్వహించినట్లు బొంగునూరు కిషోర్ రెడ్డి తెలిపారు. సహాయం చేయడంలో విద్య, వైద్యాన్ని మించిన సహాయం మరొకటి లేదని ఆయన అన్నారు.
హైదరాబాద్ రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధి.. ఏఐజి హాస్పిటల్ సమీపంలోని మేఘ ఏడిఫైస్ అపార్ట్‌మెంట్లో అగ్నిప్రమాదం జరిగింది. అపార్ట్‌మెంట్‌లోని నాలుగవ ఫ్లోర్, ఫ్లాట్ నెంబర్ 401లో మంటలు చెలరేగాయి. పూజా దీపం సోఫాపై పడటం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు.
మెదక్ జిల్లా శెట్టిపల్లి కలాన్ గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. వెల్దుర్తి మెదక్ ప్రధాన రహదారి విస్తరణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ రామాయపల్లి, బండ పోసాన్ పల్లి, ఏదులపల్లి, కొత్తపల్లి గ్రామాలకి చెందిన ప్రజలు పెద్ద ఎత్తున రాస్తారోకో నిర్వహించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రహదారి విస్తరణ పనులు చేపట్టాలని, లేనిపక్షంలో గ్రామపంచాయతీ ఎన్నికలను బహిష్కరిస్తామని హెచ్చరించారు.
మహబూబాబాద్ జిల్లా దాట్ల గ్రామంలో ఓ విచిత్రం చోటుచేసుకుంది. గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా గ్రామానికి జనరల్ మహిళకు సర్పంచ్‌గా అవకాశం వచ్చింది. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎంపీటీసీ సభ్యుడి తల్లి కొమ్మినేని రాములమ్మను అదే గ్రామానికి చెందిన ఓ అభిమాని ఆమె కాళ్లపై పడి సర్పంచ్‌గా పోటీ చేయాలని విజ్ఞప్తి చేశారు.
నెల్లూరు జిల్లా పునర్విభజనలో చంద్రబాబు ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నారని విమర్శించారు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. రాపూరు, కలువాయి, సైదాపురాన్ని తిరిగి తిరుపతి జిల్లాలో కలిపితే రైతులు తీవ్రంగా ఇబ్బంది పడతారన్నారు. కందుకూరును ఒంగోలులో కలిపిన చంద్రబాబు, గూడూరును నెల్లూరులో కలిపే హామీని విస్మరించారని చెప్పారు కాకాణి.
వరకట్న మరణం కేసులో భర్తకు అలహాబాద్ హైకోర్టు మంజూరు చేసిన బెయిల్‌ను సుప్రీం కోర్టు రద్దు చేసింది. వరకట్న దురాచారం సమాజానికి వ్యతిరేకంగా జరిగే నేరం అని కోర్టు స్పష్టం చేసింది. వివాహ పవిత్రత వ్యాపార లావాదేవీ స్థాయికి దిగజారడం శోచనీయమని వ్యాఖ్యానించింది.
ప్రధాని నరేంద్ర మోదీ ‘మన్ కీ బాత్’లో పరిశోధన రంగంలో భారత్ దూసుకుపోతోందని అన్నారు. భారతీయ యువత శక్తి, బలమైన సంకల్పంతో దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తోందని ప్రశంసించారు. గత 11 ఏళ్లలో విజ్ఞానం, క్రీడలు, సామాజిక సేవ, సంస్కృతి వంటి రంగాల్లో యువత ప్రతిభ కనబరిచారని కొనియాడారు మోడీ.
అమెరికాలోని కాలిఫోర్నియా సిటీలో కాల్పులు కలకలం సృష్టించాయి. స్టాక్ టన్ లో శనివారం రాత్రి గుర్తు తెలియని దుండగులు కాల్పులకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో పలువురికి గాయాలు అవ్వగా.. వారికి హాస్పిటల్ లో చికిత్స అందిస్తున్నారు.
మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ కుమారుడు ప్రణవ్ మోహన్ లాల్ నటించిన తాజా సినిమా ‘డీయస్ ఈరే’. మలయాళంలో సూపర్ హిట్ అయిన ఋ మూవీ ప్రముఖ OTT వేదిక జియో హాట్‌స్టార్‌లో డిసెంబర్ 5 నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది.
స్టార్ వెస్టిండీస్ ఆల్ రౌండర్ ఆండ్రీ రస్సెల్ ఐపీఎల్‌కు వీడ్కోలు పలికాడు. ఇటీవల కోల్‌కతా నైట్‌రైడర్స్ రస్సెల్‌ను విడుదల చేసింది. ఐపీఎల్ మినీ వేలంలో భారీ ధర ఆశించినా.. టోర్నీ నుంచి తప్పుకున్నారు. డిసెంబర్ 16న అబుదాబిలో మినీ వేలం జరగనుంది.