No More ORS: హైదరాబాద్కు చెందిన పిల్లల వైద్యురాలు డాక్టర్ శివరంజని సంతోష్ ఎనిమిదేళ్ల పోరాటానికి ఫలితం దక్కింది. భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (FSSAI) ఓఆర్ఎస్ డ్రింక్స్ పై యాక్షన్ తీసుకుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రమాణాలకు అనుగుణంగా లేని ఎనర్జీ డ్రింక్స్, ఇతర పానీయాలపై ఓరల్ రీహైడ్రేషన్ సాల్ట్స్(ORS) అనే పదాన్ని ఉపయోగించవద్దని ఆదేశాలు జారీ చేసింది.
ఎఫ్ఎస్ఎస్ఏఐ అక్టోబర్ 14న జారీ చేయబడిన ఉత్తర్వులు ప్రకారం.. కంపెనీలు తమ బ్రాండ్ పేర్లలో ఓఆర్ఎస్ ట్రేడ్‌మార్క్‌గా ఉపయోగించరాదని పేర్కొంది. అన్ని ఆహార వ్యాపార సంస్థలు తమ ఉత్పత్తుల నుండి ‘ఓఆర్ఎస్’ అనే పదాన్ని తక్షణమే తొలగించాలని ఆదేశించింది. ఆహార భద్రత ప్రమాణాల చట్టం, 2006 ప్రకారం లేబులింగ్, ప్రకటనలు ఉండాలని పేర్కొంది.
WHO సిఫార్సుల మేరకు ORS ఫార్ములా లేని వాటికి కూడా ఓఆర్ఎస్ అని లేబులింగ్ చేస్తున్నారని ఎఫ్ఎస్ఎస్ఏఐ గుర్తించింది. ఓఆర్ఎస్ ట్రేడ్ మార్క్ ను ఉపయోగించడానికి అనుమతిస్తూ జులై 14, 2022, ఫిబ్రవరి 2, 2024 తేదీలలో ఇచ్చిన రెండు ఆర్డర్‌లను FSSAI రద్దు చేసింది. ఎఫ్ఎస్ఎస్ఏఐ పండ్ల ఆధారిత, కార్బోనేటేడ్ కాని లేదా సిద్ధంగా ఉన్న ఏదైనా ఆహార ఉత్పత్తుల పేరులో ‘ORS’ అని వాడకం ఆహార భద్రత, ప్రమాణాల చట్టం, 2006 నిబంధనలను ఉల్లంఘించినట్లు అవుతుందని పేర్కొంది.
ఈ తరహా లేబులింగ్, తప్పుడు పేర్లతో కస్టమర్లను తప్పుదారి పట్టిస్తే నిబంధనలను ఉల్లంఘన కిందకు వస్తుందని ఎఫ్ఎస్ఎస్ఏఐ తెలిపింది.
ఓఆర్ఎస్ తప్పుడు లేబులింగ్ పై దశాబ్దం కాలంగా డాక్టర్ శివరంజని సంతోష్ పోరాటం చేస్తు్న్నారు. 2022లో తెలంగాణ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ప్రమాదకరమైన స్థాయిలో అధిక చక్కెరలు, ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్‌లు ఉన్నప్పటికీ ఓఆర్ఎస్ గా ప్రచారం చేస్తూ ఎనర్జీ డ్రింక్స్ విక్రయిస్తున్నారని ఆమె పిల్ లో పేర్కొన్నారు. WHO మార్గదర్శకాల ప్రకారం.. ORS ద్రావణంలో లీటరుకు 2.6 గ్రా సోడియం క్లోరైడ్, 1.5 గ్రా పొటాషియం క్లోరైడ్, 2.9 గ్రా సోడియం సిట్రేట్, లీటరుకు 13.5 గ్రా డెక్స్ట్రోస్ ఉండాలి.
మార్కెట్ లో ఓఆర్ఎస్ గా విక్రయిస్తున్న ఉత్పత్తులలో లీటరుకు 120 గ్రా కంటే ఎక్కువ చక్కెర, తక్కువ స్థాయిల్లో ఎలక్ట్రోలైట్‌లు ఉంటున్నాయని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఎఫ్ఎస్ఎస్ఏఐ తాజాగా ఆదేశాలపై ఇన్‌స్టాగ్రామ్‌లో డాక్టర్ శివరంజని స్పందించారు. తన ఎనిమిది సంవత్సరాలు పోరాటానికి ఇవాళ ఫలితం దక్కిందన్నారు. తన లక్ష్యానికి మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఎక్కువ చక్కెర కలిగిన ఎనర్జీ డ్రింక్స్ లేబుల్‌పై ఇకపై ఓఆర్ఎస్ అని ఉండకూదన్నారు.
Also Read: BC Reservations: బీసీల బ్లేమ్ బీఆర్ఎస్-బీజేపీల పైనే.. కాంగ్రెస్‌కు క్రెడిట్ రావొద్దనే ఇదంతా..!
ఇటీవల మహారాష్ట్ర, రాజస్థాన్‌లలో కలుషిత దగ్గు సిరప్‌లు తీసుకుని అనేక మంది పిల్లలు మరణించారు. ఈ ఘటనల నేపథ్యంలో డాక్టర్ శివరంజని తప్పుదారి పట్టించే అనారోగ్యకరమైన ఉత్పత్తులకు వ్యతిరేకంగా తన ప్రచారాన్ని మరింత ముమ్మరం చేసింది.