Cancer Tests: క్యాన్సర్ అనేది ప్రపంచవ్యాప్తంగా అనేక మందిని ప్రభావితం చేస్తున్న ప్రమాదకర వ్యాధి. కానీ దీనిని సరైన సమయంలో గుర్తించడం ద్వారా దీనికి చికిత్స చేసి, తీవ్రతను తగ్గించుకోవచ్చు. బ్లడ్ టెస్టులు రక్తంలో క్యాన్సర్ గుర్తించడంలో అంతే కాకుండా వాటి నివారణలో కూడా కీలక పాత్ర పోషిస్తాయి. ఈ పరీక్షలు మన రక్తంలో ఉండే కొన్ని అసాధారణ రసాయనాలు , ప్రొటీన్లు లేదా కణాల స్థాయిలను కొలవడం ద్వారా క్యాన్సర్ సంకేతాలను తెలుసుకోవడానికి డాక్టర్లకు సహాయపడతాయి. అయితే కేవలం అయితే, కేవలం రక్త పరీక్షల ఆధారంగానే క్యాన్సర్‌ను ఖచ్చితంగా నిర్ధారించలేరనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. అనుమానం వచ్చినప్పుడు తదుపరి పరీక్షలు (బయాప్సీ వంటివి) అవసరం అవుతాయి.
1. పూర్తి రక్త కణాలు (Complete Blood Count – CBC):
ఈ పరీక్ష రక్తంలోని ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, ప్లేట్‌లెట్స్ సంఖ్యను కొలుస్తుంది. లుకేమియా (రక్త క్యాన్సర్), లింఫోమా వంటి రక్త సంబంధిత క్యాన్సర్‌లను గుర్తించడంలో ఇది ఉపయోగపడుతుంది. అసాధారణ కణాల సంఖ్య లేదా రక్తహీనత వంటి లక్షణాలు క్యాన్సర్‌ను సూచిస్తాయి.
2. ట్యూమర్ మార్కర్ రక్త పరీక్షలు (Tumor Marker Blood Tests):
ట్యూమర్ మార్కర్లు అనేవి క్యాన్సర్ కణాల ద్వారా లేదా దానికి ప్రతిస్పందనగా శరీరం ద్వారా ఉత్పత్తి అయ్యే పదార్థాలు. ఈ పరీక్షల్లో కొన్ని ముఖ్యమైనవి..
PSA (ప్రోస్టేట్-స్పెసిఫిక్ యాంటిజెన్) పరీక్ష: ఇది పురుషులలో ప్రోస్టేట్ క్యాన్సర్‌ను గుర్తించడానికి ఉపయోగించే ముఖ్యమైన మార్కర్. ప్రోస్టేట్ గ్రంధి తయారు చేసే ప్రోటీన్ స్థాయిలను ఇది కొలుస్తుంది.
CA-125 (క్యాన్సర్ యాంటిజెన్ 125): స్త్రీలలో అండాశయ క్యాన్సర్‌ను గుర్తించడానికి.. చికిత్స ప్రభావాన్ని పర్యవేక్షించడానికి ఈ పరీక్ష ఉపయోగిస్తారు.
AFP (ఆల్ఫా-ఫెటోప్రోటీన్): కాలేయ క్యాన్సర్ , వృషణ లేదా అండాశయ క్యాన్సర్ వంటి కొన్ని రకాల జెర్మ్ సెల్ ట్యూమర్‌లను గుర్తించడానికి ఇది ఉపయోగపడుతుంది.
3. రక్త ప్రోటీన్ పరీక్షలు (Blood Protein Tests):
రక్తంలోని అసాధారణ ప్రోటీన్ స్థాయిలను కొలవడానికి ఈ పరీక్షలు చేస్తారు. మైలోమా వంటి రక్త క్యాన్సర్లను గుర్తించడంలో ఇది ముఖ్యమైనది. ఎలక్ట్రోఫోరేసిస్ వంటి పరీక్షలు ఈ అసాధారణ ప్రోటీన్లను గుర్తిస్తాయి.
4. CEA (కార్సినోఎంబ్రియోనిక్ యాంటిజెన్) పరీక్ష:
కొలొరెక్టల్ (పెద్ద పేగు), రొమ్ము , ఊపిరితిత్తుల , ప్యాంక్రియాటిక్ క్యాన్సర్‌ల వంటి వివిధ రకాల క్యాన్సర్‌లను పర్యవేక్షించడానికి ఈ మార్కర్‌ను ఉపయోగిస్తారు. క్యాన్సర్ చికిత్స తర్వాత అది తిరిగి వచ్చిందా లేదా అని తెలుసుకోవడానికి ఇది సహాయపడుతుంది.
5. CA 19-9 (క్యాన్సర్ యాంటిజెన్ 19-9):
ముఖ్యంగా ప్యాంక్రియాటిక్ క్యాన్సర్‌ను నిర్ధారించడంలో.. చికిత్సకు ప్రతిస్పందనను పర్యవేక్షించడంలో ఈ మార్కర్ సహాయపడుతుంది.
Also Read: సీతాఫలం తినడం వల్ల ఎన్ని లాభాలో తెలిస్తే.. షాక్ అవుతారు
6. సర్కులేటింగ్ ట్యూమర్ సెల్ పరీక్షలు (Circulating Tumor Cell Tests):
ఇది ఒక రకమైన లిక్విడ్ బయాప్సీ. దీనిలో.. శరీరంలో తిరుగుతున్న క్యాన్సర్ కణాలను గుర్తించడానికి రక్తాన్ని పరీక్షిస్తారు. క్యాన్సర్ ఇతర భాగాలకు వ్యాపించిందో (మెటాస్టాసిస్) లేదో అంచనా వేయడానికి ఇది ఉపయోగపడుతుంది.
7. లాక్టేట్ డీహైడ్రోజినేస్ (LDH) పరీక్ష:
లాక్టేట్ డీహైడ్రోజినేస్ అనేది శరీరంలోని చాలా కణాలలో ఉండే ఎంజైమ్. క్యాన్సర్ కణాలు నశించినప్పుడు, ఈ ఎంజైమ్ రక్తంలో విడుదల అవుతుంది. ఈ స్థాయిలు పెరగడం లింఫోమా, లుకేమియా వంటి కొన్ని క్యాన్సర్‌లను లేదా ఇతర వ్యాధులను సూచించవచ్చు. క్యాన్సర్ పెరుగుదలను, చికిత్సకు ప్రతిస్పందనను పర్యవేక్షించడానికి ఇది సహాయపడుతుంది.