Amit Shah: బీజేపీ బిగ్ షాట్స్ ఎప్పుడు తెలంగాణకు వచ్చినా.. సినీ ప్రముఖులు, హీరోలు, స్పోర్ట్స్ సెలబ్రిటీలను కలుస్తున్నారు. ముఖ్యంగా.. అమిత్ షా వచ్చినప్పుడు ఇలాంటి భేటీలు కనిపిస్తుంటాయ్. అవి.. మీడియా, సోషల్ మీడియా, రాజకీయ వర్గాల్లో ఫుల్ బజ్ క్రియేట్ చేస్తుంటాయ్. అమిత్ షా ఆ హీరోని కలవబోతున్నారట.. డైరెక్టర్‌తో భేటీ అవుతారట.. అనే ప్రచారం 2, 3 రోజుల నుంచే మొదలవుతుంది. కలిశాక.. మరో వారం పాటు దానిచుట్టే రకరకాల ప్రచారాలు, ఊహాగానాలు ఊపందుకుంటాయ్. అలా.. గడిచిన నాలుగేళ్లలో నలుగురైదుగురు టాప్ టాలీవుడ్ సెలబ్రిటీలను కలిశారు బీజేపీ బడా నేతలు. తెలంగాణ పర్యటనలో భాగంగా.. 2022 ఆగస్టులో అప్పటి బీజేపీ చీఫ్ జేపీ నడ్డా హీరో నితిన్‌ని, క్రికెటర్ మిథాలీ రాజ్‌ని కలిశారు. అదే నెలలో.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. జూనియర్ ఎన్టీఆర్‌ని కలిశారు. ట్రిపుల్ ఆర్ మూవీ సక్సెస్ అయినందుకు కంగ్రాట్స్ చెప్పారు. ఎన్టీఆర్‌ని కలిసినప్పుడు.. తెలంగాణ పాలిటిక్స్‌లో మునుగోడు బైపోల్ హీట్ నడుస్తోంది. 2022 సెప్టెంబర్‌లో కృష్ణంరాజు కుటుంబ సభ్యులను పరామర్శించే క్రమంలో.. హీరో ప్రభాస్‌ని కలిశారు అమిత్ షా. ఆ తర్వాత వెంటనే ఢిల్లీలో మిథాలీ రాజ్‌ని కలిశారు. కార్తికేయ-2 సినిమా పాన్ ఇండియా లెవెల్లో భారీ విజయం సాధించిన తర్వాత.. హీరో నిఖిల్, నిర్మాత అభిషేక్ అగర్వాల్‌ని అమిత్ షా ప్రత్యేకంగా అభినందించారు. 2023లో ట్రిపుల్ ఆర్ మూవీకి ఆస్కార్ వచ్చినందుకు గానూ చిరంజీవీ, రాంచరణ్‌ని కలిసి అభినందించారు. 2024 మార్చిలో హనుమాన్ మూవీ టీమ్‌ని కలిశారు అమిత్ షా. హీరో తేజా సజ్జాని, డైరెక్టర్ ప్రశాంత్ వర్మని అభినందించారు.
మెగాస్టార్ చిరంజీవితో అమిత్ షా భేటీ
ఇప్పుడు.. హైదరాబాద్‌లో మహా పాదయాత్ర కోసం వచ్చిన అమిత్ షా.. మెగాస్టార్ చిరంజీవితో భేటీ అవడం కూడా కొత్త చర్చకు దారితీసింది. ఇలా.. బీజేపీ నేతలు ఏదో ఒక సభ కోసమో, సందర్భం కోసమో తెలంగాణ టూర్‌కు వచ్చినప్పుడు.. వివిధ రంగాల్లోని పాపులర్ సెలబ్రిటీలను కలుస్తున్నారు. ఇవేవీ యాక్సిడెంటల్‌గా జరిగే భేటీలు కూడా కావు. దీని వెనుక పక్కా పొలిటికల్ స్ట్రాటజీ ఉంటుందనే చర్చ జరుగుతోంది. ఇదంతా సాఫ్ట్ పవర్ విస్తరణలో భాగమేనని భావిస్తున్నారు. రాజకీయ పార్టీల అగ్రనేతలు.. కేవలం పార్టీ నాయకులను కలిస్తే.. క్యాడర్‌కు మాత్రమే రీచ్ అవుతుంది. అదే, సినిమా స్టార్లు, సెలబ్రిటీలను కలిస్తే.. ఆటోమేటిక్‌గా యూత్‌లోనూ, పబ్లిక్‌లోనూ బాగా ట్రెండ్ అవుతుంది. బలమైన చర్చ జరుగుతుంది. ఇది.. పార్టీకి ఒక సానుకూల వాతావరణాన్ని సృష్టిస్తుంది.
బీజేపీ వ్యూహం..
తెలుగు రాష్ట్రాల్లో టాలీవుడ్ హీరోలకు విపరీతమైన ఫాలోయింగ్ ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో, వర్గాల్లో బలమైన ప్రభావం ఉన్న సెలబ్రిటీలను కలవడం ద్వారా ఆయా వర్గాలకు చేరువయ్యేందుకు.. బీజేపీ సానుకూల సంకేతాలు పంపుతుందనే వాదన కూడా ఉంది. తెలంగాణ లాంటి రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీల ప్రాబల్యాన్ని తట్టుకుని, బీజేపీ బలమైన ప్రత్యామ్నాయంగా ఎదుగుతోందనే పర్సెప్షన్‌ను క్రియేట్ చేయడానికి.. ఇలాంటి హై-ప్రొఫైల్ మీటింగ్స్ హెల్ప్ అవుతాయ్. జాతీయ నాయకత్వం రాష్ట్రంపై ఎంతలా ఫోకస్ పెట్టిందో చెప్పడానికి.. ఇవి ప్రచార అస్త్రాలుగా మారుతాయి. రాజకీయ సభలు, సమావేశాల కంటే.. ఇలాంటి సెలబ్రిటీ మీట్స్‌కు.. మీడియాలో, సోషల్ మీడియాలో విపరీతమైన కవరేజ్ లభిస్తుంది. దీనివల్ల పార్టీ అజెండా ప్రజల్లోకి మరింత వేగంగా దూసుకెళ్తుంది. ఇది కేవలం పర్సెప్షన్ క్రియేట్ చేయడం మాత్రమే కాదు, సినిమా రంగానికి, సమాజంలోని ప్రముఖులకు బీజేపీ ఎప్పుడూ సానుకూలంగా ఉంటుందనే సంకేతమిస్తుంది. పార్టీ పరిధులను విస్తరించుకునేందుకు.. హైకమాండ్ అమలు చేస్తున్న ఓ ఎన్నికల విస్తరణ వ్యూహం ఇది.
Also Read: నగరంలో చెత్త కనిపిస్తే ఉద్యోగాలు గోవిందా! అధికారులకు సీఎం రేవంత్ రఫ్ ఆడిచ్చే హెచ్చరిక!