PCOS vs PCOD: మనలో చాలామంది పీసీఓడీ (PCOD), పీసీఓఎస్ (PCOS) అనే పదాలను ఒకేదానికోసం వాడుతుంటాం. పీరియడ్స్ సరిగ్గా రాకపోతే చాలు.. పీసీఓడీ లేదా పీసీఓఎస్ వచ్చిందని తేల్చేస్తుంటారు. అసలు ఈ రెండూ ఒకటే అనుకోవడం మనలో చాలామంది చేసే పెద్ద పొరపాటు. బయటికి చూడడానికి రెండింటి లక్షణాలు ఒకేలా అనిపించినా.. మన శరీరంపై ఇవి చూపే ప్రభావం మాత్రం పూర్తిగా వేర్వేరుగా ఉంటుంది. కాబట్టి.. వీటి మధ్య తేడా ఏంటో ప్రతి ఒక్కరూ కచ్చితంగా తెలుసుకోవాలి.
ఇది మన జీవనశైలి కారణంగా ఎక్కువగా వచ్చే సమస్య. దీనిలో అండాశయాలు సరిగ్గా పరిపక్వం చెందని కొన్ని గుడ్లను విడుదల చేస్తాయి. కాలక్రమేణా అవే చిన్న చిన్న సిస్ట్ అనగా నీటి బుడగలుగా మారుతాయి. ఇది కాస్త తేలికపాటి సమస్యే అని చెప్పవచ్చు. కొద్దిగా ఆహారపు అలవాట్లు మార్చుకుని, రోజూ వ్యాయామం చేస్తే PCOD సమస్యను చాలావరకు తగ్గించుకోవచ్చు. పెళ్లయ్యాక పిల్లలు పుట్టడంలో కూడా పెద్దగా ఇబ్బందులు రావు.
కానీ పీసీఓఎస్ అలా కాదు.. ఇదొక కాంప్లికేటెడ్ హార్మోన్ల సమస్య. ఇందులో కేవలం అండాశయాలు మాత్రమే కాకుండా మన మెటబాలిజం మొత్తం దెబ్బతింటుంది. శరీరంలో మగ హార్మోన్లు అయిన అండ్రోజెన్లు పెరిగిపోతాయి. దీనివల్ల ఇన్సులిన్ నిరోధకత ఏర్పడి, భవిష్యత్తులో షుగర్ వ్యాధి, గుండె జబ్బులు వచ్చే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది.
చాలామంది డాక్టర్ దగ్గరికి వెళ్లగానే స్కానింగ్ తీసి నీటి బుడగలు కనిపిస్తే చాలు PCOS అని ఫిక్స్ అయిపోతుంటారు. కానీ కేవలం స్కానింగ్ చూసి దీన్ని నిర్ధారించలేమని నిపుణులు చెబుతున్నారు. హార్మోన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, రక్త పరీక్షల ఫలితాలు, పీరియడ్స్ హిస్టరీ ఇవన్నీ పరిశీలించిన తర్వాతే అసలు సమస్య ఏంటో డాక్టర్లు ఖాయం చేస్తారు.
ఈ రెండు సమస్యలకు ట్రీట్‌మెంట్ విధానం కూడా పూర్తిగా వేరుగా ఉంటుంది. PCOD ఉన్నవారు కేవలం వ్యాయామం, మంచి డైట్ ద్వారా నయం చేసుకోవచ్చు. అదే PCOS ఉన్నట్లయితే లైఫ్‌స్టైల్ మార్పులతో పాటు హార్మోన్లను బ్యాలెన్స్ చేసే మందులు కూడా దీర్ఘకాలికంగా వాడాల్సి ఉంటుంది.
ముఖ్యంగా మహిళలు ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. మీకు ఏ సమస్య ఉందో కచ్చితంగా మీ గైనకాలజిస్ట్‌ని అడిగి తెలుసుకోవాలి. ఏదో ఒక సమస్య అని లైట్ తీసుకుంటే భవిష్యత్తులో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది కాబట్టి.. సరైన అవగాహనతో ముందుకెళ్లడం చాలా ముఖ్యం.
Also Read: పేరు లేని బంధం.. బ్రేకప్ కూడా కాదు.. అయినా సిచ్యుయేషన్‌షిప్ ఎందుకింత బాధిస్తుంది?