Updates on Twitter : ఎలన్ మస్క్ రూట్ మార్చారు. ట్విటర్‌ను మనీ క్రియేషన్ గా మారుస్తున్నారు. ముఖ్యంగా యూజర్లు ట్విటర్ ద్వారా సంపాదించుకునే ఓ అవకాశాన్ని కల్పించారు. ఎంతోమంది తమ కంటెంట్ ను ఫ్రీగా ట్విటర్ లో పోస్ట్ చేస్తుంటారు. ఎక్స్‌క్లూజివ్ వీడియోలను కూడా అప్ లోడ్ చేస్తుంటారు. ఇన్నిచేసినా వారికి దక్కేది మాత్రం లైక్‌లు, రీట్వీట్ లే. ఇకపై అలా కాదు.. కంటెంట్ లేదా వీడియో పోస్ట్ చేయండి.. డబ్బు సంపాదించండి అనే ఆఫర్ ఇస్తోంది. ఇందుకోసం, ట్విటర్ సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాలి. అలాగని దీనికి మనీ చెల్లించనక్కర్లేదు. ఏడాది పాటు ఫ్రీ. ఆ తరువాత మీరు సంపాదిస్తున్న ఆదాయంలో 8 శాతం మాత్రమే తీసుకుంటుంది. 92 శాతం ఆదాయం యూజర్లకే ఇస్తుంది. కాకపోతే, ఇది వెబ్ వర్షన్ వాడుతున్న వాళ్లకే.
ఒకవేళ యాప్ వర్షన్ వాడుతున్నట్టైతే 70 శాతం ఇన్‌కమ్ మీకే ఇస్తామంటోంది ట్విటర్. ఆండ్రాయిడ్, ఐఓఎస్ వాడుతున్నందుకు గాను ఫీజు కింద ఆ 30 శాతం తీసుకుంటానంటోంది. కంటెంట్ 280 పదాల నుంచి గరిష్టంగా 10 వేల వరకు ఉండొచ్చు. అవసరమైతే మీ కంటెంట్‌కు ప్రమోషన్ కల్పిస్తామని ట్విట్టర్ తెలిపింది. మొత్తానికి, యూజర్లను కాపాడుకునేందుకు ట్విటర్ పెద్ద ప్లానే వేసింది. ముందుగా ఈ ప్లాన్ ను అమెరికాలో అమలు చేస్తారు. సక్సెస్ అయితే.. ప్రపంచవ్యాప్తంగా అమలు చేస్తారు.
అయితే, యూజర్లను కాపాడుకోవడం ఒక్కటే కాకుండా కంటెంట్ క్రియేటర్లను ఒక ప్లాట్‌ఫామ్‌పైకి తేవాలని ప్రయత్నిస్తున్నట్టు అర్ధమవుతోంది. మరోవైపు న్యూస్‌లెటర్ కంపెనీ సబ్‌స్టాక్‌కు పోటీ ఇవ్వడం కూడా మస్క్ వ్యూహంలో భాగం అంటున్నారు. సబ్ స్టాక్ కూడా తమ ప్లాట్‌ఫామ్‌పై యూజర్లు ఎటువంటి కంటెంట్‌తోనైనా సబ్‌స్క్రిప్షన్ ద్వారా అందించుకునే వీలు కల్పిస్తోంది. ఏదేమైనా.. కంటెంట్ క్రియేటర్లకు ఇదో మంచి అవకాశం.