ప్రధాన మంత్రి మోదీ కర్నూలు జిల్లా పర్యటన విషయంలో టీడీపీ, వైసీపీ మధ్య ఓ ఆసక్తికర విషయంలో గొడవ మొదలైంది. వైసీపీ నేతలు కొందరు తాము ఓర్వకల్లు ఎయిర్ పోర్ట్ లో ప్రధాని మోదీని కలిశామని చెప్పుకొచ్చారు. మోదీతో తాము ఏమేం మాట్లాడామనే విషయాలను సొంత మీడియా సాక్షికి వివరించారు. మోదీని కలసి చెప్పుకున్న అభ్యర్థనలు, ఆయన ఇచ్చిన హామీలను వివరించారు. సీన్ కట్ చేస్తే, అసలు వైసీపీ నేతలు మోదీని కలవలేదని, ఇలా తప్పుడు ప్రచారం చేయడంపై కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు ఆరా తీశాయంటూ టీడీపీ అనుకూల మీడియాలో వార్తలొచ్చాయి. దీంతో వ్యవహారం మరింత ముదిరింది.
మోదీని నిజంగానే కలిశారా?
టీడీపీ అనుకూల మీడియాలో వైసీపీ నేతల్ని విమర్శిస్తూ వార్తలు రావడంతో వారిలో కొందరు వెంటనే రియాక్ట్ అయ్యారు. ఇదిగో మోదీని తాము కలసినప్పుడు దిగిన ఫొటో అంటూ ఒక ఫొటోని మీడియాకు చూపించారు వైసీపీ ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి. తాను మోదీని కలవలేదని నిరూపించగలిగితే తన పదవికి రాజీనామా చేస్తానని, ఒకవేళ అలా చేయలేకపోతే ఆయా ఛానెళ్లు మూసేసుకుంటారా అని సవాల్ విసిరారు. మోదీని వైసీపీ నేతలు కలవడం వల్ల ఉపయోగమేంటి? ఏపీలో కూటమి అధికారంలో ఉండగా, ఆ కూటమి తీసుకున్న నిర్ణయాన్ని మోదీ వద్ద సవాల్ చేయడం వల్ల ఏం జరుగుతుంది? మరి వైసీపీ ఇలా ఎందుకు ప్రచారం ఎందుకు చేసుకుంటోంది? అనేది తేలాల్సి ఉంది.
కర్నూలు జిల్లా..
పచ్చ మీడియాకు ఛాలెంజ్ విసిరిన వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే వీరుపాక్షి గారు
మోడీ పర్యటనలో వైసీపీ నేతలు కలవలేదని అసత్య ప్రచారాలు చేసిన ఎబిఎన్, ఈటివి మీడియాకు కౌంటర్ ఇచ్చిన ఎమ్మెల్యే
ఫేక్ ఎమ్మెల్యేలు మేము కాదు, మీ ఛానల్ ఫేక్.. మీ కూటమి ప్రభుత్వం ఫెక్ అంటూ మండిపడిన… pic.twitter.com/hKRm5NuDDF
— Jagananna Connects (@JaganannaCNCTS) October 17, 2025
ఇంత లేటెందుకు?
ప్రధాని మోదీని కలిస్తే మరి ఆ ఫొటోని భద్రంగా సెల్ ఫోన్ లో దాచిపెట్టుకోవడం దేనికని ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు. ప్రధాని స్థాయి వ్యక్తిని కలిస్తే సోషల్ మీడియాలో హోరెత్తిపోయేలా ఆ ఫొటోని ప్రచారం చేసుకునే రోజులివి. కనీసం సాక్షి మీడియా కూడా వైసీపీ ఎమ్మెల్యేలు, నేతలు ప్రధానిని కలిశారంటూ ఫొటోలు ప్రచురించలేదు. కేవలం వారు కలసిన తర్వాత అనుకూల మీడియాకి ఓ ఇంటర్వ్యూ ఇచ్చి సరిపెట్టారు. సహజంగానే దీనిపై అనుమానాలు రేకెత్తేలా చేశారు. దీంతో అసలు వైసీపీ నేతలు మోదీని కలిసింది నిజమేనా అనే చర్చ తలెత్తింది.
Also Read: లోకేష్ కోడి-గుడ్డు కామెంట్స్
గతంలో అలా..
గత వైసీపీ ప్రభుత్వంలో కేంద్రంలోని నేతలెవరైనా ఏపీకి వస్తే ప్రతిపక్ష నేతలకు సమాచారం ఉండేది కాదనే ఆరోపణలున్నాయి. ప్రతిపక్ష నేతల్ని ఆయా మీటింగ్ లకు పిలిచేవారు కాదని, ప్రొటోకాల్ ఇచ్చేవారు కాదని అంటారు. ఇప్పుడు మోదీని వైసీపీ నేతలు కలసిన ఫొటోల్లో ప్రతి చోటా సీఎం చంద్రబాబు కూడా కనపడుతున్నారు. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను దగ్గరుండి ఆయనే పరిచయం చేస్తున్నట్టు ఆ ఫొటోలు చూస్తే అర్థమవుతుంది. ఇంతకీ ఈ ఎపిసోడ్ ద్వారా వైసీపీ ఏం కోరుకుందో అర్థం కావడం లేదు. వైసీపీ నేతలు, ప్రధానిని కలవడం ఆ పార్టీకి మైలేజీని పెంచుతుందా, లేక చంద్రబాబు సమక్షంలో మోదీని కలవడం వైసీపీకి అవమానంగా మిగులుతుందా? ఈ విషయంలో మాత్రం వైసీపీ సందిగ్ధంలోనే ఉందని టీడీపీ విమర్శిస్తోంది.
Also Read: గ్యాప్ రాకూడదు, మళ్లీ మనమే రావాలి – లోకేష్