RaviChtu : మన హిందూధర్మంలో రాళ్లలోను దేవుడ్ని చూసే గొప్పతనం ఉంది. అలాంటిది చెట్టు,పుట్టను భక్తితో కొలుస్తారు. దాదాపు చాలా దేవాలయాల్లో రావి చెట్టు, వేప చెట్టు కనిపిస్తుంటాయి. రావిచెట్టుకి అశ్వత్థవృక్షమనీ, బోధివృక్షమనీ పేర్లున్నాయి. దాదాపుగా దేవాలయాల్లో రావిచెట్టు లేదా వేప చెట్టు ఉంటాయి. ఎక్కువ చోట్ల రావి, వేప కలిసి ఉంటాయి. రావి చెట్టును పురుషునిగాను, వేపచెట్టును స్త్రీగాను భావించి పూజించడం ఎక్కువ. రావిని విష్ణు రూపంగాను, వేప చెట్టును స్త్రీగానూ భావించి ప్రదక్షిణలు చేస్తుంటారు.ఈ జంట వృక్షాలను పూజిస్తే దాంపత్య నివారణ కలిగి సంసారం అన్యోన్యంగా ఉంటుందని హిందువుల నమ్మకం. రావి చెట్టు గురించి పద్మపురాణంలో స్పష్టంగా వివరించారు.
రావిచెట్టులోని అణువణువూ నారాయణ స్వరూపమేనని ఆగమశాస్త్రాలు కూడా చెబుతున్నాయి. ఈవిషయాన్ని స్కందపురాణం కూడా చెబుతోంది. అందుకే శ్రీకృష్ణుడ్ని వటపత్రసాయి అంటారు. పసిబిడ్డకు జోలపాడేటప్పుడు వటపత్రసాయికి వరహాలలాలి అని పాట పాడుతూ నిద్రపుచ్చటం గతంలో చూసేవాళ్లు. ఇప్పటి వాళ్లకి ఇది తెలియక పోవచ్చు. జ్యోతిష్యశాస్త్రంలో రావిచెట్టుకి ఓ ప్రత్యేకత ఉంది. శనిదోషం పోవాలంటే ప్రతీ రోజూ నీడన నిలబడాలి. నమస్కరించాలి. కౌగలించుకోవాలందరూ. ఈవిధంగా కొన్ని రోజులు చేస్తే శనిదోషం తొలగిపోతుందని నమ్మకం.
రావిచెట్టు కొమ్మలతో యజ్ఞయాగాలు చేస్తారు. సన్యాసులు రావిచెట్టును కర్రను దండంగా చేసుకుంటారు. రావి చెట్టు నీడన కాసేపు కూర్చుంటే బీపీ తగ్గుతుంది. రావి చెట్టు గాలి మంచి ఆలోచలను కలిగిస్తుంది. శుద్ధోధనుని కుమారుడైన సిద్దార్ధుడు ఎన్నో సంవత్సరాలు ఎందరినో సేవించినా కలగని జ్ఞానోదయం, రావిచెట్టు కింద విశ్రమించిన తర్వాతే మహాజ్ఞానోదయం కలిగి బుద్ధుడు అయ్యాడు . అందువల్లనే రావిచెట్టును బోధి వృక్షం అంటారు. బౌద్ధ మతస్థులకు ఈ చెట్టు మహా పవిత్రమైంది. శ్రీకృష్ణుడు చివరి దశలో ఈ వృక్షం కిందనే విశ్రమించి ప్రాణత్యాగం చేశాడు.
వేపవృక్షం కూడా ఎన్నో ఔషధ గుణాలను కలిగిన దివ్య వృక్షం. వేప చెట్టులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయని పలు సందర్భాల్లో నిరూపితమైంది. వేప ఆకును ఎన్నో రోగాలకు మందుగా వాడతారు. వేప చెట్టు గాలికి ఎన్నో రోగకారకాల క్రిములు నశించిపోతాయి. వేపాకులను నీటిలో కాచి తాగినా, స్నానం చేసినా చర్మవ్యాధుల సూక్ష్మ క్రిములు నశిస్తాయి. వేప, రావి చెట్లు దివ్యశక్తులున్న వృక్షాలు కాబట్టి రావిచెట్టును, వేపచెట్టును దేవాలయాల్లో ప్ర్తత్యేకంగా నాటి పూజిస్తారు. అయితే రావి చెట్టును మాత్రం ఇండ్ల వద్ద నాటకూడదు. వేపచెట్టును మాత్రం ఇంటికి ముందు కానీ, వెనుక కానీ నాటవచ్చు. ఈ రెండు చెట్లను లక్ష్మీనారాయణలుగా భావించి పెళ్లిళ్లు కూడా చేస్తుంటారు.