Union Budget 2025 : బడ్జెట్ వచ్చిందంటే కొన్ని వస్తువులు, రంగాలపై పన్నులు భారం పడితే.. మరికొన్నింటిపై పన్ను భారాలు, ప్రత్యేక రాయితీలు అందుతుంటాయి. దీంతో.. ఆయా రంగాల్లోని ఉత్పత్తులు, సేవలపై ధరల్లో హెచ్చుతగ్గులు ఉంటుంటాయి. ఈ నేపథ్యంలోనే ఈ సారి బడ్జెట్ లో కేంద్ర విత్తమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన బడ్జెట్ వరాలు, వడ్డింపుల నేపథ్యంలో ఏఏ వస్తువుల ధరలు తగ్గుతాయి, ఏ వస్తువుల ధరలు పెరుగుతాయో తెలుసుకోవాలనే ఆసక్తి అన్ని వర్గాల ప్రజలకు ఉంటుంది. ఈ వివరాలు మీరు కూడా తెలుసుకొండి..
ధరలు తగ్గే వస్తువులు..
ఆరోగ్య సంరక్షణ, ఉత్పాదక రంగాలలో అనేక ముఖ్యమైన ఉత్పత్తులను మరింత చౌకగా అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రాథమిక కస్టమ్స్ డ్యూటీ (BCD)లో మినహాయింపులు, తగ్గింపులను ప్రతిపాదించింది. దీంతో..
లైఫ్ సేవింగ్ డ్రగ్స్, మెడిసిన్స్
36 క్యాన్సర్, అరుదైన వ్యాధుల ఔషధాలు : యూనియన్ బడ్జెట్ 2025 క్యాన్సర్ చికిత్సలో, అరుదైన వ్యాధులకు ఉపయోగించే 36 ఔషధాలను ప్రాథమిక కస్టమ్స్ డ్యూటీ నుంచి మినహాయించాలని ప్రతిపాదించింది. ఈ చర్యతో రోగులపై ఆర్థిక భారాన్ని తగ్గించి, ప్రాణాలను రక్షించే మందులను పేద, మధ్య తరగతి వర్గాలకు అందుబాటులో ఉండే అవకాశం ఉంటుందని కేంద్రం ఆర్థిక మంత్రి అభిప్రాయపడ్డారు.
37 రకాల ఔషధాలు : ఆరోగ్య సంరక్షణ రంగానికి మరింత ఉపశమనాన్ని అందిస్తూ అదనంగా 37 ఔషధాలు కూడా BCD నుంచి కేంద్ర ఆర్థిక మంత్రి మినహాయింపు అందించారు. ఈ తగ్గింపులతో అన్ని వర్గాల వారికి నాణ్యమైన, తక్కువ ధరలోనే ఔషధాలు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కేంద్రం చేస్తున్న ప్రయత్నాల్లో ఇదో ముందడుగు అని కేంద్రం తెలిపింది.
తయారీ రంగానికి మద్దతు
క్లిష్టమైన మినరల్స్ : ప్రాథమిక కస్టమ్స్ డ్యూటీ నుంచి కోబాల్ట్ ఉత్పత్తులు, LED లు, జింక్, లిథియం-అయాన్ బ్యాటరీ స్క్రాప్, 12 ఇతర కీలకమైన ఖనిజాలను పూర్తిగా మినహాయించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ మినహాయింపు ఎలక్ట్రానిక్స్, బ్యాటరీ ఉత్పత్తి వంటి తయారీ పరిశ్రమలకు అవసరమైన ముడి పదార్థాల ధరను తగ్గించడం లక్ష్యంగా పెట్టుకుంది. కాగా.. ఇది అమల్లోకి వస్తే.. ఎలక్ట్రికల్ వాహనాల ధరలు భారీగా తగ్గే అవకాశాలున్నాయి. అలాగే.. పౌర ఫలకాల ధరలు సైతం భారీగా తగ్గి అందరికీ అందుబాటు ధరల్లోకి సోలార్ ప్యానళ్లు వస్తాయని విశ్లేషిస్తున్నారు.
