Hair Mask For Dandruff: తలలో చుండ్రు ఉండటం సర్వసాధారణం. సీజన్ ఏదైనా.. జుట్టులో చుండ్రు సమస్య చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. మన శరీరంలో ఉన్న కఫ, వాత దోషాలు అసమతుల్యమైనప్పుడు.. అవి రక్తంలో కలిసిపోయి దానిని అపవిత్రం చేస్తాయి. ఇది తలలోని రంధ్రాలను మూసుకుపోయేలా చేస్తుంది. దీని వల్ల తల చర్మం పొడిగా మారుతుంది. తర్వాత తలపై పొర ఏర్పడుతుంది. దీనినే డాండ్రఫ్ అంటారు.
ప్రస్తుతం చాలా మంది జుట్టు సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా కాలుష్యం, వాతావరణ పరిస్థితి కారణంగా తలలో చుండ్రు పేరుకుపోతుంది. చుండ్రు మన జుట్టుపై చెడుగా కనిపించడమే కాకుండా దురద, చికాకును కలిగిస్తుంది. తలపై చుండ్రు ఉపరితలంపై ఉన్న సెబమ్, చనిపోయిన చర్మ కణాల నుండి పెరిగే ఫంగస్ వల్ల వస్తుంది. చుండ్రు పొరలు చిన్నవి లేదా పెద్దవయినా.. ఏ పరిమాణంలో ఉన్నా సరే ఇవి దువ్వడం ద్వారా బయటకు రావు. కొన్ని సార్లు ఇది తీవ్రంగా జుట్టు రాలడానికి కూడా కారణం అవుతుంది. మీరు చుండ్రు సమస్యతో బాధపడుతుంటే,.. మందులు, ఖరీదైన షాంపూ, కండిషనర్లకు బదులుగా.. హోం రెమెడీస్ వాడవచ్చు.
చుండ్రు తగ్గడానికి హోం రెమెడీస్:
కొబ్బరి నూనె:
కొబ్బరి నూనెతో తలకు మసాజ్ చేయడం వల్ల తలలో రక్త ప్రసరణ పెరుగుతుంది. అంతే కాకుండా ఇది తలకు తేమను కూడా అందిస్తుంది. చుండ్రును తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. కొద్దిగా గోరువెచ్చని కొబ్బరి నూనెను తలకు పట్టించి కొన్ని గంటలు అలాగే ఉంచండి. తరువాత వాష్ చేయండి. కొబ్బరి నూనె , నిమ్మరసం సమాన పరిమాణంలో తీసుకుని ఈ మిశ్రమాన్ని మీ తలపై అప్లై చేసి సున్నితంగా మసాజ్ చేయండి. ఒక గంట పాటు అలాగే ఉంచి.. తర్వాత షాంపూతో తలస్నానం చేయండి. త్వరగా చుండ్రు తగ్గాలని అనుకున్న వారు దీనిని వారానికి మూడుసార్లు దీనిని ఉపయోగించవచ్చు. దీని వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా రావు.
కలబంద:
జుట్టుకు కలబందను అప్లై చేయడం వల్ల చుండ్రు సమస్య తొలగిపోతుంది. అంతే కాకుండా కలబందలోని యాంటీ ఫంగల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాల కారణంగా చుండ్రుకు ప్రభావ వంతంగా తగ్గిస్తుంది. ఇది దురద, తలపై చర్మం చికాకును తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. ఇందుకోసం ముందుగా అలోవెరా జెల్‌ను మీ జుట్టుకు అప్లై చేయండి. 30 నిమిషాల నుండి గంట వరకు అలాగే ఉంచి.. ఆ తర్వాత షాంపూతో వాష్ చేయండి. ఇలా వారానికి 2- 3 సార్లు చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అంతే కాకుండా చుండ్రు తగ్గి జట్టు కూడా మెరుస్తుంది.
Also Read: ఇంట్లోనే పెరుగుతో.. ఫేషియల్ చేసుకోండిలా !
హెయిర్ ప్యాక్:
అలోవెరా జెల్ లో కొన్ని చుక్కల నిమ్మరసం , గ్లిజరిన్ కలపండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి మసాజ్ చేయండి. 15 నిమిషాలు మసాజ్ చేసిన తర్వాత..గోరువెచ్చని నీటితో జుట్టును శుభ్రం చేయండి. తలను శుభ్రం చేయడానికి కేవలం తేలికపాటి షాంపూ ,కండిషనర్ మాత్రమే ఉపయోగించండి. నిమ్మరసం ,కలబంద జెల్ లను సమాన పరిమాణంలో కలిపి తలకు సున్నితంగా అప్లై చేసి అరగంట తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల కూడా అనేక లాభాలు ఉంటాయి.