Imran Khan: ముంబయిలో ఇటీవల జరిగిన సీజేపీ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నందుకు గాను నటుడు ఇమ్రాన్ ఖాన్‌కు అధికారులు ‘లీవ్ ఇండియా’ (దేశం విడిచి వెళ్లాలి) నోటీసు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నోటీసును సవాలు చేస్తూ ఇమ్రాన్ ఖాన్ బొంబాయి హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై సోమవారం విచారణ చేపట్టిన హైకోర్టు.. నటుడి తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అమెరికా పౌరుడిగా ఉంటూ భారత్ లో నిరసనలేంటని ప్రశ్నించింది. ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా (OCI) కార్డ్ నిబంధనలను ఎట్టిపరిస్థితుల్లోనూ ఉల్లంఘించవద్దని హెచ్చరించింది.
భారత పౌరుడెవరైనా విదేశాల్లో ఇలాంటి చర్యకు పాల్పడితే నెక్ట్స్ విమానంలోనే వారిని వెనక్కి పంపించేసేవారని బాంబే హైకోర్టు వ్యాఖ్యానించింది. అమెరికన్ సిటిజన్ షిప్ కార్డుపై ఇన్నాళ్లుగా భారత్ లో ఉంటున్నారని.. ఉన్నట్టుండి నిరసనల్లో ఎందుకు పాల్గొన్నారని ప్రశ్నించింది. ఓసీఐ కార్డ్ ఉన్న వ్యక్తులకు పౌరులతో సమానంగా నిరసన తెలిపే హక్కులు ఉండవని కోర్టు గుర్తుచేసింది. ‘మీరు అమెరికా వెళ్లి ఎంతైనా నిరసనలు తెలుపుకోవచ్చు, అక్కడ ఓటు కూడా వేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఉంటూ నిరసనలు చేయడం సహించబోం’ అని ఘాటుగా వ్యాఖ్యానించింది.
మరోవైపు ఎఫ్ఆర్ఆర్ఓ (FRRO) తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ కోర్టులో తమ వాదనలు వినిపిస్తూ.. ఈ నిరసన వెనుక ఉద్దేశం ఏంటో తెలిసినా ఆయన కావాలనే అందులో పాల్గొన్నారని చెప్పారు. భారత పౌరుడితో పోలిస్తే ఓసీఐ కార్డు కలిగిన ఇమ్రాన్ ఖాన్‌కు ఇక్కడ పరిమితమైన హక్కులు మాత్రమే ఉంటాయన్నారు. అయితే భారతదేశమే తన ఇల్లు అని.. తన నివాస హక్కును కాపాడాలని ఇమ్రాన్ ఖాన్ కోర్టును అభ్యర్ధించారు. తాను కేవలం రెండేళ్లు మాత్రమే అమెరికాలో గడిపానని.. తన బాల్యం, కుటుంబం, బిడ్డ, వృత్తిపరమైన జీవితం ఈ దేశంతోనే ముడిపడి ఉన్నాయని పిటిషన్ లో పేర్కొన్నారు. నిరసన కారులతో తనకు ఎలాంటి సంబంధం లేదని, దీనిపై అఫిడవిట్ దాఖలు చేసేందుకు సైతం సిద్ధంగా ఉన్నానని కోర్టుకు తెలిపారు. దేశంలో ఉండేందుకు అనుమతించాలని ప్రాధేయ పడ్డారు.
ఇమ్రాన్ ఖాన్ అభ్యర్థనపై బాంబే హైకోర్టు స్పందిస్తూ.. కేవలం అఫిడవిట్ దాఖలు చేస్తే సరిపోదని వ్యాఖ్యానించింది. చిన్నప్పటి నుంచి భారత్‌లోనే నివసిస్తున్న ఇమ్రాన్ ఖాన్.. ఇన్నాళ్లుగా భారత పౌరసత్వం ఎందుకు స్వీకరించలేదని ప్రశ్నించింది. భారత్‌లో 4 దశాబ్దాలకు పైగా నివసించడం వల్ల తాను అమెరికా పౌరసత్వం కలిగిన వ్యక్తిననే విషయాన్ని ఇమ్రాన్ ఖాన్ మరిచిపోయినట్లు ఉన్నారని వ్యాఖ్యానించింది. ఇమ్రాన్ ఖాన్ భేషరతుగా క్షమాపణ చెప్పాలని ఆదేశించింది. మరోవైపు విదేశాలకు పంపకుండా ఇమ్రాన్ ఖాన్ కు గతంలో ఇచ్చిన తాత్కాలిక స్టేను డిసెంబర్ 7 వరకు పొడిగిస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది.
Also Read: ఆన్‌లైన్ హోటల్ రివ్యూలు చూసి మోసపోతున్నారా? ఫేక్ రివ్యూలను కనిపెట్టే సింపుల్ ట్రిక్స్ ఇవే!
కాగా, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని కోరుతూ జరిగిన సీజేపీ నిరసనలో పాల్గొనడంతో ముంబై పోలీసులు ఇమ్రాన్ ఖాన్‌ను అదుపులోకి తీసుకున్నారు. అక్టోబర్ 28 నాటికి దేశం విడిచి వెళ్లాలని ఎఫ్ఆర్ఆర్ఓ ఆయనకు నోటీసులు పంపగా దానిని సవాలు చేస్తూ ఇమ్రాన్ ఖాన్ బాంబే హైకోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం కోర్టు డిసెంబర్ 7 వరకు తాత్కాలిక ఉపశమనం కల్పించింది. ఈ సందర్భంగా ‘వసుధైక కుటుంబం’ సూత్రాన్ని ప్రస్తావించిన కోర్టు.. సదరు నటుడు ఇక్కడే నివసించేలా అధికారులు దాతృత్వాన్ని ప్రదర్శిస్తారని ఆశిస్తున్నట్లు చమత్కరించింది.
Also Read: విమాన ప్రయాణం వేస్ట్.. ఈ రైలు జర్నీనే బెస్ట్.. 5-స్టార్ హోటల్ ఫీలింగ్!