షిప్‌బిల్డింగ్ రా-మెటీరియల్స్ : నౌకల తయారీకి సంబంధించిన ముడి పదార్ధాలపై కేంద్ర ప్రభుత్వం బేసిక్ కస్టమ్ డ్యూటీ (BCD) మినహాయించింది. రానున్న పదేళ్ల పాటు ఈ మినహాయింపు కొనసాగుతుందని కేంద్ర మంత్రి వెల్లడించారు. దీంతో.. దేశీయంగా భారీ ఎత్తున తయారీ చేస్తున్న నౌకలు, షిఫ్ ల బడ్జెట్ భారీగా తగ్గే అవకాశం ఉంది. ఇది పరోక్షంగా… రక్షణ రంగానికి, నౌకా దళానికి సంబంధించిన భారీ నౌకల తయారీ సమయంలో ఉపయోగపడనుంది. మేక్ ఇన్ ఇండియా విధానాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ఈ విధానం ఉపయోగపడుతుందని కేంద్రం భావిస్తోంది.
హస్తకళల వస్తువులు
దేశంలోని అన్ని ప్రాంతాల్లో విభిన్న రూపాల్లో హస్త కళలు ఉన్నాయి. భారత వైవిధ్యాన్ని, సంస్కృతిని వెల్లడించే ఈ కళలకు అంతర్జాతీయ వేదికలపై ప్రత్యేక స్థానం కల్పించాలని కేంద్రం భావిస్తోంది. అందులో భాగంగానే.. హస్తకళల ఎగుమతికి మరింత మద్దతునిచ్చేందుకు నిర్ణయించింది. ఈ రంగంలోని ఉత్పత్తుల ఎగుమతులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఒక పథకాన్ని ప్రకటించింది. ఇది ప్రపంచ మార్కెట్‌లో హస్తకళలను మరింత పోటీపడేలా చేస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.
లెదర్ ఉత్పత్తులు
వెట్ బ్లూ లెదర్ : తోలు ఉత్పత్తలకు సైతం కస్టమ్స్ డ్యూటీ నుంచి కేంద్ర ప్రభుత్వం మినహాయింపునిచ్చింది. ముఖ్యంగా.. తడి నీలి రంగు తోలును బేసిక్ కస్టమ్స్ డ్యూటీ నుంచి పూర్తిగా మినహాయిస్తు కేంద్ర ఆర్థిక మంత్రి ప్రతిపాదనలు పార్లమెంట్ ముందు ఉంచారు. తయారీదారులకు ఇన్‌పుట్ ఖర్చులను తగ్గించడం ద్వారా తోలు పరిశ్రమకు సహాయం చేసినట్లు అవుతుందని తెలిపారు.
నిల్వ చేపలు
చేపల పాశ్చరీపై కస్టమ్స్ సుంకం 30% నుంచి 5%కి తగ్గించాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రతిపాదించారు. ఈ నిర్ణయంతో ప్రాసెసింగ్, పంపిణీకి మరింత సులువవుతుందని, ఆహారం, వ్యవసాయ రంగాలకు ప్రయోజనం చేకూరుస్తుందన కేంద్ర మంత్రి వెల్లడించారు.
ఖరీదైన వస్తువులు
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ద్వారా అనేక రంగాల్లోని ఉత్పత్తులపై అదనపు భారం పడనుండగా.. పరోక్షంగా ఆయా రంగాల్లోని వస్తువులు, ఉత్పుత్తుల ధరలు భారీగా పెరగనున్నాయి. ఇందులో.. టెక్, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లు ఖరీదైనవిగా మారే జాబితాలో ఉన్నాయి.
ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్ డిస్‌ప్లే
అనేక ఎలక్ట్రానిక్స్ పై కేంద్ర ప్రభుత్వం పన్నులు పెంచింది. ఇందులో.. ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్ డిస్‌ప్లేలపై ప్రాథమిక కస్టమ్స్ డ్యూటీని 10% నుంచి 20%కి పెంచాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రతిపాదించారు. ఈ నిర్ణయంతో విదేశాల నుంచి తక్కువ ధరలకే దేశీయ మార్కెట్లోకి అడుగుపెడుతున్న ఉత్పత్తులను క్రమంగా నిరోధించి దేశీయ తయారీదారులకు ప్రయోజనం చేకూర్చాలనే ఉద్దేశ్యం ఉందని కేంద్ర తెలిపింది. ఈ ప్రతిపాదన ద్వారా దేశీయ ఉత్పత్తి దారులకు సమాన అవకాశాలు కల్పించినట్లవుతుందని వెల్లడించింది.