Diwali sweets adulteration test| దీపావళి వచ్చిందంటే చాలు.. ఇళ్లలో పండుగ సందడి మొదలవుతుంది. కొత్త బట్టలు, పూజలు, టపాసులతో పాటు స్వీట్లు కూడా ఈ సమయంలో అందరూ కొనుగోలు చేస్తారు. బంధువులు, స్నేహితులకు స్వీట్స్ బాక్సులు గిఫ్ట్ ఇవ్వడం ఈ పండుగ వేళ ఆనవాయితీ. అయితే మీరు ఎంతో ఇష్టంగా కొనుగోలు చేస్తున్న కాజు కత్లీ, బర్ఫీ, లడ్డూలు నిజంగా స్వచ్ఛమైనవేనా? వాటిలో కల్తీ పదార్థాలు ఉన్నాయా? అనే సందేహం చాలామందికి ఉంటుంది. ముఖ్యంగా పండుగ సమయంలో స్వీట్లకు డిమాండ్ పెరగడంతో కొందరు వ్యాపారులు తక్కువ ధరకు నాసిరకం పదార్థాలను ఉపయోగించే అవకాశం ఉంది. అయితే కొన్ని సాధారణ పరీక్షలతో స్వీట్లలో కల్తీకి సంబంధించిన అనుమానాలను ప్రాథమికంగా గుర్తించవచ్చు. ఆ వివరాలు తెలుసుకుందాం.
దీపావళి సమయంలో స్వీట్ల విక్రయాలు భారీగా పెరుగుతాయి. స్వీట్ షాపులకు పెద్ద సంఖ్యలో ఆర్డర్లు వస్తుంటాయి. ఈ డిమాండ్‌ను పూర్తి చేయడానికి కొందరు తయారీదారులు చౌకైన పదార్థాలను ఉపయోగించవచ్చు. ముఖ్యంగా పాలు, పాలతో తయారయ్యే పదార్థాల్లో కల్తీ జరిగే అవకాశం ఉంటుంది. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) ప్రకారం, పాలలో నీరు, పిండి పదార్థాలు వంటి కల్తీలు ఉండవచ్చు. డిటర్జెంట్, యూరియా వంటి హానికర పదార్థాలు కూడా కల్తీకి ఉపయోగించే అవకాశం ఉంది.
స్వీట్ల బాక్సుపై తయారీ తేదీ, గడువు తేదీ ఉన్నాయో లేదో చూడండి. తయారీదారు వివరాలు, ఫుడ్ సేఫ్టీ లైసెన్స్ సమాచారాన్ని కూడా పరిశీలించండి. ప్యాకింగ్ దెబ్బతిన్న స్వీట్లను కొనకండి.
మార్కెట్ ధర కంటే చాలా తక్కువకు స్వీట్లు విక్రయిస్తుంటే అప్రమత్తంగా ఉండండి. భారీ డిస్కౌంట్లను చూసి వెంటనే కొనుగోలు చేయకండి. నాణ్యత, పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలి.
పరిశుభ్రత పాటించే పేరున్న దుకాణాల్లో స్వీట్లు కొనుగోలు చేయండి. ముఖ్యంగా పాలతో తయారైన స్వీట్లను సరైన ఉష్ణోగ్రతలో నిల్వ చేస్తున్నారో లేదో గమనించండి.
ఒక చిన్న స్వీట్ ముక్కను నీటిలో కరిగించండి. అందులో కొన్ని చుక్కల అయోడిన్ లిక్విడ్ కలపండి. ఆ మిశ్రమం బ్లూ కలర్‌లోకి మారితే పిండి పదార్థాలు ఉన్నాయనే అనుమానం కలుగుతుంది.
స్వీట్ కలిపిన నీటిని ఒక పాత్రలో వేసి బాగా కదపండి. ఎక్కువగా నురుగు ఏర్పడి అలాగే ఉంటే డిటర్జెంట్ కల్తీ ఉండే అవకాశం ఉంది. అయితే నురుగు రావడం మాత్రమే కల్తీకి కచ్చితమైన ఆధారం కాదు.
Also Read: మీ బీపీ ఎప్పుడూ ఎక్కువగా ఉంటోందా? ముందు కిచెన్‌లో ఈ 5 ఫుడ్స్ తీసి పడేయండి
చాలా స్వీట్లపై అందంగా కనిపించేందుకు సిల్వర్ పేపర్ ఉపయోగిస్తారు. అయితే కొందరు వ్యాపారులు అసలైన వెండికి బదులుగా అల్యూమినియం ఫాయిల్ ఉపయోగించవచ్చు. అందుకే ఒక చిన్న శాంపిల్ వేడి చేసి టెస్ట్ చేయాలి. అసలైన వెండి మెరుస్తూ చిన్న బంతులుగా మారుతుంది. అల్యూమినియం బూడిదలాంటి అవశేషాలను వదిలే అవకాశం ఉంటుంది. అయితే ఇది కచ్చితమైన పరీక్ష కాదు. ఇంట్లో ఈ విధంగా వేడి చేయడం ప్రమాదకరం.
Also Read: గుండె నరాల్లో బ్లాకేజీని ముందుగానే గుర్తించవచ్చా? ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త
ఇంట్లో చేసే పరీక్షలు కల్తీపై ప్రాథమిక అవగాహన మాత్రమే ఇస్తాయి. స్వీట్లు పూర్తిగా సురక్షితమైనవని నిర్ధారించలేవు. అనుమానంగా ఉంటే ఆ స్వీట్లు తినకపోవడమే మంచిది. అవసరమైతే ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేయండి. క్వాలిట స్వీట్లు కొనుగోలు చేస్తూ కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని కాపాడుకోండి.