Twist In Kamalapuram Village: నేనే పరమశివుడిని అన్నాడు. ఒకే రీతిలో పూనకంతో ఊగాడు. అక్కడ త్రవ్వండి చాలు.. శివలింగం బయటకు వస్తుందంటూ గ్రామస్థులతో చెప్పాడు. వారంతా నమ్మారు.. చేతులకు బొబ్బలు వచ్చేలా త్రవ్వకాలు జరిపారు. తీరా సీన్ కట్ చేస్తే.. గ్రామం నుండి పరారయ్యాడు. ఇప్పటికే మీ మదిలో అసలు కథ మెదిలే ఉంటుంది. అదేనండీ నేనే పరమశివుడిని అంటూ హల్చల్ చేసిన అశోక్ అనే కుర్రాడి వ్యవహారం.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమలాపురం గ్రామంలో గత రెండు రోజుల క్రితం అశోక్ అనే కుర్రాడు నేనే శివుడినంటూ పూనకంతో ఊగిపోయిన విషయం తెలిసిందే. తాను చెప్పినట్లు ఆరడుగుల గొయ్యి త్రవ్వితే ఏకంగా శివలింగం, నందీశ్వరుని విగ్రహాలు బయటపడుతాయని భవిష్యవాణి కూడా వినిపించాడు. దీనితో గ్రామస్థులు కూడా ఒక్కటై, అసలేం చేయాలని చర్చించుకున్నారు. అసలే కార్తీకమాసం.. అందులో నేనే పరమశివుడిని అంటూ బాలుడు పూనకంతో ఊగిపోతున్నాడు. ఇంకేముంది గ్రామస్థులు త్రవ్వకాలు ప్రారంభించారు.
పవిత్రమైన కార్తీకమాసంలో పరమ శివయ్య బయటపడుతారనే నమ్మకంతో, గ్రామం మొత్తం విగ్రహాలు కనిపించే వరకు ఉపవాసం ఉండాలని నిర్ణయించుకున్నారు. ఉపవాస దీక్షలోనే అశోక్ చెప్పిన ప్రదేశంలో గొయ్యి త్రవ్వడం ప్రారంభించారు. చేతులకు బొబ్బలు వచ్చాయి కానీ ఎటువంటి విగ్రహాలు బయటపడలేదట. అలాగే అశోక్ గొయ్యి త్రవ్వమన్న ప్రదేశం అటవీ శాఖ పరిధిలోకి వస్తుంది. అంతలోనే అటవీ శాఖ అధికారులు రంగంలోకి దిగారు. గ్రామస్థుల నమ్మకాన్ని వారు కూడా కాదనలేక, సైలెంట్ అయ్యారు. ఒకరోజు త్రవ్వకాలు సాగాయి. రెండవ రోజు కూడా అదే రీతిలో త్రవ్వారు.
అయితే అక్కడ విగ్రహాలు కనిపించని పరిస్థితి. అశోక్ పూనకంతో ఊగిపోతూనే ఉన్నాడు. చిట్టచివరకు ప్రొక్లెయిన్ తో త్రవ్వకాలు సాగించాలని గ్రామస్థులు ప్రయత్నించారు. అందుకు అటవీ శాఖ అధికారులు ససేమిరా ఒప్పుకోలేదు. చివరికి ఆరడుగుల గొయ్యి త్రవ్వినా కూడా అశోక్ చెప్పినట్లు విగ్రహాలు బయల్పడలేదని, ఇక తాము అనుమతించబోమని అటవీ శాఖ అధికారులు తేల్చి చెప్పారు. ఈ తరుణంలో షాకింగ్ న్యూస్ తెలిసింది గ్రామస్థులకు.
బిగ్ టీవీ ప్రత్యేకంగా అసలు అశోక్ గృహం ఏవిధంగా ఉంది? అసలు పూనకం రావడం నిజమా కాదా అనే విషయాలను ధృవీకరించుకొనేందుకు అశోక్ నివాస గృహానికి వెళ్లగా, తమ కుమారుడికి ఎటువంటి పూనకం రావడం లేదని, అశోక్ కు ఆరోగ్యం బాగా లేదని అతని తల్లి సమాధానమిచ్చారు. అంతేకాకుండా ఆరడుగుల గొయ్యి త్రవ్విన తరువాత, అక్కడ విగ్రహాలు కనిపించక పోవడంతో గ్రామస్థులు కూడా ఆశ్చర్యపోయారు.
Also Read: KTR on Formula E Race: నాదే తప్పు.. జైలుకెళ్లడానికి సిద్దం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
ఈ తరుణంలో తమ ప్రశ్నలకు ఏం సమాధానం చెప్పాలో తెలియని పరిస్థితుల్లో అశోక్ కు చికిత్స అందించేందుకు వారు వెళ్లినట్లు గ్రామస్థులు తెలుపుతున్నారు. అశోక్ మాటలు నమ్మి ఉపవాసాలు ఉండి, చేతులకు బొబ్బలు వచ్చినా కూడా త్రవ్వకాలు జరిపామని, చివరికి ఇలా జరుగుతుందని తాము అనుకోలేదంటూ స్థానికులు తెలిపారు. ఏదిఏమైనా నేనే పరమశివుడిని అంటూ వైరల్ గా మారిన అశోక్, చివరకు సైలెంట్ కాగా గ్రామస్థులు కూడా ఈ విషయానికి ఇంతటితో శుభం కార్డు వేశారని సమాచారం.