కొందరికి మాత్రమే బట్టతల వస్తుంది. మరికొందరికి జుట్టు ఒత్తుగా ఉంటుంది. ఇంకొందరులో వెంట్రుకలు రాలిపోయి జుట్టు పలుచగా అనిపిస్తుంది. ఇలా వ్యక్తికి ఓ రకంగా జుట్టు ఎందుకు పెరుగుతుంది? దీనికి ఎన్నో కారణాలు ఉన్నాయి. చుండ్రు, ఒత్తిడి, జన్యుపరమైన కారణాలు, పోషకాలు లోపించడం తలలో అదనపు నూనె ఉత్పత్తి కావడం వంటివన్నీ కూడా జుట్టు రాలడానికి కారణాలే.
జన్యుపరమైన కారణాలను అడ్డుకోవడం కష్టం. కానీ మిగతా వాటిని మాత్రం మనం జాగ్రత్తపడితే అడ్డుకోవచ్చు. ఈ రోజుల్లో జుట్టు రాలడం సర్వసాధారణమైపోయిందని ఎంతోమంది ఆ విషయాన్ని పట్టించుకోరు. కానీ పిల్లలు, యువతలో కూడా జుట్టు రాలడం ఎక్కువైపోయింది. రోజుకు 50 నుంచి 100 వెంట్రుకలు రాయడం అనేది సాధారణమే. కానీ అంతకుముంచి రాలుతూ ఉంటే మాత్రం జాగ్రత్త పడాలి. అది బట్టతలకు సూచన కావచ్చు. లేదా ఏదైనా వ్యాధికి కారణం కావచ్చు. కాబట్టి పిల్లలు యవ్వనంలో ఉన్న వారిలో జుట్టు అధికంగా రాలుతూ ఉంటే వైద్యులను సంప్రదించి తగిన కారణాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.
మనం చేసే కొన్ని తప్పులు కూడా జుట్టు రాలడానికి కారణం అవుతాయి. వాటిల్లో కొన్ని ముఖ్యమైనవి ఇక్కడ ప్రస్తావించాము. మీకు జుట్టు రాలుతూ ఉంటే వీటిలో ఏదైనా కారణం కావచ్చు.
బాల్యంలో సరైన పోషకాహారాన్ని అందించకపోయినా కూడా జుట్టు పెరుగుదలపై ఆ ప్రభావం పడుతుంది. జుట్టు పెరుగుదలకు విటమిన్ డి, ఒమేగా త్రీ ఫ్యాటీ ఆమ్లాలు, ఐరన్ నిండుగా కావాలి. ఆ పోషకాలు ఎప్పుడైతే లోపిస్తాయో అప్పుడు జుట్టు బలహీనంగా మారుతుంది. వారికి చిన్న వయసులోనే జుట్టు రాలిపోవడం అనే సమస్య కనిపిస్తుంది. కాబట్టి జుట్టు కోసం పిల్లలకు పెరుగు, ఆకుకూరలు, పప్పులు, పండ్లు మొలకెత్తిన విత్తనాలు వంటివి ఇవ్వండి. వారిలో జుట్టు పెరిగే అవకాశాలను పెంచుతాయి.
జుట్టు ఆరోగ్యంగా పెరుగుతున్నప్పుడు కొంతమంది పట్టించుకోవడం మానేస్తారు. జుట్టుపై ఎక్కువ వేడిని కలిగిస్తారు. అంటే రింగులు తిప్పుకునేందుకు, స్ట్రెయిటనింగ్ చేసుకునేందుకు అత్యధిక ఉష్ణోగ్రతను వెంట్రుకలపై ప్రయోగిస్తారు. దీని వల్ల కూడా జుట్టు ఊడిపోవచ్చు. జుట్టును బిగుతుగా కట్టడం వల్ల కూడా జుట్టు ఊడిపోతుంది. అలాగే పరిశుభ్రంగా ఉంచుకోకపోయినా కూడా జుట్టు రాలిపోయే అవకాశం ఉంది. యుక్త వయసులోనే జుట్టు రాలిపోవడానికి ఇవి కూడా కారణాలే.
ఉద్యోగం చేసే యువతలో ఒత్తిడి ఎక్కువైపోతుంది. దానివల్ల వారిలో మానసిక ఆందోళన పెరుగుతుంది. జుట్టు ఆరోగ్యానికి ఒత్తిడి మంచిది కాదు. జుట్టు రాలేందుకు అతిపెద్ద కారణాలు ఒత్తిడి కూడా ఒకటి. కాబట్టి మీరు ఒత్తిడి బారిన పడినా కూడా వెంట్రుకలు రాలిపోతాయి. పిల్లల్లో కూడా వెంట్రుకలు రాలిపోతూ ఉంటే జాగ్రత్త పడండి. వారిలో కూడా ఒత్తిడి పెరుగుతుందేమోనని గమనించండి. వారికి శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడేలా శ్వాస వ్యాయామాలు, యోగా వంటివి నేర్పించండి.
బరువు పెరగడానికి ఆరోగ్యంగా జీవించడానికి జుట్టు పెరగడానికి కూడా నిద్ర ఎంతో ముఖ్యం. అయితే ఇప్పుడు స్మార్ట్ ఫోన్లు, లాప్ టాప్‌లు, టీవీలను చూసుకుంటూ ఎంతోమంది నిద్రను తగ్గించేస్తున్నారు. నిద్ర మన ఆరోగ్యానికీ, జుట్టు పెరుగుదలకు ఎంతో ముఖ్యం. తగినంత నిద్ర లేకపోతే జుట్టు బలహీనంగా మారిపోతుంది. వెంట్రుకలు రాలడం మొదలవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ తగినంత నిద్రపోవడం అత్యవసరం. మీ జుట్టు రాలిపోవడానికి నిద్ర తగ్గడం కూడా కారణమేమో చూసుకోండి.
Also Read: చలికాలంలో ‘బరువు’ భారం.. జస్ట్ ఇలా చేస్తే ఆ సమస్యే ఉండదు!
జుట్టును బాగా లాగి బిగించి కట్టడం వంటివన్నీ కూడా వెంట్రుకలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి. అలాగే నెలరోజుల వరకు తలకు స్నానం చేయకుండా ఉండేవారు కూడా ఉన్నారు. అలాంటప్పుడు జుట్టు మొదళ్లలోకి మురికి చేరి ఆ వెంట్రుకలను బలహీనంగా మారుస్తాయి. అప్పుడు కూడా వెంట్రుకలు రాలిపోయే అవకాశం ఉంది. కాబట్టి జుట్టు కోసం ప్రత్యేకంగా ఆహారాన్ని తింటూ తగినంత నిద్రపోవడం అవసరం. అలాగే ఎప్పటికప్పుడు తలస్నానం కూడా చేయాలి. వీలైతే ప్రతి నాలుగు రోజులకు ఒకసారి తలస్నానం చేస్తే ఎంతో మంచిది.