Prolonged Desk job Health Risk | వారానికి 70-90 గంటల పనిపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో, ఒక వ్యక్తి వారానికి 60 గంటలకు మించి పని చేస్తే, అది ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆర్థిక సర్వే తెలిపింది. ఈ అంశంపై వెలువడిన అనేక పరిశోధనలను సర్వే ఉదహరించింది. సర్వే ప్రకారం…
రోజుకు 12 గంటలు లేదా అంతకు మించి కూర్చుని పనిచేసే వారు (డెస్క్ వర్క్) తీవ్ర నిరాశ లేదా మానసిక ఒత్తిడికి గురవుతున్నారు.
వారానికి 55-60 గంటలకు మించి పని చేస్తే, తీవ్ర ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయని ‘పెగా ఎఫ్ నఫ్రాది బి (2021)’ సర్వే, డబ్ల్యూహెచ్ఓ/ఐఎల్ఓ సంయుక్త అంచనాలు తెలిపాయి.
ఎక్కువ సేపు కూర్చుని పనిచేయడం మానసిక ఆరోగ్యానికి హాని కలిగిస్తుందని సేపియన్ ల్యాబ్స్ సెంటర్ ఫర్ హ్యూమన్ బ్రెయిన్ అండ్ మైండ్ సర్వే తేల్చింది. డెస్క్‌లో 12 గంటలు లేదా అంతకు మించి పనిచేసే వారి మానసిక ఆరోగ్య స్థాయి, వారి కంటే రెండు గంటలు తక్కువ పనిచేసే వారితో పోలిస్తే 100 పాయింట్లు తక్కువగా ఉంటుంది.
భారతదేశం తన ఆర్థిక లక్ష్యాలను సాధించాలంటే, ప్రజల జీవనశైలి ఎంపికలపై త్వరగా దృష్టి సారించాలి. పిల్లలు మరియు యువతలో ఈ జీవనశైలి ఎంపికలు ప్రారంభమవుతున్నాయి. కఠినమైన పని సంప్రదాయాలు, అదనపు పని గంటల వల్ల మానసిక ఆరోగ్యంపై ప్రభావం పడుతోంది. ఇది ఆర్థిక వృద్ధి వేగానికి అడ్డంకులను సృష్టిస్తోంది.
Also Read: టాయిలెట్ లో ఎక్కువ సమయం గడిపితే ఆరోగ్యానికి ప్రమాదం.. హెచ్చరిస్తున్న వైద్యులు
ఒత్తిడి వల్ల ఏటా లక్ష కోట్ల డాలర్ల నష్టం
మానసిక వ్యాకులత, ఆందోళన కారణంగా అంతర్జాతీయంగా ఏటా 1,200 కోట్ల పని దినాలు నష్టపోతున్నాం. దీని వల్ల సుమారు 1 లక్ష కోట్ల డాలర్ల నష్టం ఎదురవుతోంది.
జంక్ ఫుడ్ వల్ల మానసిక ఆరోగ్యంపై ప్రభావం
అల్ట్రా-ప్రాసెస్డ్ లేదా ప్యాకేజ్డ్ జంక్ ఫుడ్‌ను తరచుగా తీసుకునే వారితో పోలిస్తే, వీటిని తక్కువగా తీసుకునే వారి మానసిక ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.
వ్యాయామాలు చేయకుండా, ఎక్కువగా సెల్‌ఫోన్‌లో సామాజిక మాధ్యమాలు చూస్తూ గడిపే వారి లేదా కుటుంబంతో పెద్దగా సమయం గడపని వారి మానసిక ఆరోగ్యం అధ్వానంగా మారుతోంది. ఆస్ట్రేలియాలో 16 ఏళ్ల లోపు పిల్లలను సామాజిక మాధ్యమాలు చూడకుండా నిషేధించడం ద్వారా, పిల్లలపై ఫోన్‌ల ప్రభావం ఎంత తీవ్రమైనదో తెలుస్తోంది.
అల్ట్రా-ప్రాసెస్డ్ ఫుడ్స్‌ను అరికట్టాలి
వీటిపై అధిక జీఎస్‌టీ, కఠిన ప్రమాణాలు అవసరం
అల్ట్రా-ప్రాసెస్డ్ ఫుడ్స్ (యూపీఎఫ్‌లు) వినియోగాన్ని తగ్గించేందుకు కఠినమైన ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ లేబులింగ్ నిబంధనలు అమలు చేయాలని, వాటిపై జీఎస్‌టీ పెంచాలని ఆర్థిక సర్వే సూచించింది. వీటి వినియోగం తగ్గేలా అవగాహన కార్యక్రమాలు అమలు చేయాలని కూడా సలహా ఇచ్చింది. పోషకాహారమంటూ యూపీఎఫ్‌లపై ప్రచారం చేస్తున్న తప్పుడు సమాచారాన్ని అడ్డుకోవాలని సర్వే తెలిపింది. వీటి నిర్వచనం, ప్రమాణాల విషయంలో ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ స్పష్టత తీసుకురావాలని కోరింది. చక్కెర, ఉప్పు, సాచురేటెడ్ ఫ్యాట్స్ విషయంలో న్యూట్రియంట్ పరిమితులను ఆరోగ్య శాఖ తక్షణం విధించాలని సూచించారు. 18 ఏళ్లలోపు వారిని లక్ష్యంగా చేసుకుని, విడుదల చేస్తున్న అనారోగ్యకర ఆహారాలపై కఠినమైన మార్కెటింగ్ నిబంధనలు విధించాలని సూచనలు చేసింది.
స్థానిక, సీజనల్ పళ్లు, కూరగాయలు తినడం అలవాటు చేసుకోవాలి. చిరుధాన్యాలు (మిలెట్స్), పళ్లు, కూరగాయల వినియోగం పెరిగేలా సానుకూల సబ్సిడీలను అందించాలని ప్రభుత్వాలకు కూడా ఈ సర్వే సూచించింది.