సాధారణంగా చాలా మంది వేసవి కాలంలో పుచ్చకాయలను ఎక్కువగా తింటుంటారు. వీటిని కోస్తే, లోపల ఎర్రటి గుజ్జు చూడ్డానికి కలర్ ఫుల్ గా ఉండటంతో పాటు రుచికరంగా ఉంటుంది. ఇప్పుడు పసుపు రంగు పుచ్చకాయలు కూడా మార్కెట్లోకి వస్తున్నాయి. వీటిని వేసవితో పాటు ఎప్పుడైనా తినవచ్చు అంటున్నారు నిపుణులు. అంతేకాదు, వీటితో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు ఇంతకీ అవేంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
అన్ని రకాల పుచ్చకాయల మాదిరిగానే పసుపు పుచ్చకాయ కూడా దాదాపు 92% నీటితో కూడి ఉంటుంది. ఈ వాటర్ కంటెంట్ హైడ్రేటెడ్‌గా ఉండటానికి కారణం అవుతుంది. శరీర ఉష్ణోగ్రతను కంట్రోల్ చేయడంతో పాటు జీర్ణక్రియకు తోడ్పాటు అందిస్తుంది. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. శరీరం చల్లగా, రిఫ్రెష్ గా ఉండేలా చేస్తుంది.
పసుపు పుచ్చకాయలో విటమిన్ సి, బీటా కెరోటిన్ తో సహా బోలెడు యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శరీరంలోని ఫ్రీ రాడికల్స్ ను తటస్థీకరించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఇందులోని విటమిన్ సి రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. గాయాలను నయం చేయడంలో సహాయపడుతుంది. చక్కటి కంటి చూపును అందిస్తుంది.
పసుపు రంగు పుచ్చకాయలో తక్కువ కేలరీలు ఉంటాయి. అదనపు కేలరీలు లేకుండా తీపి కోరికలను తీర్చే సరైన చిరుతిండిగా పనికివస్తుంది. ఇది బరువును కంట్రోల్ చేయడంలో ఉపయోగపడుతుంది.
పసుపు పుచ్చకాయలో పెద్ద మొత్తంలో సిట్రుల్లైన్ ఉంటుంది. ఇది రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది. రక్తపోటును తగ్గిస్తుంది. సిట్రుల్లైన్ శరీరంలో అర్జినిన్ గా మార్చబడుతుంది. ఇది నైట్రిక్ ఆక్సైడ్‌ను ఉత్పత్తి చేయడంలో సహాయపడుతుంది. ఫలితంగా రక్త నాళాలను సడలించడంతో పాటు ప్రసరణను మెరుగుపరుస్తుంది. ఎల్లో వాటర్ మిలన్ లోని పొటాషియం కంటెంట్ ఎలక్ట్రోలైట్ సమతుల్యతను కాపాడటంతో పాటు రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. గుండె ఆరోగ్యానికి కారణం అవుతుంది.
పసుపు పుచ్చకాయలో అధిక విటమిన్ సి కంటెంట్ రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. విటమిన్ సి తెల్ల రక్త కణాల ఉత్పత్తిని పెంచుతుంది. ఇవి ఇన్ఫెక్షన్లతో పోరాడుతాయి. పసుపు పుచ్చకాయను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రోగనిరోధక ప్రతిస్పందనను బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. జలుబు, ఇతర ఇన్ఫెక్షన్లు రాకుండా కాపాడుతుంది.
పసుపు పుచ్చకాయలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఫైబర్ పేగు కదలికలను నియంత్రించడంలో, మలబద్ధకాన్ని నివారించడంలో సాయపడుతుంది. అధిక నీటి శాతం జీర్ణవ్యవస్థను సరళంగా ఉంచడం ద్వారా జీర్ణక్రియ మెరుగవుతుంది.
పసుపు పుచ్చకాయలోని విటమిన్లు A, C చర్మ ఆరోగ్యానికి సాయపడుతుంది. విటమిన్ ఎ చర్మ కణజాలాల మరమ్మత్తు, పెరుగుదలకు సహాయపడుతుంది, విటమిన్ సి కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది. ఇది చర్మాన్ని దృఢంగా, యవ్వనంగా ఉంచుతుంది.
పసుపు పుచ్చకాయ కేవలం హైడ్రేషన్, యాంటీఆక్సిడెంట్ల గురించి మాత్రమే కాదు.. ఇది మొత్తం ఆరోగ్యానికి దోహదపడే వివిధ రకాల పోషకాలను అందిస్తుంది. ఇందులో విటమిన్లు ఎ, బి6, సి, పొటాషియం, మెగ్నీషియం లాంటి ఖనిజాలు ఉంటాయి. విటమిన్ బి6 మెదడు పనితీరుకు కీలకమైనది. పొటాషియం, మెగ్నీషియం కండరాల పనితీరుకు, ఆరోగ్యకరమైన నాడీ వ్యవస్థకు అవసరం అవుతాయి.
Read Also: మరణానికి కొన్ని సెకన్ల ముందు.. ఇలా కనిపిస్తుందట.. పరిశోధనలో అబ్బురపరిచే విషయాలు వెల్లడి!