Knife Sharpening: వంటగదిలో కూరగాయలు కోసేటప్పుడు కత్తులు మొద్దుబారిపోయి ఇబ్బంది పెడుతుంటాయి. అయితే వీటిని పదును పెట్టడానికి ఖరీదైన షార్పనర్స్ అవసరం లేదని నిపుణులు పేర్కొంటున్నారు. ఇంట్లోనే అందుబాటులో ఉండే సాధారణ వస్తువులను ఉపయోగించి కత్తులకు పదును పెట్టవచ్చని సూచిస్తున్నారు. అదెలాగో ఈ కథనంలో చూద్దాం.
కత్తులకు పదును పెట్టడంలో వెట్‌స్టోన్ (రాతి రంపం) అత్యంత ప్రభావవంతమైన పద్ధతిగా నిపుణులు చెబుతున్నారు. ముందుగా ఈ రాయిని నీటిలో లేదా కొద్దిగా మినరల్ ఆయిల్‌లో పది నిమిషాలు నానబెట్టాలి. ఆ తర్వాత కత్తి బ్లేడ్‌ను రాయిపై 15 నుండి 20 డిగ్రీల కోణంలో ఉంచి ముందుకు, వెనుకకు నిదానంగా రుద్దాలి. ఇలా రెండు వైపులా చేయడం వల్ల కత్తికి పదును వస్తుంది.
ఇంట్లో ప్రత్యేకంగా ఎలాంటి రాళ్ళు లేనప్పుడు, వంటగదిలో ఉండే సాధారణ సిరామిక్ కాఫీ లేదా టీ కప్ సరిపోతుంది. మగ్గును తలక్రిందులుగా తిప్పితే దాని అడుగు భాగంలో గరుకుగా ఉండే సిరామిక్ రింగ్ కనిపిస్తుంది. ఇప్పుడు కత్తి బ్లేడ్‌ను అదే కోణంలో ఉంచి మగ్గు అడుగు భాగంపై నెమ్మదిగా రుద్దాలి. కొన్ని నిమిషాలలోనే కత్తి పదును తేలుతుంది.
చాలామంది హోనింగ్ రాడ్‌ను కత్తికి పదును పెట్టే సాధనంగా భావిస్తారు. కానీ ఇది నిజానికి కత్తి అంచును సరిచేయడానికి ఉపయోగపడుతుంది. వంట చేయడానికి ముందు లేదా తర్వాత కత్తిని నిటారుగా పట్టుకుని హోనింగ్ రాడ్ పై నుండి కిందకు లాగాలి. ఇది కత్తి అంచుపై ఉన్న చిన్న చిన్న వంకరలను తొలగించి పదునుగా ఉంచుతుంది.
వెట్‌స్టోన్ లేకపోతే ఫైన్-గ్రెయిన్ శాండ్‌పేపర్ ఉపయోగించవచ్చు. ముందుగా దాన్ని ఒక చదునైన చెక్క ముక్క లేదా టేబుల్‌పై పరచాలి. అప్పుడు కత్తిని దానిపై వెనుకకు, ముందుకు రుద్దితే బ్లేడ్ పై ఉన్న గరుకుదనం పోయి మెరిసే పదును వస్తుంది.
Also Read: ఢిల్లీ ప్రజలకు శుభవార్త.. ‘గ్రీన్ క్రాకర్స్’ కాల్చుకునేందుకు సుప్రీంకోర్టు అనుమతి!
కత్తిని పదును పెట్టేటప్పుడు కొన్ని తప్పులు అస్సలు చేయవద్దని నిపుణులు సూచిస్తున్నారు. కత్తిని సరైన కోణంలో కాకుండా ఇష్టానుసారంగా రుద్దితే బ్లేడ్ దెబ్బతింటుందని తెలియజేస్తున్నారు. అలాగే కత్తిపై అధిక ఒత్తిడి పెట్టడం వల్ల బ్లేడ్ వంకర తిరిగే ప్రమాదం ఉంటుంది. పదును పెట్టే సమయంలో చేతులు జారి గాయాలయ్యే అవకాశం ఉన్నందున ఎప్పుడూ జాగ్రత్తగా వ్యవహరించాలని నిపుణులు సూచిస్తున్నారు.
Also Read: ఆన్‌లైన్ హోటల్ రివ్యూలు చూసి మోసపోతున్నారా? ఫేక్ రివ్యూలను కనిపెట్టే సింపుల్ ట్రిక్స్ ఇవే!