డయాబెటిస్ పేషెంట్లు తమ ఆరోగ్యం కోసం కొన్ని రకాల ఆహారాలను ప్రత్యేకంగా తినాలి. వాటిలో కాకరకాయ ఒకటి. కాకరకాయతో చేసే వంటకాలు ఎక్కువ మందికి నచ్చవు. కానీ దీన్ని తినడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. ఇక్కడ మేము డయాబెటిస్ రోగుల కోసం ప్రత్యేకంగా కాకరకాయ కారం రెసిపీ ఇచ్చాము. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. పైగా ఇది రక్తంలో చక్కర స్థాయిలను అదుపులో ఉంటుంది. కేవలం డయాబెటిస్ ఉన్నవారే కాదు లేని వారు కూడా ఈ రెసిపీని తినవచ్చు.
కాకరకాయ కారం రెసిపీకి కావాల్సిన పదార్థాలు
కాకరకాయలు – అరకిలో
పసుపు – ఒక స్పూను
ఉప్పు – రుచికి సరిపడా
మజ్జిగ – ఒక కప్పు
చింతపండు – చిన్న ఉసిరికాయ సైజులో
నూనె – తగినంత
కారం – ఐదు స్పూన్లు
వెల్లుల్లి రెబ్బలు – అరకప్పు
జీలకర్ర – ఒక స్పూన్
ధనియాలు – ఒక స్పూన్
మినపప్పు – ఒక స్పూన్
శనగపప్పు – రెండు స్పూన్లు
కాకరకాయ కారం రెసిపీ
1. ముందుగా కాకరకాయలను పైన చెక్కు తీసి గుండ్రంగా పలచగా కోసుకోవాలి.
2. ఒక గిన్నెలో ఆ కాకరకాయ ముక్కలను వేసి పసుపు, ఉప్పు కలిపి చేత్తోనే బాగా కలపాలి.
3. ఒక అరగంట పాటు పక్కన పెట్టేయాలి. ఆ ముక్కలు ఊరి మెత్తగా అవుతాయి.
4. అప్పుడు చేత్తోనే వాటిని పిండి పక్కన పెట్టుకోవాలి.
5. ఆ నీటిని పడేయవచ్చు. కాకరకాయలో ఉన్న చేదును కొంతమేరకు తీసేస్తుంది.
6. ఇప్పుడు పక్కన పెట్టుకున్న కాకరకాయలను ఒక గిన్నెలో వేసి పుల్లని మజ్జిగ వేసి బాగా కలుపుకోవాలి.
7. ఆ పుల్లని మజ్జిగలోనే చింతపండు గుజ్జును కూడా వేసి ఒకసారి కలిపి స్టవ్ మీద పెట్టాలి.
8. ఇది మొత్తం మజ్జిగ ఇగిరిపోయేదాకా ఉంచి అప్పుడు స్టవ్ ఆఫ్ చేయాలి.
9. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి.
10. ఆ నూనెలో శెనగపప్పు, మినప్పప్పు, ధనియాలు, జీలకర్ర వేసి వేయించుకోవాలి.
11. ఈ వేయించుకున్న మొత్తాన్నిమిక్సీలో వేయాలి.
12. వెల్లుల్లి రెబ్బలు, రుచికి సరిపడా ఉప్పు కూడా వేసి కచ్చాపచ్చాగా రుబ్బుకోవాలి. అంతే వెల్లుల్లి కారం రెడీ అయినట్టే.
13. ఇప్పుడు మరొక కళాయిని స్టవ్ మీద పెట్టి నూనె వేయాలి.
14. ఆ నూనెలో ముందుగా మజ్జిగలో ఉడికించుకున్న కాకరకాయ ముక్కలను వేసి చిన్న మంట మీద వేయించుకోవాలి.
15. కాకరకాయ ముక్కలు పొడిపొడిగా అయ్యేవరకు వేయించాలి.16. ఆ తర్వాత రుబ్బుకున్న వెల్లుల్లి కారం కూడా వేసి బాగా కలపాలి.
17. స్టవ్ కట్టేసి ఆ మిశ్రమాన్ని చల్లార్చాలి. అంతే కాకర కాయ కారం రెడీ అయింది.
రెండు మూడు గంటల పాటు కాకరకాయ కారాన్ని చల్లార్చాలి. గాలి చొరబడని డబ్బాలో వేసి దాచుకుంటే నెలరోజుల పాటు నిల్వ ఉంటుంది. ప్రతిరోజూ రెండు ముద్దలు ఈ కాకరకాయ కారం తో తింటే ఎంతో మంచిది.
Also Read: టేస్టీ శెనగపప్పు ఆమ్లెట్ కర్రీ, వేడివేడి అన్నంలో కలుపుకుని తిని చూడండి, రెసిపీ అదుర్స్
కాకరకాయలు ఆరోగ్యానికి ఎంతో మంచిది. వీటిలో యాంటీ ఆక్సిడెంట్ అధికంగా ఉంటాయి. వీటిని తినడం వల్ల శరీరంలో ఉన్న కొవ్వు శాతం కూడా తగ్గుతుంది. బరువు తగ్గడానికి కూడా కాకరకాయలు ఎంతో ఉపయోగపడతాయి. కేవలం డయాబెటిస్ తో బాధపడుతున్న వారే కాదు, డయాబెటిస్ లేని వారు కూడా కాకరకాయను కచ్చితంగా తినాలి. దీనివల్ల వారి కంటి చూపు మెరుగుపడుతుంది. పొట్ట సమస్యలు రాకుండా ఉంటాయి. అజీర్ణం, పొట్ట ఉబ్బరం, మంట వంటివి రాకుండా ఉంటాయి. కాబట్టి కాకరకాయను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల అన్ని రకాల ప్రయోజనాలు కలుగుతాయి.