Side Effects of Night Shift Duty: ప్రస్తుత కాలంలో 24*7 పని చేయడం సంస్కృతిగా మారిపోయింది. పగలు, రాత్రి తేడా లేకుండా పనులు చేయాల్సి వస్తుంది. వారి లక్ష్యాలను చేరుకునేందుకు పడాల్సిన కష్టానికి మించి రెట్టింపు శ్రమ చేస్తున్నారు. ఈ తరుణంలో రాత్రంతా మేలుకుని పనులు చేస్తున్నారు. వృత్తిపరమైన జీవితానికి నైట్ కల్చర్ మంచిదే అయినప్పటికీ, అది ఆరోగ్యానికి చాలా ప్రమాదకరంగా మారుతుంది. రాత్రిపూట పని చేయడం వల్ల మధుమేహం, గుండె జబ్బులు, ఊబకాయం వంటి అనేక ప్రాణాంతక వ్యాధుల బారిన పడవచ్చు. తాజా అధ్యయనంలో ఈ షాకింగ్ విషయం వెల్లడైంది. కేవలం కొన్ని రోజుల పాటు చేసే నైట్ షిఫ్ట్ కూడా రోగాల పాలు చేసే అవకాశాలు ఉన్నాయని తేలింది.
అమెరికాలోని వాషింగ్టన్ స్టేట్ యూనివర్శిటీ చేసిన తాజా అధ్యయనంలో రాత్రి షిఫ్టులలో పని చేయడం వల్ల మన రక్తంలో గ్లూకోజ్‌ని నియంత్రించే ప్రొటీన్ లయకు అంతరాయం కలుగుతుందని వెల్లడించింది. ఇది శరీరం యొక్క శక్తి జీవక్రియకు అంతరాయం కలిగిస్తుంది. ఇది టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని పెంచుతుంది. కేవలం 3 నైట్ షిఫ్ట్‌లు చేయడం ద్వారా మధుమేహం, ఊబకాయం, ఇతర జీవక్రియ రుగ్మతల బారిన పడతారని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. రాత్రిపూట మేల్కొని పని చేయడం వల్ల మెదడు ప్రధాన జీవ గడియారం చెదిరిపోతుంది. ఇది ఒత్తిడిని పెంచుతుంది, కొన్నిసార్లు నిరాశకు దారితీస్తుంది.
Also Read: Mobile Phone: ఫోన్ పక్కన పెట్టుకుని పడుకుంటున్నారా.. అయితే ఈ సమస్యలు తప్పవు !
ఈ అధ్యయనం ప్రోటీమ్ రీసెర్చ్ జర్నల్‌లో ప్రచురించబడింది. పరిశోధనలో పాల్గొన్న నైట్ షిఫ్ట్ కార్మికుల రక్త నమూనాలను తీసుకుని వాటిని పరిశీలించగా పలు ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చినట్లు పరిశోధకులు చెబుతున్నారు. ఇతర వ్యక్తులతో పోలిస్తే రాత్రిపూట పనిచేసే వ్యక్తులలో ఇన్సులిన్ ఉత్పత్తి, సున్నితత్వంలో గణనీయమైన వ్యత్యాసం ఉంది. మధుమేహం మాత్రమే కాదు, రాత్రిపూట మెలకువగా ఉండి రాత్రిపూట షిఫ్టులు చేసే వారిలో రక్తపోటు పెరుగుతుందని, దీని వల్ల గుండె జబ్బులు, పక్షవాతం వచ్చే ప్రమాదం ఉందని గతంలో అనేక పరిశోధనల్లో వెల్లడైంది.
రాత్రిపూట ఆహారం తీసుకోవడం వల్ల శరీరంలోని జీవక్రియలు మారిపోతాయని మరో అధ్యయనంలో తేలింది. ముఖ్యంగా, ఇది రక్తంలో చక్కెర లేదా గ్లూకోజ్‌ను ప్రాసెస్ చేసే మీ సామర్థ్యాన్ని దెబ్బతీస్తుంది. ఈ పరిశోధనలో, పగటిపూట మాత్రమే తినడం వల్ల రాత్రిపూట పని చేయడంతో సంబంధం ఉన్న అధిక చక్కెర స్థాయిలను నిరోధించవచ్చని పరిశోధకులు కనుగొన్నారు. రాత్రిపూట మేల్కొని పని చేయడం వల్ల మన శరీరం యొక్క సిర్కాడియన్ రిథమ్ దెబ్బతింటుందని మరియు మొత్తం ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని ఆరోగ్య నిపుణులు భావిస్తున్నారు. ప్రజలు రాత్రి షిఫ్టులకు దూరంగా ఉండాలి.