కొన్ని రకాల ఫంగస్‌లు చాలా ప్రమాదకరమైనవి. ఇవి అనుకోకుండా మనిషి శరీరంలో చేరితే లోపల నుంచి అవయవాలను తినేస్తూ ఉంటాయి. ప్రపంచ ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల ఒక ప్రాణాంతక ఫంగస్ విపరీతంగా వ్యాపిస్తుంది. అదే ప్రతి యేటా ఈ ఫంగస్ కారణంగా మరణిస్తున్న వారి సంఖ్య పెరిగిపోతున్నట్టు కొత్త అధ్యయనం తెలిసింది. ఈ ప్రాణాంతక ఫంగస్ పేరు ఆస్పర్‌గిల్లస్.
మాంచెస్టర్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు చెబుతున్న ప్రకారం అనేక రకాల ఆస్పర్గిల్లస్ ఫంగస్ ప్రపంచవ్యాప్తంగా ప్రజలు, పెంపుడు జంతువులు, మొక్కలకు సోకుతున్నట్టు గుర్తించారు. ఈ ఫంగస్ మంచి శరీరంలో చేరితే అవయవాలను లోపల తినేస్తుంది. చివరకు మరణం సంభవిస్తుంది.
ఆస్పర్‌గిల్లస్ అంటే ఏమిటి?
ప్రపంచంలో అనేక రకాల ఫంగస్‌లు ఉన్నాయి. వాటిలో ఆస్పర్‌గిల్లస్ శిలీంధ్రాల సమూహం కూడా ఒకటి. ఇది ఎంతో ప్రాణాంతకమైనది. మనిషి శరీరంలో అనుకోకుండా చేరితే నేరుగా ఊపిరితిత్తులపైనే ప్రభావం చూపిస్తుంది. భవిష్యత్తులో ఆస్పర్‌గిల్లస్ వ్యాప్తి అధికంగా ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. వాతావరణ మార్పుల్లో కారణంగా ఆస్పర్ గిల్లస్ జాతులు విపరీతంగా పెరుగుతున్నాయని వాటి వ్యాప్తి కూడా అధికంగా ఉందని గుర్తించారు.
ఇదే పెను సమస్య
ముఖ్యంగా ఆస్పర్ గిల్లస్ ఫంగస్‌కు చెందిన జాతులు కెనడా, అమెరికా, యూరోప్, చైనా, రష్యాలోని కొత్త ప్రాంతాలకు కూడా విస్తరించినట్టు కనుగొన్నారు. ఇతర వైరస్ లు, బ్యాక్టీరియాలతో పోలిస్తే ఈ ఫంగస్ తీవ్రమైనదని అంచనా వేస్తున్నారు. ఇది భవిష్యత్తులో మానవాళికి పెను సమస్యగా మారే అవకాశం ఉందని చెబుతున్నారు.
పాతిక లక్షల మంది మరణం
ప్రతి ఏడాది ఫంగల్ ఇన్ఫెక్షన్ల కారణంగా 2.5 మిలియన్ల మంది ప్రాణాలు కోల్పోతున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. అన్ని శిలీంధ్రాల మాదిరిగానే ఆస్పర్ గిల్లస్ కూడా నేలల్లో చిన్న తంతువుల నిర్మాణాలలో ఉంటాయి. అవి గాలిలో కలిసిపోయి ప్రయాణిస్తాయి. ఆ గాలి ద్వారానే మనిషిలో చేరే అవకాశం ఉంది. ఈ ఆస్పర్ గిల్లస్ శరీరంలో చేరితే రోగనిరోధక వ్యవస్థ బలహీనంగా మారిపోతుంది. అలాగే ఊపిరితిత్తులపై ప్రభావం పడుతుంది. ఉబ్బసం, సిస్టిక్ ఫైబ్రోసిస్, COPD వంటి ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్న వారికి ఇది మరింత ప్రాణాంతక పరిస్థితులను ఏర్పరుస్తుంది
అవయవాలను నమిలి తినేస్తుంది
క్యాన్సరు లేదా అవయవ మార్పిడి చేయించుకున్న రోగులకు రోగనిరోధక వ్యవస్థ బలహీనంగా ఉంటుంది. అలాంటి వారికి ఈ ఆస్పర గిల్లస్ అనేది ఎంతో ప్రమాదకరమైనది. వారిని ఎక్కువ కాలం ఇది బతకనివ్వదు. శరీరంలో చేరాక ఇది పెరగడం ప్రారంభమవుతుంది. ఆ తర్వాత అవయవాలను తినేస్తూ ఉంటుంది.
ఆస్పర్‌గిల్లస్ శిలీంధ్రాలు వేడి, ఉష్ణ మండల ప్రాంతాలను ఇష్టపడతాయి. ఈ ఇన్ఫెక్షన్ ఆహార పంటలకు కూడా సోకితే ఆహార భద్రత సమస్య తీవ్రంగా ఏర్పడుతుంది. ప్రపంచంలో ఆహార కొరత వల్ల కూడా మరణాలు సంభవించే అవకాశం ఉంది. కాబట్టి ఆస్పర్ గిల్లర్స్ ఫంగస్ అనేది మనిషి ప్రాణాలు తీయడమే కాదు… ఆకలితో అలమటించేలా కూడా చేస్తుంది. భవిష్యత్తులో ప్రపంచ దేశాలు ఎదుర్కొనే తీవ్రమైన సమస్యగా ఈ ఫంగస్ మారే అవకాశం ఉందని అధ్యయనకర్తలు అంచనా వేసి చెబుతున్నారు.