Indigestion Problem: ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోవడం వల్ల కడుపులో అసౌకర్యం, భారంగా అనిపించినప్పుడు దానిని అజీర్ణం అంటారు. ఒత్తిడి, ధూమపానం, మద్యం సేవించడం, కడుపులో ఇన్ఫెక్షన్, మందులు తీసుకోవడం వంటి అనేక కారణాలు అజీర్ణానికి కారణమవుతాయి. ఈ సమస్య పెద్దల నుంచి పిల్లల వరకు అందరికీ రావచ్చు. కాబట్టి దీన్ని వదిలించుకోవడానికి.. మందులు తీసుకునే బదులు, ముందుగా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని హోం రెమెడీస్ వాడటం చాలా మంచిది. కాబట్టి అజీర్ణ సమస్య నుంచి తక్షణ ఉపశమనం కోసం వంటగదిలో లభించే ఏ పదార్థాలు అద్భుతంగా ఉపయోగపడతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
అజీర్ణ సమస్యలు తగ్గాలంటే ?
1. అల్లం:
అల్లం అజీర్ణం నుంచి ఉపశమనం పొందడంలో చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే ఇది కడుపులోని ఆమ్లాన్ని తగ్గిస్తుంది. అజీర్ణంగా అనిపించినప్పుడు చిన్న అల్లం ముక్కను నమలండి లేదా అల్లం టీ తయారు చేసి తాగండి. ఇలా చేయడం వల్ల తక్కువ సమయంలోనే మంచి రిజల్ట్ కనిపిస్తుంది.
2. నిమ్మకాయ:
ఆహారం త్వరగా జీర్ణం కావడానికి, అజీర్ణం నుంచి ఉపశమనం పొందడానికి నిమ్మకాయను ఉపయోగించమని చాలా మంది చెబుతుండటం మీరు వినే ఉంటారు. దీని కోసం.. ఒక కప్పు గోరు వెచ్చని నీటిలో ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం కలిపి తాగాలి. ఇది ఆహారాన్ని మరింత సులభంగా జీర్ణం చేయడానికి సహాయపడుతుంది. అంతే కాకుండా కడుపు నొప్పి సమస్యలను కూడా చాలా త్వరగా నయం చేస్తుంది.
3. వాము నీరు:
వాము నీరు జీర్ణ సంబంధిత సమస్యలు రాకుండా చేయడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది అద్భుమైన హోం రెమెడీ. దీని కోసం.. వాము చిటికెడు ఇంగువ, నల్ల ఉప్పుతో కలిపి తాగి నీరు తాగాలి. ఇది కడుపు నొప్పి , అజీర్ణం వల్ల కలిగే తిమ్మిరి నుంచి తక్షణ ఉపశమనం కలిగిస్తుంది. వాము నీరు తాగడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు చాలా వరకు తగ్గుతాయి.
4. మజ్జిగ:
మజ్జిగ ఆహారం త్వరగా, సులభంగా జీర్ణం కావడానికి సహాయ పడుతుంది. కొద్దిగా నల్ల ఉప్పు , వేయించిన జీలకర్రను కలపడం వల్ల దాని రుచి మెరుగు పడటమే కాకుండా అజీర్ణాన్ని కూడా నివారిస్తుంది. మజ్జిగ తాగే అలవాటు ఉన్న వారికి అజీర్ణ సమస్యలు వచ్చే ప్రమాదం కూడా చాలా తక్కువగా ఉంటుంది.
5. దాల్చిన చెక్క:
దాల్చిన చెక్క అజీర్ణం వల్ల కలిగే ఉబ్బరం, కడుపు తిమ్మిరి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. 1 కప్పు గోరు వెచ్చని నీటిలో 1/2 టీస్పూన్ దాల్చిన చెక్క కలిపి తాగడం వల్ల అజీర్ణం తగ్గుతుంది. అంతే కాకుండా ఇది జీర్ణ సంబంధిత సమస్యలు రాకుండా చేయడంలో కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది.