Honey Face Pack: తేనె ఎన్నో ఔషధ గుణాలతో నిండి ఉంది. అందుకే ఆయుర్వేదంలో కూడా తేనెను ఉపయోగిస్తారు. తేనె ఆరోగ్యానికే కాదు చర్మ సౌందర్యానికి కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. తేనెతో తయారు చేసిన ఫేస్ ప్యాక్‌లు ముఖం యొక్క మెరుపును పునరుద్ధరించడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయి. తేనెలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలతో పాటు యాంటీ ఆక్సిడెంట్లు వయసు పెరుగుతున్నా కూడా చర్మాన్ని యవ్వనంగా ఉంచడంలో సహాయపడతాయి.
తేనెతో అనేక రకాల ఫేస్ ప్యాక్‌లను తయారు చేసుకోవచ్చు. తేనెలో పసుపు, నిమ్మ, పెరుగు, ఓట్స్ కలిపి వివిధ రకాల ఫేస్ ప్యాక్‌లు తయారు చేసుకుని వాడటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. వీటిని రెగ్యులర్ గా ముఖానికి అప్లై చేయడం వల్ల చర్మం మెరుస్తుంది. అంతే కాకుండా ముఖంపై మొటిమలు, మచ్చలు రాకుండా ఉంటాయి.
1.తేనె, పెరుగు ఫేస్ ప్యాక్:
ఈ ఫేస్ ప్యాక్ కోసం ఒక గిన్నెలో ఒక చెంచా తేనె , రెండు చెంచాల పెరుగును వేసి కలపండి. తేనె, పెరుగు బాగా కలిసిన తర్వాత ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేయాలి. 15-20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయండి. ఈ ఫేస్ ప్యాక్‌ని ముఖానికి అప్లై చేయడం వల్ల చర్మం మృదువుగా మారుతుంది. అంతే కాకుండా ముఖంపై ఉండే ట్యాన్ తగ్గుతుంది. దీనితో పాటు ముఖంపై ఉండే మృతకణాలు కూడా తొలగిపోతాయి. తేనె, పెరుగుతో తయారు చేసిన ఫేస్ ప్యాక్ చర్మం కాంతివంతంగా కనిపించేలా చేస్తుంది.
2.తేనె, నిమ్మకాయ ఫేస్ ప్యాక్:
ఒక గిన్నెలో ఒక చెంచా తేనె, అర చెంచా నిమ్మరసం తీసుకుని మిశ్రమాన్ని తయారు చేయండి. తర్వాత ముఖంపై దీనిని సున్నితంగా అప్లై చేయండి. ఈ ఫేస్ ప్యాక్‌ను 15 నిమిషాల పాటు అలాగే ఉంచి, ఆపై గోరువెచ్చని నీటితో శుభ్రం చేయండి. ఈ ఫేస్ ప్యాక్ ముఖంపై ఉండే మచ్చలను తగ్గిస్తుంది. అంతే కాకుండా చర్మం కాంతివంతంగా మారేందుకు ఉపయోగపడుతుంది మొటిమలను కూడా తగ్గిస్తుంది. తేనె, నిమ్మకాయతో చేసిన ఈ ఫేస్ ప్యాక్ ముఖానికి అద్భుతమైన మెరుపును తెస్తుంది.
3.తేనె, పసుపు ఫేస్ ప్యాక్:
పసుపు, తేనె రెండింటిలోనూ యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. ఒక గిన్నెలో ఒక చెంచా తేనె, పావు చెంచా పసుపును వేసి మిశ్రమంలా తయారు చేసుకోండి . ఈ పేస్ట్‌ను ముఖంపై అప్లై చేసి 20 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. ఆ తర్వాత నీటితో కడగాలి. ఈ ఫేస్ ప్యాక్ స్కిన్ ఇన్ఫెక్షన్‌ని తొలగించి, ముఖానికి కొత్త మెరుపును తెస్తుంది.
Also Read: ఈ ఫేస్ ప్యాక్‌తో మొటిమలు మాయం !
4. తేనె, ఓట్స్ ఫేస్ ప్యాక్:
ముందుగా ఓట్స్ ను గ్రైండ్ చేసి పౌడర్ చేసుకోవాలి. ఒక గిన్నెలో రెండు చెంచాల ఓట్స్ పౌడర్, కొద్దిగా పాలు, ఒక చెంచా తేనెను వేసి వీటిని మిశ్రమంలాగా తయారు చేసుకోవాలి. ఈ ఫేస్ ప్యాక్‌ని ముఖానికి పట్టించి 15-20 నిమిషాల తర్వాత కడిగేయాలి. దీన్ని ముఖానికిఅప్లై చేయడం వల్ల చర్మం మృదువుగా, మెరిసిపోతుంది. ఓట్స్ , తేనెతో చేసిన ఈ ఫేస్ ప్యాక్ చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేస్తుంది. ఫలితంగా మీ ముఖం రెట్టింపు అందంగా తయారవుతుంది.
(గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించినది. bigtvlive.com దీనిని ధృవీకరించదు.)