Antibiotics: రెండు సంవత్సరాల కంటే ముందు ఎక్కువగా పిల్లలకు యాంటీబయాటిక్స్ ఇస్తే.. 12 సంవత్సరాల వయస్సులోపు వారు ఊబకాయం బారిన పడే అవకాశం 20 శాతం ఎక్కువగా ఉందని ఫిన్లాండ్‌కు చెందిన పరిశోధకులు కనుగొన్నారు. యాంటీబయాటిక్స్ ఊబకాయం గుండె జబ్బులు, మధుమేహం, క్యాన్సర్ వంటి తీవ్రమైన , ప్రాణాంతక సమస్యల ప్రమాదాన్ని పెంచుతాయని వెల్లడించారు.
మీరు కూడా చిన్న చిన్న ఇన్ఫెక్షన్లు వచ్చిన వెంటనే పిల్లలకు యాంటీబయాటిక్స్ ఇవ్వడం ప్రారంభిస్తే మాత్రం మీ ముందుగా ఈ విషయాలను తప్పకుండా తెలుసుకోవాలి.
డాక్టర్ల సలహా లేకుండా పిల్లలకు యాంటీబయాటిక్స్ ఇవ్వడం మానుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ మందులను అధికంగా వాడటం వల్ల భవిష్యత్తులో పిల్లలకు మధుమేహం, అధిక రక్తపోటు , క్యాన్సర్ వంటి అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది.
పిల్లలలో అధిక బరువు సమస్య :
పిల్లల్లో ఇన్ఫెక్షన్లు తగ్గడానికి ఉపయోగించే సాధారణ మందులను అధికంగా వాడటం వల్ల వారిలో ఊబకాయం వచ్చే ప్రమాదం పెరుగుతుందని ఇటీవలి ఓ అధ్యయనంలో వెల్లడైంది.
రెండు సంవత్సరాల కంటే ముందు ఎక్కువగా యాంటీబయాటిక్స్ తీసుకున్న పిల్లలు 12 సంవత్సరాల వయస్సులోపు ఊబకాయం (హై బాడీ మాస్ ఇండెక్స్) బారిన పడే అవకాశం 20 శాతం ఎక్కువగా ఉందని ఫిన్లాండ్ పరిశోధకులు కనుగొన్నారు. అంతే కాకుండాయాంటీ బయోటిక్స్ తక్కువగా తీసుకున్న పిల్లల్లో ఊబకాయం ప్రమాదం తక్కువగా ఉంది.
ఇంకా చెప్పాలంటే.. రెండు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు యాంటీబయాటిక్స్ తరచుగా ఇచ్చినప్పుడు.. వారు ఐదవ తరగతికి చేరుకునే సమయానికి బరువు పెరిగే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంది.
యాంటీబయాటిక్స్ అధిక వాడకం :
గొంతు నొప్పి,ఇన్ఫెక్షన్లు తగ్గించడానికి యాంటీబయాటిక్స్ వాడతారు. అధికారిక గణాంకాల ప్రకారం.. UK లోనే ప్రతి సంవత్సరం 14 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు దాదాపు 4 మిలియన్ల (40 లక్షల) యాంటీబయాటిక్స్ ప్రిస్క్రిప్షన్లు ఇస్తున్నారు. ఈ మందులు సాధారణంగా గొంతు నొప్పి, న్యుమోనియా ,గ్యాస్ట్రోఎంటెరిటిస్, చర్మం , చెవి ఇన్ఫెక్షన్లు వంటి బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లను తగ్గించడానికి ఉపయోగిస్తారు.
యాంటీబయాటిక్స్‌పై పరిమితి విధించాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వీటిని ఎక్కువగా వాడటం కొనసాగిస్తే.. ఈ మందులు కాలక్రమేణా వాటి శక్తిని కోల్పోతాయని, అంతే కాకుండా సాధారణ ఇన్ఫెక్షన్లకు కూడా చికిత్స చేయడం కష్టతరం అయ్యే సమయం రావచ్చని హెచ్చరిస్తున్నారు.
అధ్యయనంలో ఏం కనుగొన్నారు ?
24 నెలల లోపు పిల్లలకు యాంటీబయాటిక్స్ ఇవ్వడం వల్ల 7 సంవత్సరాల వయస్సులోపు BMI పెరిగే అవకాశం ఉందని పరిశోధకులు అధ్యయనంలో కనుగొన్నారు. ఇది తరువాత వారి జీవితంలో అనేక సమస్యలను కలిగిస్తుంది.
ఈ అధ్యయనం కోసం.. నిపుణులు ఫిన్లాండ్‌లోని 12 సంవత్సరాల వయస్సు వరకు 33,095 మంది పిల్లల నుండి డేటాను విశ్లేషించారు. వీరిలో మొదటి రెండు సంవత్సరాలలో యాంటీబయాటిక్స్ వాడకాన్ని పర్యవేక్షించారు. గర్భధారణకు ముందు, గర్భధారణ సమయంలో , ప్రసవ సమయంలో యాంటీబయాటిక్ వాడకాన్ని కూడా పరిశోధకులు పర్యవేక్షించారు.
గర్భధారణకు ముందు, గర్భధారణ సమయంలో లేదా పుట్టిన సమయంలో యాంటీబయాటిక్స్ తీసుకోవడం వల్ల శిశువు బరువులో ఎటువంటి తేడా ఉండదని పరిశోధనలో రుజువైంది. అయితే.. మొదటి రెండు సంవత్సరాలలో ఈ మందులు తీసుకున్న పిల్లలకు ఊబకాయం వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంది.
Also Read: మెంతుల్లో ఈ ఒక్కటి కలిపి వాడితే.. జుట్టు ఊడమన్నా ఊడదు
ఫిన్లాండ్‌లోని ఔలు విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు.. చిన్న పిల్లలకు యాంటీబయాటిక్స్ సూచించేటప్పుడు, ముఖ్యంగా ఎగువ శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల సమయంలో జాగ్రత్తగా ఉండాలని వైద్యులను కోరారు. దీంతో పాటు.. చిన్న చిన్న సమస్యలకు ఈ మందుల వాడకం పట్ల తల్లిదండ్రులు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఇవి పిల్లలను ఊబకాయానికి గురి చేస్తాయి. దీనివల్ల భవిష్యత్తులో వారికి గుండె జబ్బులు, మధుమేహం, క్యాన్సర్ వంటి తీవ్రమైన , ప్రాణాంతక సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.