Adi Srinivas: తెలంగాణ రాజకీయాల్లో సిద్దిపేట వేదికగా మరోసారి వేడి రాజుకుంది. ఈ నెల 19న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్దిపేట పర్యటన నేపథ్యంలో, మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు బీఆర్ఎస్ నేతలపై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సీఎల్పీ మీడియా సెంటర్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సిరిసిల్ల తరహాలోనే సిద్దిపేటలోనూ కాంగ్రెస్ సత్తా చాటుతుందని స్పష్టం చేశారు.
హరీష్ రావు భాగోతాలు బయటపెడతాం
సీఎం రేవంత్ రెడ్డి సిద్దిపేటకు వస్తున్నారన్న వార్తతోనే హరీష్ రావు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని ఆది శ్రీనివాస్ ఎద్దేవా చేశారు. సిరిసిల్ల సభలో కేటీఆర్ ఫామ్ హౌస్‌లు, స్టార్ హోటళ్ల వ్యవహారాలను సీఎం బయటపెట్టారని, ఇప్పుడు హరీష్ రావు వంతు వచ్చిందని పేర్కొన్నారు. మామ కేసీఆర్‌ను అడ్డం పెట్టుకుని, ఇతర పార్టీల నేతలను ప్రలోభపెట్టి హరీష్ రావు సిద్దిపేటలో గెలుస్తూ వచ్చారని ఆయన ఆరోపించారు. ఇప్పటికే రంగనాయక సాగర్ భూములు, మిల్చి మిల్క్ డెయిరీ వ్యవహారాలను బయటపెట్టామని, 19న జరిగే సభలో ఆయన అసలు రూపాన్ని ప్రజల ముందుంచుతామని హెచ్చరించారు. ఈ సభతో హరీష్ రావు పతనానికి కౌంట్‌డౌన్ మొదలవుతుందని వ్యాఖ్యానించారు.
కవితకు రేవంత్ స్క్రిప్ట్ అక్కర్లేదు
కల్వకుంట్ల కుటుంబంలో ఆస్తుల పంపకాల్లో తేడా రావడంతోనే కవిత బయటకు వచ్చి కొత్త పార్టీ పెట్టుకున్నారని ఆది శ్రీనివాస్ అన్నారు. ప్రగతి భవన్, ఫామ్ హౌస్‌లలో పదేళ్ల పాటు జరిగిన వ్యవహారాలకు కవితే ప్రత్యక్ష సాక్షి అని, ఆమెకు రేవంత్ రెడ్డి స్క్రిప్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. హరీష్ రావు, సంతోష్ రావులపై కవిత చేస్తున్న అవినీతి ఆరోపణలపై దమ్ముంటే ప్రెస్‌మీట్ పెట్టి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కవిత కూడా కేవలం ఆరోపణలకే పరిమితం కాకుండా దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేయాలని సూచించారు.
ప్రవీణ్ కుమార్‌పై విమర్శలు, సంక్షేమ హామీలు
బీఆర్ఎస్‌లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఒక ‘బలికా బకరా’ అని, హరీష్, సంతోష్ రావుల మెప్పు కోసమే ఆయన కవిత పార్టీని విమర్శిస్తున్నారని ఆది శ్రీనివాస్ విమర్శించారు. 19న సిద్దిపేట వేదికగా రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల ఇందిరమ్మ బీమా పథకాన్ని సీఎం ప్రారంభిస్తారని తెలిపారు. ఆరు గ్యారెంటీల అమలుకు కట్టుబడి ఉన్నామని, త్వరలోనే 4.5 లక్షల మందికి కొత్తగా పింఛన్లు అందిస్తామని ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు.
Also Read: సీపీ సజ్జనార్‌పై సీబీఐ విచారణ జరిపించాలి.. సీఎం రేవంత్ రెడ్డికి రాజాసింగ్ లేఖ