Rice Dosa: అన్నం మిగిలిపోవడం ప్రతి ఇంట్లో జరిగే ప్రక్రియే. రాత్రి అన్నం మిగిలిపోతే ఉదయం బయట పడేస్తారు. ఉదయం మిగిలిపోయిన అన్నాన్ని రాత్రి తినేందుకు ఎంతో మంది ఇష్టపడరు. నిజానికి రాత్రి వండిన అన్నం ఉదయం తింటే ఎంతో ఆరోగ్యం. అలాగే ఉదయం వండిన అన్నం రాత్రి తిన్నా కూడా ఆరోగ్యమే. వేసవికాలంలో అన్నం బయట ఉంచితే త్వరగా పాడైపోయే అవకాశం ఉంటుంది. కానీ చలికాలంలో అది త్వరగా పాడవదు. కాబట్టి ఆ అన్నం తినడం సురక్షితమే. మీకు మిగిలిపోయిన అన్నాన్ని తినడం ఇష్టం లేకపోతే వాటిని దోశలుగా మార్చేయండి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. పైగా ఇన్స్టెంట్ దోశలు, కొబ్బరి చట్నీతో లేదా టమాటో చట్నీతో ఈ దోశలను తింటే చాలా రుచిగా ఉంటాయి. ఒక్కసారి మీరు చేసుకొని చూడండి. ఈ రెసిపీ మీ ఇంటిల్లిపాదికి నచ్చడం ఖాయం.
కావలసిన పదార్థాలు
మిగిలిపోయిన అన్నం – రెండు కప్పులు
నీరు – సరిపడినంత
వంటసోడా – అర స్పూను
ఉప్పు – రుచికి సరిపడా
పుల్లని పెరుగు – ఒక కప్పు
గోధుమపిండి – ఒక కప్పు
ఉప్మా రవ్వ – ఒక కప్పు
మిగిలిన అన్నంతో దోశల రెసిపీ
1. ముందుగా అన్నాన్ని పొడిపొడిగా ఉండేలా చూసుకోండి.
2. మిక్సీలో ఈ అన్నాన్ని గోధుమ పిండిని వేసి బాగా కలపండి.
3. అందులోనే నీళ్లను కూడా వేయండి. అలాగే పుల్లని పెరుగును కూడా వేసి బాగా కలపండి.
4. ఈ మొత్తం మిశ్రమాన్ని పంపండి. దీన్ని ఒక గిన్నెలో వేయండి.
5. ఆ గిన్నెలోనే ఉప్మా రవ్వను కూడా వేసి బాగా కలుపుకోండి.
6. రుచికి సరిపడా ఉప్పుని, వంట సోడాను కూడా వేయండి.
7. దోశెలు వేయడానికి ఈ మిశ్రమం పలుచగా ఉండేలా చూసుకోండి.
8.అవసరమైతే నీటిని కలపండి. ఈ మొత్తం మిశ్రమాన్ని ఒక పది నిమిషాలు పాటు పక్కన వదిలేయండి.
9. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టి నూనె రాయండి.
10. ఆ నూనె పై ఈ దోశల పిండిని పలుచగా వచ్చేలా వేసుకోండి.
11. రెండు వైపులా కాల్చాక తీసి పక్కన పెట్టుకోండి. అంతే టేస్టీ దోశెలు రెడీ అయినట్టే. దీన్ని కొబ్బరి చట్నీతో తిన్నా అల్లం చట్నీతో తిన్నా టమోటా చట్నీ తో తిన్నా రుచిగా ఉంటాయి. అన్నం మిగిలిపోయినప్పుడు పడేయాల్సిన అవసరం లేకుండా ఇలా దోశలు వండుకుంటే రుచి అదిరిపోతుంది.
Also Read: నిద్రపోయే ముందు ప్రొటీన్ షేక్ తాగితే ఏమవుతుందో తెలుసుకోండి
హిందువులు అన్నాన్ని పరబ్రహ్మ స్వరూపంగా చెప్పకుంటారు. అలాంటి అన్నాన్ని బయటపడేస్తే మేలు జరగదని నమ్ముతారు. అందుకే అన్నం మిగిలిపోయినప్పుడు బయట పడేసే కన్నా దాన్ని తిరిగి వినియోగించుకోవడం ఉత్తమం. మిగిలిపోయిన అన్నంతో ఎగ్ రైస్, లెమన్ రైస్ వంటివి చేస్తూ ఉంటారు. కానీ అవి కూడా అన్నం రూపంలోనే ఉంటాయి. కాబట్టి తినేందుకు ఇష్టపడరు. ఇలా దోశల రూపంలో మార్చుకుంటే చాలా సులువుగా తినేయొచ్చు. పైగా పిల్లలు కూడా దీన్ని ఇష్టంగా తింటారు. ఇవి క్రిస్పీగా వస్తాయి. మీరు ఒక్కసారి వీటిని వండుకొని చూడండి. ఇవి మీకు కచ్చితంగా నచ్చుతాయి.