Mahesh Kumar on Harish Rao: బీఆర్ఎస్ పార్టీలో లుకలుకలు మొదలయ్యాయా.. మాజీమంత్రి హరీష్ రావుకు అన్యాయం చేసేందుకు బీఆర్ఎస్ అధినాయకత్వం ప్రయత్నిస్తోందా.. అంటే అవుననే అంటున్నారు తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. అదిలాబాద్ జిల్లాలో సోమవారం పర్యటించిన మహేష్ గౌడ్ కీలక కామెంట్ చేశారు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ పొలిటికల్ హీట్ కు దారితీసాయి.
మహేష్ గౌడ్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీలో విభేదాలు ఉన్నాయని, వాటిని కప్పిపుచ్చుకునేందుకు కేటీఆర్ ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆరోపించారు. ఒక సీటు కోసం ముగ్గురు కొట్లాడుకుంటున్న సందర్భాలు బీఆర్ఎస్ పార్టీలో ప్రస్తుతం ఉన్నట్లు మహేష్ గౌడ్ తేల్చి చెప్పారు. అయితే ఆది నుండి కేసీఆర్ కుటుంబాన్ని నమ్ముకున్న మాజీ మంత్రి హరీష్ రావుకు అన్యాయం జరిగేలా ఉందని, ఆయన సాధ్యమైనంత త్వరగా ఇంకో పార్టీ చూసుకోవాల్సిన పరిస్థితి ఉందంటూ మహేష్ గౌడ్ చెప్పడం విశేషం.
అయితే ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ అడ్డంగా బుక్కయ్యారని, బాహాటంగా ప్రజాధనాన్ని మళ్లించి, కేటీఆర్ దొరికిపోయినట్లు మహేష్ గౌడ్ అన్నారు. కేటీఆర్ అవినీతి కేసులో ఇరుక్కోవడమే కాక అధికారులను కూడా అందులో ఇరికించినట్లు మహేష్ గౌడ్ కామెంట్ చేశారు బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఎక్కడ చూసినా ప్రజల సొమ్మును దోపిడీ చేయడమే పనిగా సాగిందని ,కమిషన్ల కోసం కాలేశ్వరం ప్రాజెక్టు పేరిట దోపిడీ చేసిన విషయాన్ని ప్రజలు ఎప్పటికీ మరిచిపోరన్నారు.
ప్రపంచంలోనే అతి తక్కువ సమయంలో అధిక దోపిడీ చేసిన ఘనత కేసిఆర్ కుటుంబానికి దక్కుతుందని ఆయన విమర్శించారు. అభివృద్ధి, సంక్షేమంపై బహిరంగ చర్చకు రావాలని బీఆర్ఎస్ పార్టీకి ఈ సందర్భంగా మహేష్ గౌడ్ సవాల్ విసిరారు. ఈ కార్ రేసుకు సంబంధించి కేటీఆర్ జైలుకెళ్ళక తప్పదని, ప్రజల సొమ్మును తిన్న అనేకమంది జైల్లోకి వెళ్లారని, కేటీఆర్ కు కూడా అదే గతి పడుతుందంటూ మహేష్ గౌడ్ జోస్యం చెప్పారు.