Big Stories

Anil Jaisinghani : ఆపరేషన్ ఏజీ.. 750 కిలోమీటర్లు ఛేజింగ్.. అరెస్ట్..

Anil Jaisinghani : మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ వైఫ్ అమృతను డబ్బు కోసం బ్లాక్‌మెయిల్‌ చేసిన కేసును పోలీసులు ఛాలెంజింగ్ గా తీసుకున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు అనిల్ జైసింఘానీ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు అనేక ఎత్తుగడలు వేశాడు. క్రైమ్ థ్రిల్లర్ సినిమాలను తలపించేలా అతడు ఫోన్లు మార్పుస్తూ రెండుసార్లు తప్పించుకున్నాడు. దీంతో పోలీసులు ఆపరేషన్ ఏజే పేరుతో గాలింపు కొనసాగించారు. 72 గంటలపాటు అనిల్ జైసింఘానీని 750 కిలోమీటర్లు వెంటాడారు. చివరకు వడోదర సమీపంలోని కోలాల్ వద్ద అరెస్ట్ చేశారు. నిందితుడిని మలబార్ హిల్స్ పోలీసులకు అప్పగించారు.

- Advertisement -

ఎలా దొరికాడంటే..?
అనిల్‌ మొబైల్‌ లొకేషన్‌ను తొలిసారి శుక్రవారం గుజరాత్‌లో పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత రోజు సూరత్‌ చేరుకున్నాడని నిర్ధారించారు. పోలీసులు అక్కడకు వెళ్లేసరికి అనిల్‌ ఎయిర్‌పోర్టు వద్దకు వెళ్లిపోయాడు. దీంతో పోలీసులు అతడిని వెంటాడి చివరికి కొలాల్‌ సమీపంలో అదుపులోకి తీసుకున్నారు. అనిల్‌ సిమ్‌కార్డుల నుంచి ఫోన్లు అసలు చేయడని పోలీసులు తెలిపారు. ఇంటర్నెట్‌ ఆధారిత వీవోఐపీ కాల్స్‌ మాత్రమే చేస్తాడని వెల్లడించారు. అతడు వేర్వేరు పేర్లతో డాంగిల్స్‌ను కొనుగోలు చేసి వాటిని ఐదారు రోజులకు మార్చేసేవాడని పోలీసులు వివరించారు. అనిల్ నుంచి రెండు డాంగిల్స్‌, రెండు మొబైల్‌ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

- Advertisement -

ఎవరీ అనిల్ జైసింఘానీ..?
మహారాష్ట్రలో అనిల్ జైసింఘానీ బడా క్రికెట్‌ బుకీ. అతడిపై 15 కేసులు ఉన్నాయి. ఐపీఎల్‌ సమయంలో రూ. కోట్లలో బెట్టింగ్‌లు నిర్వహిస్తాడని ఆరోపణలున్నాయి. ఆ కేసుల్లో చిక్కకుండా ఉండేందుకు పోలీసులకు భారీగా లంచాలు ఇస్తుంటాడని టాక్ ఉంది. వాటిని వీడియోలు తీసి పోలీసులను బ్లాక్‌మెయిల్‌ చేస్తుంటాడని సమాచారం. గతంలో అనిల్ NCP తరఫున కార్పొరేటర్‌గా గెలిచాడు. అతడి వద్ద ఖరీదైన పెంపుడు శునకాలు ఉన్నాయి. కేసు విచారణ కోసం పోలీసులు అతడి ఇంటికి వెళ్తే.. వారిపైకి ఆ కుక్కలను వదిలి భయపెట్టేవాడని స్థానిక మీడియాలో కథనాలు వచ్చాయి.

అసలు కేసు ఏంటి..?
అనిల్‌ జైసింఘానీ కుమార్తె అనిక్ష తనను బెదిరించారని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృత ఆరోపించారు. రూ.కోటి ఇస్తాను.. తన తండ్రి అనిల్‌ను కేసుల నుంచి బయటపడేయమని అనిక్ష కోరిందని తెలిపారు. ఈ ప్రతిపాదనకు తాను నిరాకరించడంతో కొన్ని మార్ఫింగ్‌ వీడియోలను తయారు చేసి వాటిని లీక్‌ చేస్తానని బెదిరించిందన్నారు. తనకు రూ. 10 కోట్లు చెల్లించాలని అనిక్ష డిమాండ్‌ చేసిందని అమృత ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే అనిక్షపై బ్లాక్‌మెయిల్‌ , బెదిరింపుల కేసును అమృత పెట్టారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అనిక్షను గురువారం అరెస్టు చేశారు. ఇప్పుడు ఆమె తండ్రి అనిల్ జైసింగానీని అదుపులోకి తీసుకున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News