China: ఫ్యాషన్ ప్రపంచంలోకి అడుగువాళ్లు తమ పాత జీవితం, ఉద్యోగాలను వదిలిపెడతారు. పైన కనిపిస్తున్న 20 ఏళ్ల లెంగ్ కథ భిన్నం. ఫేమస్సయిన మిలన్ ఫ్యాషన్ వీక్ వేదికపై మోడలింగ్ చేస్తోంది. మరోవైపు చెత్త కార్మికురాలిగా తన వృత్తిని కంటిన్యూ చేస్తోంది. మోడలింగ్‌లో ఓ రేంజ్ కి వెళ్లినప్పటికీ తన ఉద్యోగాన్ని వదులుకోవడానికి ఇష్టపడలేదు. చెత్తతో పని చేయడం తనకు ఇష్టమని, నిజాయితీగా చేసే ఏ పని చిన్నది కాదని తేల్చేసింది.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోతో లైమ్ లైట్‌లోకి వచ్చేసింది లెంగ్ అనే 20 ఏళ్ల యువతి. చైనాలోని తైజౌలో తన ప్రియుడి కుటుంబానికి చెందిన వ్యర్థాల నిర్వహణలో కార్మికురాలిగా పని చేస్తోంది. ఆమె చెత్తను వేరు చేస్తున్న వీడియో చైనా సోషల్ మీడియాలో పోస్ట్ అయ్యింది. ఆ వీడియోలో ఆమె అందం, మోడల్ తరహాలో ఆమెని చూసి ప్రజలు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. వైరల్ అయిన వీడియో ఆమె మోడలింగ్ ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. తోటి మోడల్ లూ జియాన్‌రెన్ ఆమెకు మోడలింగ్ అవకాశాన్ని కల్పించాడు.
27 ఏళ్ల వయసున్న లూ.. చైనాలోని అగ్రశ్రేణి పురుష మోడళ్లలో ఒకడు. దక్షిణ చైనాలోని గ్రామీణ గ్వాంగ్జీ జువాంగ్ ప్రాంతానికి చెందినవాడు. అతడు తల్లిదండ్రులు గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్స్‌లో పని చేస్తున్నారు. తాత-నానమ్మల వద్ద పెరిగాడు. లూ స్వయంకృషితో మోడలింగ్ నేర్చుకున్నాడు. పొలాల్లో తనదైన శైలిలో క్యాట్‌వాక్ చేస్తూ చేసిన వీడియోలను అందరి దృష్టిని ఆకర్షించాడు. 2019లో ఫ్యాషన్ షోలతో పాల్గొనే అవకాశం దక్కింది. లూ.. చైనా ఫ్యాషన్ వీక్, పారిస్ ఫ్యాషన్ వీక్, మిలన్ ఫ్యాషన్ వీక్ వంటి ప్రతిష్టాత్మక అంతర్జాతీయ ఫ్యాషన్ వేదికలపై వాక్ చేశాడు. గతేడాది మోడలింగ్ ఆకాంక్షలున్న గ్రామీణ ప్రాంతాల యువతులను మద్దతు ఇవ్వాలని తన కోరిక బయటపెట్టాడు. ఆ తర్వాత ఆమెకి అవకాశం కల్పించాడు.
ఫలితంగా కొన్ని నెలల్లోనే లెంగ్.. చైనా, విదేశాల్లో జరిగే ప్రధాన ఫ్యాషన్ వేదికలపై ర్యాంప్ వాక్ చేయడం ప్రారంభించింది. లెంగ్ జీవితం ఇంత వైభవంగా లేదు. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్‌కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో.. తన జీవితం గురించి కొన్ని విషయాలు బయట పెట్టింది. చిన్నతనంలో యువతి తల్లిదండ్రులు విడిపోయారు. ఆమె కుటుంబ ఆర్థిక పరిస్థితి కష్టంగా మారింది. ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువు మానేసింది. కుటుంబాన్ని పోషించడానికి వెయిట్రెస్‌గా పని చేయడం మొదలుపెట్టింది. ఆ తర్వాత చిన్న చిన్న మోడలింగ్ చేసేది.
అదే సమయంలో తన ప్రస్తుత భాగస్వామిని కలిసింది. ఆ తర్వాత ప్రియుడి కుటుంబానికి చెందిన వ్యర్థాల నిర్వహణ వ్యాపారంలో చేరింది. అక్కడ చెత్తలో వివిధ రకాల వ్యర్థాలను వేరు చేసి క్రమబద్ధీకరణ చేసేది. ఈ పని చేస్తున్న వీడియో వైరల్ కావడంతో ఆమె జీవితం కొత్త మలుపు తిరిగింది. మోడలింగ్‌లో మంచి పేరు ఉన్నప్పటికీ లెంగ్.. తన పాత ఉద్యోగాన్ని ఏ మాత్రం వదులుకోలేదు. ప్రియుడి ఫ్యామిలీతో కలిసి పనిచేయడం తనకు ఆనందంగా ఉంటుందని చెప్పుకొచ్చింది. వ్యర్థాల నిర్వహణ స్థిరమైన ఆదాయాన్ని, ఆర్థిక భద్రతను అందిస్తుందని చెప్పుకొచ్చింది ఆమె.
ఇదే సమయంలో చైనా టీవీ ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని విషయాలు స్పష్టంగా వివరించింది. చెత్త సేకరించడం తనకు జీవనోపాధిని కల్పిస్తుందని చెప్పింది. మోడలింగ్ అనేది తన కల అని చెప్పుకొచ్చింది. ఈ రెండు మార్గాలు విరుద్ధమైనవి కావని, నిజాయితీతో చేసే పనిని తక్కువ చేయకూడదని అంటోంది. తన పనితో సంతోషంగా ఉన్నానని, వీలు కుదిరినప్పుడల్లా మోడలింగ్‌లో కొనసాగించాలనే తన కలను వదులుకోలేదు లెంగ్. ర్యాంప్ వాక్, పోజులు, కెమెరా ముందు ప్రదర్శనను మెరుగుపరచుకోవడానికి నిరంతరం సాధన చేస్తోంది.
ALSO READ: అవకాశవాదులు.. ఈ తేదీల్లో పుట్టినవారు డబ్బు సంపాదించే మార్గాన్ని త్వరగా గుర్తిస్తారు
నార్మల్‌గా మోడలింగ్ అవకాశాలు అంత సులభంగా రావు. ప్రతి అవకాశం కోసం హార్డ్ గా వర్క్ చేయాలి. కాకపోతే ఆమె తన నడక, కదలికలు, పోజులు వంటి అతి చిన్న విషయాలపై ప్రత్యేకంగా శ్రద్ధ పెడుతోంది. కలలను నెరవేర్చుకోవడానికి పాత గుర్తింపును వదులుకోవాల్సిన అవసరం లేదని చెప్పేసింది. చెత్త సేకరణ అనేది బలవంతపు వృత్తి కాదని తేల్చేసింది.