Big Stories

Reviving: మరణించిన మనిషిని బ్రతికించే ప్రక్రియ..

reviving

Reviving : పెరుగుతున్న టెక్నాలజీల కారణంగా పుట్టుక దగ్గర నుండి మరణం వరకు అన్ని కృత్రిమంగా మారిపోయాయి. ఆలోచనలను అంచనా వేయడంతో పాటు వాటిని మార్చే, ఏమార్చే టెక్నాలజీలు కూడా మార్కెట్లో హల్‌చల్ చేస్తున్నాయి. అయితే మరణాన్ని కూడా ఏమార్చవచ్చా, లేదా మరణించకుండా ఎక్కువకాలం జీవించే అవకాశం ఉందా అనే అనుమానాలు పరిశోధకులకు వచ్చాయి. అందుకే వారు ఒక కొత్త టెక్నాలజీని తయారు చేసే ప్రయత్నంలో ఉన్నారు.

- Advertisement -

మరణించిన తర్వాత కూడా మనుషుల్లో ప్రాణం ఉంటుందని నమ్మి కొన్ని దేశాలు.. ఆ మృతదేహాలను జాగ్రత్తగా దాచిపెట్టుకుంటారు. మరికొందరైతే వారిలో తిరిగి ప్రాణం రప్పించాలని ప్రయత్నాలు కూడా చేస్తుంటారు. వీటన్నింటిని చూసి ఇప్పటివరకు ప్రజలు మూఢనమ్మకాలు అనేవారు. కానీ దాదాపుగా ఇలాంటి ప్రయత్నాలనే సైంటిస్టులు కూడా మొదలుపెట్టారు. కాకపోతే అలాంటి మూఢనమ్మకాలకు, సైంటిస్టులు చేసే పరిశోధనలకు కాస్త తేడా ఉంది. వినడానికే ఆశ్చర్యంగా ఉన్నా.. ఈ కోణంలో పరిశోధనలు ఇప్పటికే మొదలయ్యాయి.

- Advertisement -

ఈరోజుల్లో మరణం అనేది ఎక్కడినుండి ఎలా వస్తుందో చెప్పడం అసాధ్యంగా మారిపోయింది. కానీ కొందరికి మాత్రం మరణించకుండా ఎప్పటికీ ఇలాగే జీవించి ఉండే బాగుంటుంది కదా అనే ఆలోచన రావచ్చు. అలాంటి వారిలో కొంతమంది సూపర్ రిచ్ వ్యక్తులు కూడా ఉంటారు. వారు ఎంత ఖర్చు అయినా సరే మరణానికి దూరంగా ఉండాలి అనుకుంటారు. అమెజాన్ ఫౌండర్ జెఫ్ బిజోస్, ఓపెన్ ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్మాన్, పేపాల్ కో ఫౌండర్ పీటర్ థేల్‌కు కూడా అలాంటి కోరికే కలిగింది. అందుకే ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి వారి జీవితకాలాన్ని ఎలా పెంచుకోవాలో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.

అనూహ్యంగా జీవితకాలం పెంచుకోవడానికి ఒక ప్రక్రియ కూడా ఉందని కొందరు అంటున్నారు. అదే క్రయానిక్స్. ఇది మనుషుల జీవితకాలాన్ని పెంచుతుందని ఇప్పటికే చాలామంది నమ్ముతున్నారు. ఈ ప్రక్రియలో మనిషి మరణించిన తర్వాత వారి మృతదేహాన్ని ఎక్కువకాలం ఫ్రీజర్‌లో ఉంచితే.. ఆ మనిషి తిరిగి బ్రతికి వస్తాడని అంటున్నారు. ఇప్పటికే ఈ క్రయానిక్ ప్రక్రియ ద్వారా ఎవరూ తిరిగి బ్రతికి రాలేదు. అలా అని ఎక్కువకాలం ఫ్రీజర్‌లో ఉన్న మృతదేహానికి ప్రాణం వస్తుందని కూడా ఏ టెక్నాలజీ చెప్పలేదు. అయినా కూడా కొంతమంది ఈ ప్రక్రియను బలంగా నమ్ముతున్నారు.

క్రయానిక్స్ అంటే కేవలం మృతదేహాన్ని ఫ్రీజర్‌లో పెట్టడమే కాదు.. దాని వెనుక ఎంతో కఠానమైన ప్రక్రియ ఉంటుందని పరిశోధకులు చెప్తున్నారు. ముందుగా ఒక మనిషి చనిపోయాడని నిర్ధారించిన తర్వాత వెంటనే క్రయానిక్స్ ప్రక్రియను ప్రారంభిస్తారు. రక్తం గడ్డకట్టకుండా, పొట్టలో యాసిడ్ ఫార్మ్ అవ్వకుండా కొన్ని మందులను ఇస్తారు. ఆ తర్వాత మృతదేహంలోని వేడిని అంతా బయటికి పంపిస్తారు. ఆపై ఒక ఐస్ ముక్కపై ఆ మృతదేహాన్ని ఉంచుతారు. పూర్తిగా బాడీ గడ్డకట్టకుండా ఒకటి తర్వాత ఒకటిగా పలు ప్రక్రియలను చేసుకుంటూ వెళ్తారు. క్రయానిక్స్ చేసేవారిని ఫ్యూనరల్ డైరెక్టర్స్ అంటారు. ఇక ఈ ప్రాసెస్ సక్సెస్ అయితే.. మనిషికి మరణం లేనట్టే అని పలువురు భావిస్తున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News