Crispy potato fingers recipe: సాయంత్రం కాగానే ఏదో ఒకటి తినాలనిపించడం అందరికీ మామూలే. ముఖ్యంగా పిల్లలు స్కూల్ నుంచి రాగానే రుచి కరమైన స్నాక్స్ అడుగుతుంటారు.బయట దొరికే.. ఫాస్ట్ ఫుడ్స్ ఆరోగ్యానికి అంత మంచిది కాదు.అలాంటి సమయంలో మన ఇంట్లోనే అప్పటికప్పుడు.. ఎంతో రుచికరంగా, హైజెనిక్‌గా తయారు చేసుకోగల బెస్ట్ స్నాక్ క్రిస్పీ పొటాటో ఫింగర్స్ . బంగాళదుంపలతో చేసే ఈ స్నాక్ బయట క్రిస్పీగా, లోపల మెత్తగా ఉండి నోట్లో వేసుకుంటే ..కరిగిపోతుంది. ఈ ట్రెండీ రెసిపీని ఎలా తయారు చేయాలో ఇప్పుడు స్టెప్-బై-స్టెప్ చూద్దాం.
బంగాళదుంపలు: 3 లేదా 4
బియ్యం పిండి లేదా కార్న్‌ఫ్లోర్: 3 స్పూన్లు
అల్లం వెల్లుల్లి పేస్ట్: అర స్పూన్
కారం, మిరియాల పొడి: తగినంత
గరం మసాలా లేదా చాట్ మసాలా: అర స్పూన్
కొత్తిమీర తరుగు: కొద్దిగా
ఉప్పు: తగినంత
నూనె: వేయించడానికి సరిపడా
1.ముందుగా బంగాళదుంపలను శుభ్రంగా కడిగి కుక్కర్‌లో వేసి 3 నుంచి 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. బంగాళదుంపలు పూర్తిగా మెత్తగా కాకుండా కొద్దిగా గట్టిగా ఉండేలా చూసుకోవాలి. ఉడికిన తర్వాత.. పొట్టు తీసి పూర్తిగా చల్లారనివ్వాలి.చల్లారిన బంగాళదుంపలను ఒక గిన్నెలో తీసుకుని మెత్తగా.. మాష్ చేసుకోవాలి (లేదా తురుముకోవాలి). అందులోనే.. అల్లం వెల్లుల్లి పేస్ట్, తగినంత ఉప్పు, కారం, మిరియాల పొడి, చాట్ మసాలా,సన్నగా తరిగిన కొత్తిమీర వేయాలి. ఇప్పుడు బైండింగ్ కోసం అందులో బియ్యం పిండి లేదా కార్న్‌ఫ్లోర్ వేయాలి. పిండి వేయడం వల్ల మనం వేయించేటప్పుడు.. పొటాటో ఫింగర్స్ నూనెలో విడిపోకుండా క్రిస్పీగా వస్తాయి.వీటన్నింటినీ చపాతీ పిండిలా బాగా కలుపుకోవాలి.
Also Read: మునగాకు పచ్చడి ఇలా చేస్తే..అద్భుతమైన రుచితో పాటు ఫుల్ ప్రొటీన్స్!
2. ఇప్పుడు కలుపుకున్న మిశ్రమాన్ని చిన్న ఉండలుగా తీసుకొని, అరచేతిపై లేదా పీటపై పెట్టి పొడవుగా వేళ్లలాగా రోల్ చేసుకోవాలి.అన్నింటినీ ఒక ప్లేట్లోకి సిద్ధంగా ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాణలిలో డీప్ ఫ్రైకి సరి పడా నూనె పోసి వేడి చేయాలి. నూనె బాగా వేడెక్కిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్‌లో ఉంచాలి. తయారు చేసుకున్న.. పొటాటో ఫింగర్స్‌ను ఒక్కొక్కటిగా నూనెలో వేయాలి.ఇవి బంగారు రంగులోకి వచ్చే వరకు, కరకరలాడే వరకు బాగా వేయించాలి.వేయించిన క్రిస్పీ పొటాటో ఫింగర్స్‌ను టిష్యూ పేపర్‌లోకి తీసుకుంటే అదనపు.. నూనె ఏమైనా ఉంటే తొలగిపోతుంది. అంతే..గుమగుమలాడే వేడివేడి క్రిస్పీ పొటాటో ఫింగర్స్ సిద్ధం!
ఈ క్రిస్పీ పొటాటో ఫింగర్స్‌ను టమాటా కెచప్ లేదా మైనానీస్‌తో తింటే.. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. తక్కువ ఖర్చుతో..తక్కువ సమయంలో ఇంట్లోనే హోటల్ స్టైల్ స్నాక్స్ తయారు చేయాలనుకుంటే ..ఈ రెసిపీ మీకు కచ్చితంగా నచ్చుతుంది. ఈ ఈవినింగ్ మీ ఇంట్లో దీన్ని తప్పకుండా ట్రై చేయండి!