Dandruff: చుండ్రు, దురద స్కాల్ఫ్ అనేది చాలా మందిని వేధించే సాధారణ సమస్యలు. ముఖ్యంగా వాతావరణంలో మార్పులు వచ్చినప్పుడు, చర్మం పొడిబారినప్పుడు లేదా శిలీంధ్రాల పెరుగుదల ఎక్కువైనప్పుడు ఈ సమస్యలు తీవ్రమవుతాయి. చుండ్రు వల్ల వెంట్రుకలు ఊడిపోవడం, అసౌకర్యంగా అనిపించడం జరుగుతుంది. ఇలాంటి సమయంలో మన ఇంట్లోనే లభించే కొన్ని సహజ పదార్థాలను ఉపయోగించి ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందవచ్చు.
చుండ్రు, దురద స్కాల్ఫ్ తగ్గించే ముఖ్యమైన హోం రెమెడీస్:
1. కొబ్బరి నూనె, నిమ్మరసం:
కొబ్బరి నూనె చర్మానికి తేమను అందించి, పొడి బారకుండా చేస్తుంది. నిమ్మరసంలో ఉండే యాంటీ-ఫంగల్ లక్షణాలు చుండ్రుకు కారణమయ్యే శిలీంధ్రాలను నిరోధించడంలో సహాయ పడతాయి.
ఎలా ఉపయోగించాలి: రెండు చెంచాల కొబ్బరి నూనెలో ఒక చెంచా నిమ్మరసం కలిపి, దాన్ని మాడుపై సున్నితంగా మసాజ్ చేయండి. అరగంట లేదా ఒక గంట తర్వాత మైల్డ్ షాంపూతో తలస్నానం చేయండి. వారానికి రెండు సార్లు ఇలా చేయడం మంచిది.
2. ఆపిల్ సైడర్ వెనిగర్ :
ఆపిల్ సైడర్ వెనిగర్ లోని ఆమ్లత్వం మాడు యొక్క pH స్థాయిని సమతుల్యం చేసి.. శిలీంధ్రాల పెరుగుదలను తగ్గిస్తుంది. ఇది చనిపోయిన చర్మ కణాలను తొలగించి దురద నుంచి ఉపశమనం ఇస్తుంది.
ఎలా ఉపయోగించాలి: సమాన పరిమాణంలో ఆపిల్ సైడర్ వెనిగర్, నీరు కలిపి, షాంపూ చేసిన తర్వాత చివరిగా ఆ మిశ్రమంతో జుట్టును శుభ్రం చేసుకోండి. 15 నిమిషాల తర్వాత మళ్లీ నీటితో శుభ్రం చేసుకోవచ్చు.
3. మెంతిపొడి:
మెంతుల్లో యాంటీ-ఫంగల్, మాయిశ్చరైజింగ్ గుణాలు ఉంటాయి. ఇవి చుండ్రును తగ్గించడంలో.. అంతే కాకుండా మాడు పొడి బారకుండా ఉంచడంలో సహాయపడతాయి.
ఎలా ఉపయోగించాలి: కొన్ని మెంతులను రాత్రంతా నీటిలో నానబెట్టండి. ఉదయం వాటిని పేస్ట్‌లా చేసి, మాడుకు పట్టించి 30 నిమిషాలు ఉంచి, ఆపై శుభ్రం చేయండి.
4. కలబంద గుజ్జు:
కలబందలో యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ-ఫంగల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది మంట, దురదను తగ్గిస్తుంది. అంతే కాకుండా మాడును తేమగా ఉంచుతుంది.
ఎలా ఉపయోగించాలి: తాజా కలబంద గుజ్జును నేరుగా మాడుకు రాసి.. అరగంట తర్వాత గోరు వెచ్చని నీటితో కడగండి.
Also Read: చూయింగ్ గమ్ తింటున్నారా ? ముందుగా ఈ విషయాలు తెలుసుకోండి
5. టీ ట్రీ ఆయిల్ :
టీ ట్రీ ఆయిల్‌లో శక్తివంతమైన యాంటీ మైక్రోబయల్ గుణాలు ఉన్నాయి. చుండ్రుకు కారణమయ్యే సూక్ష్మజీవులను ఇది నియంత్రిస్తుంది.
ఎలా ఉపయోగించాలి: టీ ట్రీ ఆయిల్‌ను ఎప్పుడూ నేరుగా ఉపయోగించకూడదు. కొబ్బరి నూనె వంటి ఏదైనా క్యారియర్ ఆయిల్‌లో కొన్ని చుక్కలు కలిపి మసాజ్ చేసి.. 20 నిమిషాల తర్వాత తలస్నానం చేయండి.
ముఖ్యంగా పాటించాల్సిన చిట్కాలు:
శుభ్రత ముఖ్యం: జుట్టును క్రమం తప్పకుండా వారానికి కనీసం 2-3 సార్లు శుభ్రం చేసుకోవడం ద్వారా మాడుపై పేరుకుపోయే జిడ్డు, చనిపోయిన చర్మ కణాలను తొలగించవచ్చు.
నీరు ఎక్కువగా తాగాలి: శరీరంలో తగినంత తేమ ఉంటేనే మాడు పొడి బారకుండా ఉంటుంది.
ఒత్తిడిని తగ్గించుకోండి: ఒత్తిడి వల్ల కూడా చుండ్రు సమస్య పెరుగుతుంది. యోగా, ధ్యానం వంటివి చేయండి.