Munagaku pachadi recipe: మనం రోజూ తీసుకునే ఆహారంలో.. ఆకుకూరలు ఉండేలా చూసుకోవడం మన ఆరోగ్యానికి చాలా ముఖ్యం. ముఖ్యంగా.. మునగాకులో ఉండే పోషక విలువల గురించి.. ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇందులో క్యాల్షియం, ఐరన్, విటమిన్ సి , విటమిన్ ఎ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అలాగే .. ప్రొటీన్ల శాతం కూడా ఎక్కువే. చాలా మంది మునగాకు కూర అంటే అంతగా ఇష్టపడరు. అలాంటి వారి కోసం ఈ పోషకాలు.. అన్నీ అందేలా ఒక రుచికరమైన మునగాకు పచ్చడి రెసిపీని ఇప్పుడు తెలుసుకుందాం. ఇది కేవలం రుచిలోనే కాదు,ఆరోగ్యానికి కూడా సూపర్‌గా పని చేస్తుంది.
తాజా మునగాకు: 2 కప్పులు
శనగపప్పు, మినపప్పు: తలా 2 స్పూన్లు
పచ్చిమిరపకాయలు లేదా ఎండుమిరపకాయలు: 6 నుంచి 8
చింతపడి: చిన్న నిమ్మకాయ సైతం
వెల్లుల్లి రెబ్బలు: 6 నుంచి 8
జీలకర్ర: 1 స్పూన్
నూనె: 2 స్పూన్లు
ఉప్పు, పసుపు: తగినంత
పోపు దినుసులు: ఆవాలు, కరివేపాకు
1.ముందుగా తాజా మునగాకును తీసుకుని కాడల నుంచి ఆకులను విడదీయాలి. పురుగు లేకుండా శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఆకుల్లోని తడి పూర్తిగా ఆరిపోయే వరకు నీడలో ఆరబెట్టాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి, రెండు స్పూన్ల నూనె వేయాలి. నూనె వేడెక్కిన తర్వాత శనగపప్పు, మినపప్పు, జీల కర్ర వేసి దోరగా వేయించాలి.పప్పులు మంచి సువాసన వచ్చే వరకు వేగాక వాటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అదే ప్యాన్2లో పచ్చిమిరపకాయలు (లేదా ఎండుమిరపకాయలు), వెల్లుల్లి రెబ్బలు వేసి కొద్దిగా వేయించాలి. ఇవి వేగాక వీటిని కూడా పక్కన పెట్టుకోవాలి.
Also Read: వేడి వేడి పన్నీర్ పకోడి..ఇంట్లోనే ఇలా చేయండి,టేస్ట్ అద్దిరిపోతుంది!
2. ఇప్పుడు అదే ప్యాన్2లో శుభ్రం చేసి పెట్టుకున్న మునగాకును వేయాలి. మునగాకు పచ్చివాసన పోయి, మెత్తగా మగ్గే వరకు మీడియం మంటపై రెండు మూడు నిమిషాల పాటు కలుపుతూ వేయించాలి. ఆకు బాగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో ముందుగా వేయించి పెట్టుకున్న పప్పులు, మిరపకాయలు, తగినంత ఉప్పు, చింతపండు వేసి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేయాలి. ఆ తర్వాత మగ్గించి.. పెట్టుకున్న మునగాకును అందులో వేసి, నీళ్లు ఎక్కువగా పోయకుండా కొద్దిగా కలుపుతూ మందపాటి పేస్ట్‌లా.. రుబ్బుకోవాలి. చివరగా ఒక చిన్న గిన్నెలో నూనె వేడి చేసి.. ఆవాలు, జీలకర్ర, ఎండు మిరపకాయలు, కరివేపాకు , చిటికెడు ఇంగువ వేసి తాలింపు తయారు చేయాలి. ఈ తాలింపును పచ్చడిలో కలిపితే గుమగుమలాడే మునగాకు పచ్చడి రెడీ!
ఈ మునగాకు పచ్చడిని వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే అమృతంలా ఉంటుంది. ఇది కేవలం రుచిని మాత్రమే కాదు, శరీరానికి కావలసిన శక్తిని, ప్రొటీన్లను అందిస్తుంది. బరువు తగ్గాలనుకునే వారు, షుగర్ లెవెల్స్ అదుపులో ఉంచుకోవాలనుకునే వారు ఈ పచ్చడిని తమ డైట్‌లో చేర్చుకోవడం చాలా మంచిది. ఈజీగా తయారు చేసుకునే ఈ ఆరోగ్యకరమైన మునగాకు పచ్చడిని మీరు కూడా ఒక సారి తప్పకుండా ట్రై చేయండి!