ధూమపానం, మద్యపానం అలవాట్లు ఆధునిక కాలంలో ఎక్కువైపోతున్నాయి. మద్యపానంతో పోలిస్తే ధూమపానం చేసే వారి సంఖ్య ఇంకా అధికంగా ఉంది. ధూమపానం అనేది తీవ్రమైన సమస్యలకు కారణం అవుతుంది. ఆ విషయం తెలిసి కూడా రోజుకు ఒక సిగరెట్టే కదా రెండు సిగరెట్లే కదా అని అలవాటు చేసుకుంటున్నారు. ఎక్కువ డబ్బు సంపాదించాలనుకుంటే మీరు వెంటనే స్మోకింగ్ అలవాటును మానేయండి. ఇది మేము చెబుతున్న విషయం కాదు, ఒక అంతర్జాతీయ అధ్యయనం తేల్చి చెప్పింది. ధూమపానం చేసిన వారితో పోలిస్తే ధూమపానం చేయని వారు అధికంగా సంపాదిస్తున్నట్టు అధ్యయనంలో తెలిసింది.
ధూమపానం చేయని వ్యక్తి సంపాదించే డబ్బులో స్మోకింగ్ చేసే వ్యక్తి కేవలం 80 శాతం మాత్రమే సంపాదిస్తున్నారు. అంటే ధూమపానం చేయని వ్యక్తి 20 శాతం అధికంగా డబ్బు ఆర్జిస్తున్నారు. కాబట్టి మీరు కూడా ధూమపానం మానేస్తే ఎక్కువ సంపాదించే అవకాశం ఉంది.
ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ అట్లాంటా ఆర్థికవేత్తలు జూలీ హచ్‌కిస్, మిలిండా పిక్స్ చేసిన అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ఒకే సిగరెట్ అనుకుంటారు కానీ ఆ ఒక్క సిగరెట్టే చాలా ఎక్కువతో సమానమని పరిశోధకులు చెబుతున్నారు.
ధూమపానం చేసే ఉద్యోగులు లేదా కార్మికుల ఉత్పాదకత.. చేయని వారితో పోలిస్తే ఎంతో తక్కువగా ఉంటుంది. దీని వల్లే వారి సంపాదన కూడా దెబ్బతింటుందని అధ్యయనం చెబుతుంది. ధూమపానం చేసేవారు, ధూమపానం చేయని వారి మధ్య వేతన అంతరం కూడా అధికంగానే ఉన్నట్టు అధ్యయనం తేల్చింది. అంతేకాదు స్మోకింగ్ చేసే వారితో పోలిస్తే ధూమపానం చేయని వారు ఎక్కువ విద్యావంతులుగా మారుతున్నారు. ఇన్ని ప్రతికూలతలు కలిగిన ధూమపానాన్ని ఎంత త్వరగా మానేస్తే అంత మంచిదని ఈ అధ్యయనం చెబుతోంది.
స్మోకింగ్ చేసేవారిలో అసహనం పెరిగిపోతుంది. కోపం ఎక్కువగా ఉంటుంది. ఓపిక తగ్గిపోతుంది. దీనివల్లే వారు ఏ పని సక్రమంగా చేయలేరు. ఏ పని చెప్పినా విసుక్కుంటారు. త్వర త్వరగా పని ముగించి వెళ్ళిపోవాలనుకుంటారు. అందుకే వారి స్థాయి సంపాదన పెరగడం కష్టంగా మారుతుంది. ధూమపానం చేయని వారు మాత్రం ఎలాంటి వ్యక్తిత్వ లోపాలు లేకుండా ఓపికగా ఉంటారు. యజమానుల దగ్గర మంచి పేరు తెచ్చుకుంటారు. తద్వారా స్థాయిని, సంపాదన పెంచుకుంటారు.
ధూమపానం చేసే వారిలో స్వీయ నియంత్రణ తగ్గిపోతుంది. అసమర్థత ఎక్కువైపోతుంది. ఇవన్నీ కూడా వ్యాపారపరంగా, ఉద్యోగ పరంగా, చదువుపరంగా తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తాయి. ధూమపానమనేది ప్రమాదకర ప్రవర్తనకు కారణం అవుతుంది. అన్ని వృత్తుల్లో ఉన్నవారు కూడా ధూమపానాన్ని పూర్తిగా దూరం పెట్టాల్సిన అవసరం ఉంది. కొంత మంది ఒత్తిడి తగ్గించుకోవడం కోసం ధూమపానం చేస్తున్నామని చెప్పుకుంటారు. నిజానికి ధూమపానం చేయడం వల్ల మీకు తెలియకుండానే ఒత్తిడి విపరీతంగా పెరిగిపోతుంది. కాబట్టి మీరు జీవితంలో ముందుకు వెళ్లాలనుకున్నా, ఎక్కువ సంపాదించాలనుకున్నా వెంటనే ధూమపానాన్ని మానేయండి.